ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాజీనామా - ముగిసిన 24 ఏళ్ల పాలన
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలుకావడంతో ఆయన రిజైన్ చేశారు.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలుకావడంతో ఆయన రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ రఘుబర్ దాస్‌కు అందజేశారు. దీంతో బీజేడీ చీఫ్ 24 ఏళ్ల పాలనకు ముగింపు పడినట్లయ్యింది.
బీజేపీ గెలుపు..
ఒడిశాలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 147. వీటిలో 78 స్థానాలను బీజేపీ గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకుంది. బిజెడికి కేవలం 51 స్థానాలే వచ్చాయి. కాంగ్రెస్ 14 , సిపిఐ (ఎం) ఒక స్థానాన్నిదక్కించుకున్నాయి. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయం సాధించారు.
మార్చి 5, 2000న తొలిసారిగా ఒడిశా ముఖ్యమంత్రిగా పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు.
వరుసగా ఐదుసార్లు..
2000 మార్చి 5న తొలిసారి ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. వరుసగా అయిదుసార్లు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. ఎంపీగా ఉన్న బిజూ పట్నాయక్ మరణంతో ఖాళీ అయిన ఆస్కా లోక్‌సభ స్థానం నుంచి నవీన్ పట్నాయక్‌ను జనతాదళ్ పార్టీ ఉప ఎన్నికల బరిలో దింపింది. ఎంపీగా గెలుపొందిన ఆయనకు కొద్దిరోజుల్లోనే జనతాదళ్ అగ్ర నాయకత్వంతో విభేదాలు వచ్చాయి. దాంతో తన తండ్రి పేరిట బిజూ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. 1998, 1999 లోక్‌సభ, 2000 ఒడిశా శాసనసభ ఎన్నికల్లో బీజేపీలో పొత్తు పెట్టుకుని ఘన విజయాలు సాధించారు. వాజ్‌పేయీ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశారు. 2004 లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీచేశారు. దేశవ్యాప్తంగా ఎన్డీయేకు ఎదురుదెబ్బ తగిలినా ఒడిశాలో నవీన్ నాయకత్వంలో మంచి ఫలితాలు వచ్చాయి. 2008లో కొంధమాల్ మత ఘర్షణలతో బీజేపీ- బిజూ జనతాదళ్ మైత్రికి గండిపడింది. 2009లో ఎన్సీపీ, వామపక్ష పార్టీలను కలుపుకొని శాసనసభ ఎన్నికల బరిలో దిగి నవీన్ విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో నిలిచి వరసగా అయిదుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు.
Next Story