మెజార్టీకి చేరువలో విజయ్..
x

మెజార్టీకి చేరువలో విజయ్..

టీవీకేకు సీపీఐ, సీపీఎం మద్దతు సంకేతాలు

 &
Click the Play button to hear this message in audio format

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చుట్టూ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)కు వామపక్ష పార్టీలైన సీపీఐ, సీపీఎం మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంపై చెన్నై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.

మెజార్టీకి చేరువలో విజయ్..

ప్రస్తుతం టీవీకేకు దాదాపు 108 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు సమాచారం. తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇప్పటికే కాంగ్రెస్ విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో ఈ సంఖ్య 113కు చేరినట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు సీపీఐ, సీపీఎం కూడా మద్దతు ఇస్తే టీవీకే బలం 117కు చేరే అవకాశం ఉంది. దీంతో మెజారిటీ మార్క్‌కు కేవలం ఒక సభ్యుడి దూరంలో మాత్రమే విజయ్ నిలుస్తారు.

వీసీకే నిర్ణయమే కీలకం..

ఇప్పుడంతా వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ తీసుకునే నిర్ణయంపైనే దృష్టి కేంద్రీకృతమైంది. వీసీకే మద్దతు లభిస్తే విజయ్ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

రాబోయే గంటల్లో వీసీకే తన అధికారిక వైఖరిని ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

బీజేపీ వ్యూహాలపై వామపక్షాల ఆందోళన..

బీజేపీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తోందని వామపక్ష వర్గాలు ఆరోపిస్తున్నాయి. అందుకే లౌకిక శక్తులు ఒక్కటిగా నిలవాలనే అభిప్రాయం పెరుగుతోందని సీపీఐ, సీపీఎం వర్గాలు చెబుతున్నాయి. “బీజేపీ పరిస్థితిని రాజకీయంగా తారుమారు చేయాలని చూస్తోంది. మేము అది జరగనివ్వం. త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటాం” అని వామపక్ష నాయకులు వెల్లడించినట్లు సమాచారం.

‘గవర్నర్ విజయ్‌ను ఆహ్వానించాలి’

ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మెజారిటీ మద్దతు ఉన్న కూటమి నాయకుడిగా విజయ్‌ను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ఆహ్వానించాలని సీపీఐ, సీపీఎంలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

“ప్రజాస్వామ్య సంప్రదాయాల ప్రకారం మెజారిటీ మద్దతు ఉన్న నాయకుడికి ముందుగా అవకాశం ఇవ్వాలి” అనే అభిప్రాయాన్ని వామపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.

ప్రమాణ స్వీకారానికి ముందు విజయ్ నుంచి అధికారిక మద్దతు లేఖలు కోరుతున్నారన్న వార్తలపై కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ అంశంపై వామపక్ష పార్టీల్లో అంతర్గత చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. పార్టీ సమావేశాల అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని నాయకులు సూచిస్తున్నారు.

చెన్నైలో పెరిగిన పొలిటికల్ హీట్..

ఈ పరిణామాలతో చెన్నై రాజకీయాలు మరింత వేడెక్కాయి. బీజేపీ వ్యతిరేక శక్తులు ఒకే వేదికపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తుండగా, తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈరోజు రాత్రిలోపు టీవీకే నేతృత్వంలోని కూటమి తుది రూపురేఖలు స్పష్టమయ్యే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

Read More
Next Story