బీజేపీపై ఖర్గే ఫైర్ : ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పిందెవరు?
x

బీజేపీపై ఖర్గే ఫైర్ : ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని చెప్పిందెవరు?

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.


కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు. తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని గ్రాండ్ ఓల్డ్ పార్టీ భావిస్తోందని షా చెబుతుండడాన్ని ఖర్గే తీవ్రంగా తప్పబట్టారు. సమాజంలో చీలికలు సృష్టించడానికే బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఖర్గే పూణేలో విలేఖరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ గురించి, పార్టీ సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గురించి చులకనగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు.

అమిత్ షాకు చురకలు..

"జమ్ము కాశ్మీర్‌‌లో కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 370 తిరిగి తీసుకురావాలని చూస్తోందని అమిత్ షా ఎన్నికల ప్రచారాల్లో చెబుతున్నారు. అసలు నాకు ఒక విషయం చెప్పండి. ఆర్టికల్ 370 తీసుకొస్తామని ఎవరు చెప్పారు? ఎక్కడ చెప్పారు? జమ్మూ, కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని ఆగస్టు 2019లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కాశ్మీర్‌లో ఎన్నికలు కూడా ముగిశాయి. ఇంకా ఎందుకు తప్పడు ప్రచారం చేస్తారు’’ అని షాపై ఖర్గే మండిపడ్డారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘బీజేపీ నాయకుడొకరు 'బాటేంగే తో కటేంగే' అని అంటున్నారు. అంటే దానర్థం ఏమిటని?’’ అని కాంగ్రెస్ చీఫ్ ప్రశ్నించారు.

'దేశం సమైక్యంగానే ఉంది'

"ఎందుకు 'బాటేంగే తో కటేంగే' అని మాట్లాడతారు.? దేశం సమైక్యంగా ఉంది. సమైక్యంగా ఉంచడానికి కాంగ్రెస్ పనిచేసింది. దేశాన్ని సమైక్యత కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ తమ ప్రాణాలను త్యాగం చేశారు. మహాత్మా గాంధీ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసింది. కానీ మీరు దేశ ఐక్యత కోసమో, స్వాతంత్ర్యం కోసమో, పేదల కోసమో పోరాడలేదు" అని ఖర్గే అన్నారు.

రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దే..

విద్యా, ఉద్యోగాల్లో ఎస్సీ/ఎస్టీల రిజర్వేషన్ల కోసం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ కృషి చేశారని, రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌దేనని గుర్తు చేశారు. ‘‘బీజేపీ వాళ్లు ఇప్పటికీ రిజర్వేషన్ అంశాన్ని లేవనెత్తుతున్నారు. త్రివర్ణ పతాకం మధ్యలో ఉన్న అశోక్ చక్రాన్ని అంగీకరించడానికి వారు సిద్ధంగా లేరు. మనుస్మృతి, పురాతన మత గ్రంథం ఆధారంగా రాజ్యాంగం ఉండాలని కోరుకుంటున్నారు.’’ అని ఖర్గే అన్నారు.

ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం..

దేశాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్ కోరుకుంటోందని, దాని కోసం ఎంతటి త్యాగానికైనా మేం సిద్ధమని ఏఐసీసీ అధ్యక్షుడు అన్నారు. దేశంలో కేవలం 5 శాతం మంది మాత్రమే 62 శాతం సంపదను కలిగి ఉన్నారని, 50 శాతం మంది వద్ద కేవలం 3 శాతం మాత్రమే సంపద ఉందని పేర్కొన్నారు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన మోదీ ప్రభుత్వ రంగ యూనిట్లను ప్రైవేటుపరం చేస్తూ తన స్నేహితులను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. ‘‘అదానీకి ఇచ్చిన ఓడరేవులో డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. అక్టోబర్‌లో 400 కిలోల కొకైన్ పట్టుకున్నారు. ఫిబ్రవరిలో 4,000 కిలోల చరస్‌ పట్టుకున్నారు. పుణె, బెంగళూరు, పంజాబ్‌లో యువత జీవితాలు నాశనమవుతున్నాయి.”అని ఖర్గే ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ రాష్ట్రాల్లో విజయవంతంగా పథకాల అమలు..

మహారాష్ట్రలో అధికారంలోకి వస్తే మేనిఫెస్టోల్లో పేర్కొన్న పథకాల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారన్న ప్రశ్నకు.. ‘మాకు అధికారం ఇవ్వండి, మీకు బడ్జెట్‌ ఇస్తాం. బడ్జెట్‌ ప్రకారం పని చేస్తున్నాం. మాకు డబ్బు పెట్టెలు మీద నమ్మకం లేదు. మాకు ఆలోచన ఉంది. దాన్ని ఆచరణలో పెడతాం’’ అని ఖర్గే సమాధానమిచ్చారు. హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, కర్నాటకలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వాలు విజయవంతంగా అమలు చేశాయని ఖర్గే చెప్పుకొచ్చారు. విదర్భ, మరఠ్వాడా, నాసిక్ ప్రాంతాల్లో పర్యటించినపుడు సోయాబీన్, పత్తి, ఉల్లి పంటలకు గిట్టుబాటు ధరలు కావాలని రైతులు కోరారని చెప్పారు. అధికారంలోకి వస్తే క్వింటాం సోయాబీన్ రూ.7వేలకు కొంటామని, ఉల్లి ధరల నియంత్రణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 50 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి బీజేపీ రూ.50 కోట్లు లంచం ఇవ్వజూపారన్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యాఖ్యలకు ఖర్గే మద్దతు పలికారు.

Read More
Next Story