నా ఫీజు రూ. 100 కోట్లు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్
x

నా ఫీజు రూ. 100 కోట్లు: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్

‘పార్టీ పెట్టడానికి, ఎన్నికల ప్రచారానికి బోలెడంత డబ్బు అవసరం. ఈ డబ్బు మీరు ఎక్కడి నుంచి తెస్తారు? అని జనం నన్ను తరచూ అడుగుతున్నారు.’ - ప్రశాంత్ కిషోర్


ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల ‘జన్ సూరజ్’ పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక పనిలో పనిగా అక్టోబరు 31న జరగనున్న బీహార్ ఉపఎన్నికలలో తన పార్టీ అభ్యర్థులను బరిలో దించబోతున్నారు. ఉప ఎన్నిక నియోజకవర్గం బెలగంజ్‌లో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

నా ఫీజు రూ. వంద కోట్లు..

‘పార్టీ పెట్టడానికి, ఎన్నికల ప్రచారానికి బోలెడంత డబ్బు అవసరం. ఈ డబ్బు మీరు ఎక్కడి నుంచి తెస్తారు? అని జనం నన్ను తరచూ అడుగుతున్నారు. అందుకు నా దగ్గర సమాధానం ఉంది. ఎన్నికల ప్రచారానికి నా దగ్గర డబ్బు లేదని మీరు అనుకోవద్దు. నన్ను బలహీనుడిగా భావించొద్దు? నా ఫీజు గురించి మీకెవరికీ తెలియకపోవచ్చు. వివిధ రాష్ట్రాలలో 10 ప్రభుత్వాలు నా వ్యూహాలతో నడుస్తున్నాయి. ఎన్నికల వ్యూహాం కోసం నా వద్దకు వచ్చే వారికి సలహా ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా రూ. 100 కోట్లు తీసుకుంటా. ఆ డబ్బును రాబోయే రెండేళ్లపాటు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తా” అని ప్రశాంత్ కిషోర్ ఇండియా టుడేతో అన్నారు.

నాలుగు స్థానాలకు ఉపఎన్నికలు..

బీహార్‌లో బెలగంజ్‌తో పాటు ఇమామ్‌గంజ్, రామ్‌గఢ్, తరారీ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానాల ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గెలుపొందారు. దాంతో వారి స్థానాలు ఖాళీ కావడంతో బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ నాలుగు

స్థానాలకు బలమైన అభ్యర్థులను నిలబెట్టడంపై కిషోర్ దృష్టి సారించారు.

విశ్వాసాన్ని జయిస్తేనే..

ప్రజాస్వామ్యంలో ఒక చట్టాన్ని తీసుకురావడం అంత సులభం కాదన్నారు. ముందుగా ఆ చట్టం వల్ల ప్రభావితమయ్యే ప్రజల విశ్వాసాన్ని పొందాల్సి ఉంటుందన్నారు. ముస్లిం సమాజాన్ని ఒప్పిస్తే తప్ప దేశంలో యూనిఫాం సివిల్ కోడ్‌ను కేంద్రం అమలు చేయలేదని జన్ సూరజ్ చీఫ్ అభిప్రాయపడ్డారు.

రాజకీయ వ్యూహకర్తగా సుపరిచితుడు..

ప్రశాంత్ కిషోర్ దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఈయన వ్యూహంతో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేశారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రశాంత్ కిషోర్ సలహా తీసుకున్నారు. ఫలితంగా వైసీపీ భారీ విజయాన్ని సాధించింది. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో TMC అధికారాన్ని నిలబెట్టుకోవడంలో కూడా కిషోర్ వ్యూహమే కీలకం.

Read More
Next Story