Maharashtra Politics | కొత్త ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకి కాబోను: షిండే
x

Maharashtra Politics | కొత్త ప్రభుత్వ ఏర్పాటులో అడ్డంకి కాబోను: షిండే

మహారాష్ట్ర సీఎం ఎవరన్న విషయంపై కాస్త క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తుంది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కొత్త సీఎం విషయంలో షిండే ఎలా స్పందించారు?


ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్ర ప్రజల నోళ్లలో ఇప్పుడు నానుతున్నది సీఎం ఎవరన్న ప్రశ్న. ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేనే మళ్లీ కొనసాగుతారా? లేక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పగ్గాలు చేపడతారా? అన్న ఉత్కంఠకు షిండే ముగింపు పలికారు.

పీఎం నిర్ణయమే ఫైనల్..

ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బుధవారం థానేలో తొలిసారి విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘‘ప్రధానమంత్రి మోదీతో నిన్ననే మాట్లాడా. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో నేను అడ్డంకి కాకూడదనుకున్నా. సీఎం అభ్యర్థి ఎంపిక విషయం ప్రధాని మోదీకే వదిలేశాను. ఆయన నిర్ణయమే అంతిమం.’’ అని పేర్కొన్నారు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని బీజేపీ కోరుకుంటుండగా.. షిండే నేతృత్వంలోని శివసేన మాత్రం ఆయన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటుంది.

‘‘బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మహారాష్ట్రకు ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేసింది. అందుకు నేను ప్రధానికి కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రభుత్వ ఏర్పాటు సమయంలో నేను ఎలాంటి అడ్డంకి కలిగించను. ఈ విషయాన్ని నిన్న అమిత్ షాతో పాటు ప్రధానికి కూడా చెప్పాను." అని షిండే పేర్కొన్నారు.

ఓటర్లకు ధన్యవాదాలు..

‘‘మహాయుతి కూటమికి ఘనవిజయం అందించిన ఓటర్లకు నా కృతజ్ఞతలు. రెండున్నరేళ్లు సీఎంగా పని చేసే అవకాశం కల్పించారు. శివసైనికుడిని సీఎం చేయాలనే బాలాసాహెబ్ ఠాక్రే కలను ప్రధాని నెరవేర్చారు. మోదీ, అమిత్ షా నాకు అండగా నిలిచారు. అందుకు నేను గర్విస్తున్నాను. నేను నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన విషయం మీ అందరికి తెలుసు. పేదల బాధలను నేను అర్థం చేసుకోగలను. అందుకే లడ్కీ బహిన్ పథకం తీసుకొచ్చా. మహారాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రిగా కాకుండా సామాన్యుడిలా పనిచేశా. నేను సీఎం అయిన ఆరు నెలల్లో మహారాష్ట్రను నంబర్ 3 నుంచి నంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లడానికి కృషి చేశాం. MVA హయాంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను మళ్లీ ప్రారంభించాం. కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చాం. ఘనవిజయాన్ని అందించిన మహారాష్ట్ర ప్రజలకు, ఓటర్లకు మరోసారి ధన్యవాదాలు’’ అని షిండే పేర్కొన్నారు.

Read More
Next Story