క్యాబినెట్ తొలి సమావేశంలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరణకు తీర్మానం
x

క్యాబినెట్ తొలి సమావేశంలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరణకు తీర్మానం

రాష్ట్ర హోదా పునరుద్ధరణే తమ లక్ష్యమని, తొలి క్యాబినెట్ సమావేశంలోనే దానిపై తీర్మానం చేస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు.


రాష్ట్ర హోదా పునరుద్ధరణే తమ లక్ష్యమని, ఎన్‌సి-కాంగ్రెస్ ప్రభుత్వం తొలి క్యాబినెట్ సమావేశంలోనే దానిపై తీర్మానం చేస్తుందని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. ‘‘2019 ముందు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం. రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ప్రధానమంత్రి, హోంమంత్రి హామీ ఇచ్చారు. డీలిమిటేషన్, ఎన్నికల తర్వాత హోదా వస్తుందని సీనియర్‌ మంత్రులు చెప్పారు. డీలిమిటేషన్ జరిగిపోయింది. ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక మిగిలింది రాష్ట్ర హోదా కల్పించడమే" అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ఎన్‌సి గురువారం శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో పీడీపీ భాగమవుతుందా? అని అడిగిన ప్రశ్నకు..ప్రస్తుతానికి దానిపై చర్చలు లేవని సమాధానమిచ్చారు.

నామినేటెడ్ ఎమ్మెల్యేల భయం పట్టుకుందా?

జమ్మూ, కాశ్మీర్‌లో నామినేటెడ్‌ ఎమ్మెల్యేల అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రానప్పుడు, హంగ్‌ ఏర్పడే అవకాశం ఉన్నపుడు లెప్టనెంట్ గవర్నర్ ఐదుగురు ఎమ్మెల్యేలను నామినేట్ చేసే అధికారం ఉంటుంది. దీనిపై ఒమర్ మాట్లాడుతూ..‘ఐదుగురు ఎమ్మెల్యేలను నామినేట్ చేసినా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. మేము కేంద్రంతో సత్సంబంధాలను కొనసాగించాలనుకుంటున్నాం. ఒకవేళ మీరు ఎమ్మెల్యేలను నామినేట్ చేస్తే మేం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వస్తుంది. ఎన్నికల్లో గెలిచిన కొందరు స్వతంత్రులు ఇప్పటికే మాతో టచ్‌లో ఉన్నారు. వారు కూడా మాతో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నారు.’ అని తెలిపారు.

Read More
Next Story