ఎగ్జిట్ పోల్స్ చర్చల్ని కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించినట్టు?
x

ఎగ్జిట్ పోల్స్ చర్చల్ని కాంగ్రెస్ ఎందుకు బహిష్కరించినట్టు?

ఈవేళ సాయంత్రం 6 గంటల తర్వాత మీడియాలో ప్రసారమయ్యే ఎగ్జిట్ పోల్ చర్చలకు దూరంగా ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది.


జూన్ ఒకటో తేదీ సాయంత్రం 6 గంటల తర్వాత మీడియాలో ప్రసారమయ్యే ఎగ్జిట్ పోల్ చర్చలకు దూరంగా ఉండాలన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయంపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. గెలుపు ధీమాతో ఉన్న బీజేపీ లోక్ సభ ఎన్నికల్లో ఓటమిని ఫలితాలకు ముందే అంగీకరించిందని బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డా లాంటి వారు వ్యాఖ్యానిస్తుంటే.. అసలు ఫలితాలే మరో 48 గంటల్లో రానున్నప్పుడు మళ్లీ ఈ ఊహాగానాలు ఎందుకని కాంగ్రెస్ నాయకులు తిప్పికొట్టారు.

ఎగ్జిట్ పోల్స్ లో పాల్గొనకూడదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్ణయంపై విరుచుకుపడిన షా.. కాంగ్రెస్ "తిరస్కార ధోరణి"తో ఉందని ధ్వజమెత్తారు. పార్లమెంటు ఎన్నికల తుది దశ అయిన ఏడో విడత పోలింగ్ శనివారం సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. ఈ పోలింగ్ ముగిసిన వెంటనే పలు జాతీయ ఛానళ్లు ఎగ్జిట్ పోల్స్ పేరిట పలు ప్రసార, చర్చా కార్యక్రమాలను చేపట్టాయి. ఈ చర్చలకు కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది.
"తాను మెజారిటీ సాధిస్తుందని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారం చేసింది. కానీ అది ఇప్పుడు వాస్తవాన్ని గ్రహించింది. ఎన్నికల తర్వాత ప్రసారం చేయబోయే ఎగ్జిట్ పోల్స్‌లో ఓటమిని ఎదుర్కొంటుందని తెలుసు. అందుకే చర్చలకు దూరం అంటోంది" అని అమిత్ షా అన్నారు. మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పే స్థితిలో కాంగ్రెస్ లేదు. అందుకే కాంగ్రెస్ మొత్తం ఎగ్జిట్ పోల్ కసరత్తుకే అర్థం లేదని చెబుతోందని అమిత్ షా అంటున్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించే కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పులపైన, కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారాలపైన దుష్ప్రచారం చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని అమిత్ షా సలహా ఇచ్చారు.
"బీజేపీ అనేక సర్వేలలో ఓడిపోయింది కానీ మీడియాను లేదా ఎగ్జిట్ పోల్స్‌ను ఎన్నడూ బహిష్కరించలేదు" అన్నది అమిత్ షా వాదన. ఎగ్జిట్ పోల్స్ పాలకపక్ష కూటమికి "400 ప్లస్ సీట్లు వస్తాయని రుజువు చేయబోతున్నాయన్నారు.
ఎగ్జిట్ పోల్ చర్చలను దాటవేయాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ప్రతిపక్ష పార్టీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించడమేనని "నిస్సందేహంగా చెప్పవచ్చు" అన్నారు నడ్డా.
ఊహాగానాలకు తావివ్వం: కాంగ్రెస్
వార్తా ఛానళ్లలో లోక్‌సభ ఎగ్జిట్ పోల్ చర్చలో పాల్గొనకూడదని తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా చేస్తున్న ట్వీట్లను, ప్రకటనలను కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. టీఆర్పీల రేటింగ్ కోసం మీడియా చేసే ఊహాగానాల్లో తాము మునిగితేలాలని అనుకోవడం లేదన్నది కాంగ్రెస్ వాదన.
"జూన్ 4న ఫలితాలు రానున్నాయి. దానికి ముందు టీఆర్‌పీ కోసం ఊహాగానాలకు, స్లాగ్‌ఫెస్ట్‌లకు మేము ఎందుకు పాల్గొనాలో కారణం కనిపించడం లేదు" అన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా.
"కాంగ్రెస్ నిర్ణయం 960 మిలియన్లకు పైగా ఉన్న ఓటర్ల ఆకాంక్షల్ని వ్యతిరేకించడమేనన్న నడ్డా విమర్శను కాంగ్రెస్ పార్టీ చాలా తేలిగ్గా తీసుకుంది.
ఎన్నికల్లో గెలవడానికి కసరత్తు చేయడానికి బదులుగా పార్టీ సుస్థిరతకు పాటు పడి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ కాంగ్రెస్ కు చురకలంటించారు నడ్డా. ఎగ్జిట్ పోల్ కసరత్తును బహిష్కరించాలని నిర్ణయించుకోవడం ద్వారా వారు అనేక వృత్తిపరమైన ఏజెన్సీలు నిర్వహిస్తున్న ప్రక్రియను ప్రశ్నిస్తున్నారని నడ్డా ఆరోపించారు. ‘‘జూన్ 4న అసలు ఫలితాలు వెలువడే విషయం అందరికీ తెలిసిందేనని, కాంగ్రెస్‌ను అపహాస్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాంగ్రెస్ ఎలా వాదిస్తుందని ప్రశ్నించారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన "పిల్లవాడిలా ప్రవర్తనలా ఉందని" బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
దీనికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖేరా ఘాటుగా జవాబు ఇచ్చారు. ఎగ్జిట్ పోల్స్‌పై చర్చల్లో భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనదన్నారు. ఓటర్లు తమ ఓటు వేశారని, వారి తీర్పు సురక్షితంగా ఉందన్నారు. “జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దానికి ముందు టీవీల రేటింగ్ కోసం జరిగే ఊహాగానాలు, చర్చల్లో మునిగితేలాలని మేము అనుకోవడం లేదు. జూన్ 4 నుంచి జరిగే చర్చల్లో సంతోషంగా పాల్గొంటాం. మా అభిప్రాయమేమిటో ప్రజలకు తెలియజేస్తాం. చర్చల ఉద్దేశం అలా ఉండాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది అని చెప్పారు ఖేరా.
కాంగ్రెస్ తప్పు చేస్తోందా?
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల ముందు రాజకీయ పరిస్థితులు సజావుగా లేవని, అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఇచ్చేవిగా ఈసీ పోకడలు కనిపించడం లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ అసలు పోల్ బాయకాట్ చేసి ఉండాల్సిందన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. అంతటి గొప్ప సాహసం చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ బాగా పెరిగేదన్న వాదనా లేకపోలేదు. నాలుగో తేదీ ఓట్ల లెక్కింపులో ఏ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు లేదా సీట్లు వస్తాయని అంచనావేసి చెప్పే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై టీవీ స్టూడియోల్లో జరిగే చర్చలను అగ్రగామి జాతీయపార్టీ అయినా కాంగ్రెస్ బహిష్కరించడం ఇదే మొదటిసారి. ఈ పార్లమెంటు ఎన్నికలను రాహుల్ గాంధీ బాయకట్ చేసి ఉంటే..వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 150 సీట్లు దాటిపోయేది. 18వ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్కోరు 2019 నాటి 52 సీట్ల నుంచి 85-100 స్థానాల వరకూ పెరుగుతుందని ప్రఖ్యాత రాజకీయ, ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అంచనా వేశారు. ఇటువంటి పరిస్థితి ఉన్నా... ఎగ్జిట్ పోల్ బాయకాట్ కు కాంగ్రెస్ ఎందుకు దిగిందో అర్థం కావడం లేదన్నది మీడియా ప్రతినిధుల వాదన.
18వ లోక్‌సభ ఎన్నికలు-2024లో ఏడవ, చివరి దశ ఈవేళ (జూన్ 1న) ముగుస్తుంది. ఓటింగ్ ముగిసిన తర్వాత ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల సరళిపై ఎగ్జిట్ పోల్ ఫలితాలు సాయంత్రం 6 గంటల తర్వాత వార్తా ఛానెళ్లలో ప్రసారం కానున్నాయి.


Read More
Next Story