అసెంబ్లీ ఎన్నికల బరిలో పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ తండ్రి దిలీప్ ఖేడ్కర్ మళ్లీ వార్తలో నిలిచారు. మహారాష్ట్రలో నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో అహల్యానగర్ జిల్లా షెవ్‌గావ్ నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. నామినేషన్ల దరఖాస్తుకు చివరి రోజైన మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల వేళ అహ్మద్‌నగర్ నియోజకవర్గం నుంచి వంచిత్ బహుజన్ అఘాడి (VBA) అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ గెలవలేదు.
ఈ సారి ఆ వివరాలు లేకుండానే..
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఖేడ్కర్ తన భార్య మనోరమకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో ప్రస్తావించారు. అయితే ఈసారి మాత్రం నామినేషన్ పత్రంలో తన భార్య వివరాలను ఆయన కనపర్చలేదు.
రైతును బెదిరించిన కేసులో..
మాజీ ప్రభుత్వ అధికారి అయిన ఖేడ్కర్‌తో పాటు ఆయన భార్య మనోరమ ఓ కేసులో నిందితులుగా ఉన్నారు. భూ వివాదానికి సంబంధించి పూణే జిల్లాలో జూన్ 2023లో ఓ రైతుకు తుపాకీతో బెదిరించారు. ఈ కేసులో దిలీప్ ఖేద్కర్‌కు జులైలో పూణెలోని సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
పూజా ఖేడ్కర్ గురించి..
ట్రైనీ సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో పూజా ఖేడ్కర్‌పై అధికార దుర్వినియోగంతో పాటు యూపీఎస్సీలో తప్పుడు అఫిడవిట్ పత్రాలు సమర్పించారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆమెను ఆదేశించింది. అయితే ఆమె అక్కడ రిపోర్టు చేయలేదు. తప్పుడు ఓబీసీ సర్టిఫికెట్ సమర్పించడం, అర్హత లేకున్నా దివ్యాంగుల కోటాలో సీటు సంపాదించడంపై కోర్టులో విచారణ సాగుతోంది.