మహారాష్ట్రలో ఎన్‌సీపీ (అజిత్ పవార్) సెకండ్ లిస్ట్ రిలీజ్..
x

మహారాష్ట్రలో ఎన్‌సీపీ (అజిత్ పవార్) సెకండ్ లిస్ట్ రిలీజ్..

పార్టీ అగ్రనేతలు రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యనేతలతో ఒకటికి రెండు సార్లు చర్చించి గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల పేర్లను విడతల వారీగా విడుదల చేస్తున్నారు.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అభ్యర్థుల పేర్లను వెల్లడించడంలో పార్టీలు స్పీడు పెంచాయి. పార్టీ అగ్రనేతలు రాష్ట్ర అధ్యక్షుడు, ముఖ్యనేతలతో ఒకటికి రెండు సార్లు చర్చించి గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థుల పేర్లను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. అందులో భాగంగానే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ శుక్రవారం తన అభ్యర్థుల రెండో జాబితా రిలీజ్ చేసింది. ఇందులో ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీ, ఇద్దరు మాజీ బీజేపీ ఎంపీలు సహా ఏడుగురు అభ్యర్థులు ఉన్నారు.

బాంద్రా ఈస్ట్ నుంచి జీషన్ సిద్ధిఖీ..

ఈ నెల ప్రారంభంలో జీషన్ సిద్ధిఖీ తండ్రి, ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిఖీ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జీషన్‌ను ఎన్‌సీపీ తరుపున బాంద్రా ఈస్ట్ నుంచి పోటీ చేయిస్తున్నారు. జీషన్ 2019లో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచారు. ఇటీవల జరిగిన శాసన మండలి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినందుకు కాంగ్రెస్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దాంతో ఈ సారి ఎన్‌సీపీ నుంచి బరిలో దిగారు. జీషన్ తండ్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బాబా సిద్ధిఖీ ఈ ఏడాది ప్రారంభంలో అధికార మహాయుతి సంకీర్ణానికి చెందిన ఎన్‌సీపీలో చేరిన విషయం తెలిసిందే.

బరిలో మాజీ ఎంపీలు..

లోక్‌సభ ఎన్నికల్లో నాందేడ్‌ నుంచి ఓడిపోయిన బీజేపీ మాజీ ఎంపీ ప్రతాప్‌ చిఖాలీకర్‌ లోహా నుంచి నామినేషన్‌ వేశారు. సార్వత్రిక ఎన్నికల్లో సాంగ్లీ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన బీజేపీ మాజీ ఎంపీ సంజయ్ కాకా పాటిల్‌కు ఎన్‌సీపీ టికెట్‌ కేటాయించింది. ఈయన సాంగ్లీ జిల్లాలోని తాస్గావ్-కవాతే మహంకల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. దివంగత ఎన్‌సీపీ నేత ఆర్ఆర్ పాటిల్ కుమారుడు రోహిత్ పాటిల్‌తో తలపడనున్నారు.

ఇస్లాంపూర్‌లో ఎన్‌సీపీ (ఎస్‌పి) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్‌తో నిషికాంత్ పాటిల్ పోటీకి దిగారు. మాజీ మంత్రి నవాబ్ మాలిక్ కుమార్తె సనా మాలిక్ ముంబైలోని అనుశక్తి నగర్ నుంచి నామినేట్ అయ్యారు. పూణేలోని వాడ్‌గావ్ షెరీ నుంచి సునీల్ టింగ్రేకు ఎన్‌సీపీ టికెట్ లభించింది. ఇక శ్రీరూర్ నుంచి జ్ఞానేశ్వర్ కట్కేను ఎంపిక చేసింది. మొన్నటి వరకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్‌పి)కి పూణే జిల్లా చీఫ్‌గా జ్ఞానేశ్వర్ కట్కే కొనసాగారు.

గతంలో ఎన్‌సీపీ 38 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమిలో ఎన్‌సీపీ, బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన భాగస్వామ్య పక్షాలు.

288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న ఎన్నికలు జరగనుండగా, 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Read More
Next Story