Maharashtra Politics | వీడిన ఉత్కంఠ.. షిండేకు డిప్యూటీ సీఎం పదవి..
x

Maharashtra Politics | వీడిన ఉత్కంఠ.. షిండేకు డిప్యూటీ సీఎం పదవి..

మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ పేర్లు ఖరారు అయినట్లు సమాచారం.


ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్ర సీఎం ఎవరన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ పేర్లు ఖరారు అయినట్లు సమాచారం. ఇందుకు షిండే అంగీకరించినట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వంలో ఫడ్నవీస్ డిప్యూటీగా పనిచేయడానికి షిండే ఇష్టపడలేదు. ఇప్పటికే తమ నాయకుడు ముఖ్యమంత్రిగా పనిచేసినందున, ఈ సారి డిప్యూటీ సీఎం పదవి కాకుండా హోం శాఖ కేటాయిస్తారని షిండే వర్గీయులు భావించారు. అయితే ఆ శాఖను బీజేపీ తన వద్ద ఉంచుకోవడంతో..స్వగ్రామానికి వెళ్లి షిండే తన అయిష్టతకు బయటపెట్టిన విషయం తెలిసిందే. మహాయుతి కూటమి భాగస్వాముల ప్రమాణస్వీకార కార్యక్రమం తర్వాత కేబినెట్ పదవులు, పోర్ట్‌ఫోలియోల కేటాయింపులు ఉంటాయని సమాచారం. మీడియా నివేదికల ప్రకారం.. మహాయుతి మిత్రపక్షాలలో అత్యధిక స్థానాలను గెలుచుకున్న బీజేపీకి 21-22 పోర్ట్‌ఫోలియోలు, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీకి 9-10 క్యాబినెట్ బెర్త్‌లు లభించే అవకాశం ఉంది. ఇక శివసేన (షిండే) 16 మంత్రి పదవులను కోరగా 12 ఇచ్చే అవకాశం ఉంది. హోం, రెవెన్యూ శాఖలతో పాటు స్పీకర్‌, శాసన మండలి చైర్మన్‌ పదవులను బీజేపీ తన వద్దే ఉంచుకునే అవకాశం ఉంది. ఎన్సీపీ (ఏపీ)కి ఆర్థిక శాఖతో పాటు డిప్యూటీ స్పీకర్ పదవి కూడా దక్కవచ్చు.

శివసేన (షిండే) తమకు ఇప్పటికే శాసన మండలి చైర్మన్ ఉన్నందున శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవిని కోరుతోంది. షిండే సేనకు పట్టణాభివృద్ధి శాఖ కూడా దక్కే అవకాశం ఉంది.

ఆల్ ఈజ్ వెల్..

మహాయుతి సంకీర్ణంలో అంతా బాగానే ఉందని, ప్రమాణస్వీకార కార్యక్రమం అనుకున్న విధంగానే జరుగుతుందని శివసేన (షిండే) నాయకుడు సంజయ్ శిర్సత్ ప్రకటించారు. ముగ్గురు నేతలు కూర్చుని మాట్లాడుకున్నారు. ఎలాంటి గందరగోళం లేదు'' అని చెప్పారు.

జాప్యం అందుకే..

“ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ 5న జరగాల్సి ఉంది. ఈ మధ్యకాలంలో ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. సీఎం పేరును ఆలస్యంగా ప్రకటించడానికి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు ఏ సంబంధం లేదు. సీఎం పదవికి తాను అడ్డు కాబోనని షిండే ఇప్పటికే చెప్పారు’’ అని శిర్సత్ సమాధానమిచ్చారు.

రేపు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం..

మరోవైపు శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీజేపీ శాసనసభా పక్షం బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత కాషాయ పార్టీ తన ముఖ్యమంత్రి అభ్యర్థిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు..

కొత్త మహాయుతి ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవానికి ముంబైలో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సోమవారం ఆయన వేదికను సందర్శించారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానాలు అందాయి. కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ఆఫీస్ బేరర్లు కూడా హాజరు కానున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత పెద్దలు, కళాకారులు, రచయితలను కూడా బీజేపీ ఆహ్వానించింది.

Read More
Next Story