ప్రధాని మోదీకి కర్ణాటక సీఎం విసిరిన సవాల్ ఏమిటి?
ప్రధాని మోదీ హర్యానా ఎన్నికల ప్రచారంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. దీనికి సిద్ధరామయ్య ఇచ్చిన కౌంటర్ ఏమిటి?
ప్రధాని మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. మోదీ ఇటీవల హర్యానాలో పర్యటించారు. అక్కడ ఎన్నికల ప్రచారంలో సిద్ధరామయనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ముడా కుంభకోణాన్ని మోదీ ప్రస్తావిస్తూ..“కర్ణాటకలో కాంగ్రెస్ పరిస్థితిని చూడండి. భూ కుంభకోణంలో కర్ణాటక సీఎం నిందితుడిగా ఉన్నారు. విచారణ ఉత్తర్వులు సరైనవేనని కర్ణాటక హైకోర్టు చెప్పింది. దళితుల నిధులకు సంబంధించిన కుంభకోణంలో కాంగ్రెస్ ప్రమేయం ఉంది’’ అని వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలకు సిద్ధరామయ్య ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు మోదీకి లేదన్నారు. ఆరోపణలు పక్కన పెట్టి ప్రత్యక్ష చర్చకు రావాలని సవాల్ విసిరారు.
మోదీకి నైతిక అర్హత లేదు..
“ముఖ్యమంత్రి పదవిని రూ.2,500 కోట్లకు సొంత పార్టీ నేతలే వేలం వేశారని ఆరోపిస్తున్న ప్రధానికి.. అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. సీఎం పదవిని అమ్ముకున్నారని బీజేపీ ఎమ్మెల్యే బహిరంగంగా ఆరోపించినా.. అతనిపై ఏ చర్యలు తీసుకోలేదు. బీజేపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నా మోదీ మౌనంగానే ఉన్నారు. అంటే మీరు కూడా ఈ అవినీతికి పాల్పడ్డారా?" అని మోదీని ప్రశ్నించారు సిద్ధరామయ్య.
అలాంటి వారిని చూయిస్తే సన్మానిస్తాం..
"మీరు అవినీతి గురించి ఉపన్యాసాలు ఇస్తారు. బాగానే ఉంది. కర్ణాటకలో అవినీతి మరక లేని ఒక్క బిజెపి నాయకుడిని కూడా మీరు చూయించగలరా? చూయించగలిగితే మేం మిమ్మల్ని ఆహ్వానించి సన్మానిస్తాం. హెచ్డి కుమారస్వామిని మీ వర్గంలో చేర్చుకున్నారు. ఆయనపై రూ.100 కోట్ల అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. మీరు ఇతరులపై అవినీతి ఆరోపణలు చేసేటప్పుడు.. మీ పార్టీలోని వారి గురించి తెలుసుకుని మాట్లాడాలి.’’ అని చురుకలంటించారు.
'బీజేపీలో చేరిన ప్రతిపక్ష నేతల అవినీతి మరకలను తుడిచివేస్తూ మీ కార్యాలయం వాషింగ్ మెషీన్‌గా మారడాన్ని దేశం గత 11 ఏళ్లుగా చూస్తోంది. 2014 నుంచి అవినీతి ఆరోపణలతో 25 మంది ప్రతిపక్ష నేతలు మీ పార్టీలో చేరారు. వారికి కేంద్ర దర్యాప్తు సంస్థలు క్లిన్ చిట్ ఇచ్చాయి. హిమంత బిస్వా శర్మ నుంచి సువేందు అధికారి, హెచ్డి కుమారస్వామి, అజిత్ పవార్, అశోక్ చవాన్, నారాయణ్ రాణే , మునిరత్న వరకు ఎంతమంది అవినీతి నాయకులను మీ మెషీన్లో కడిగిపారేశారు? అని సూటిగా ప్రశ్నించారు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు..
‘‘మీ పార్టీ ఖజానా నింపే ఎలక్టోరల్ బాండ్ల వెనుక దాతలు ఎవరు?ఎంత ఇచ్చారు? వాటికి ప్రతిఫలంగా ఏం ఇచ్చారు? ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. మీ హయాంలో బ్యాంకులను దోచుకుని దేశం విడిచి పారిపోయేందుకు మార్గం సుగమం చేసింది ఎవరు? పేదల ఆదాయం తగ్గి, అదానీ, అంబానీ సంపద పెరగడానికి కారకులెవరు? మీరు అవినీతి గురించి మాట్లాడటం చూసి సంతోషిస్తున్నాను. నాపై తప్పుడు ఆరోపణలు చేయిస్తున్న సూత్రధారి ఎవరో కర్నాటక ప్రజలు తెలుసుకునే సమయం వచ్చేసింది. దూరంగా ఉండి ఆరోపణలు చేయడం కాదు. నేను బహిరంగ చర్చకు సిద్ధం. మరి మీరు సిద్ధమా? అని మోదీకి సవాల్ విసిరారు సిద్ధరామయ్య.
Prime Minister @NarendraModi, who is accused by his own party leaders of auctioning off the Chief Minister's post for ₹2,500 crores, has no moral right to speak about corruption!
— Siddaramaiah (@siddaramaiah) September 25, 2024
Even after a BJP MLA openly accused his own party of selling the CM post, no action has been taken.…