MVA బండికి చక్రాల్లేవు.. బ్రేకుల్లేవు..: మహారాష్ట్రలో ప్రధాని మోదీ
x

MVA బండికి చక్రాల్లేవు.. బ్రేకుల్లేవు..: మహారాష్ట్రలో ప్రధాని మోదీ

‘‘గత రెండున్నరేళ్లలో మహారాష్ట్ర అభివృద్ధి వేగం పుంజుకుంది. ఆ స్పీడ్ తగ్గనివ్వం. ఇది నేను మీకు ఇస్తున్న హామీ.” - ప్రధాని మోదీ


మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీలు ప్రచార జోరు పెంచాయి. పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయి. పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగి ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి. శుక్రవారం ప్రధాని మోదీ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఉత్తర మహారాష్ట్రలోని ధులే జిల్లాలో ఏర్పాటుచేసిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మహావికాస్ అఘాడీపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష మహా వికాస్ అఘాదీ చక్రాలు, బ్రేకులు లేని వాహనం అని, డ్రైవర్ సీట్లో కూర్చోవడానికి గొడవ జరుగుతోందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమితోనే మహారాష్ట్ర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.

‘‘మహారాష్ట్రతో నాకున్న అనుబంధం మీ అందరికీ తెలుసు. మా దృష్టిలో జనం దేవుడి మరో రూపం. కానీ కొంతమంది ప్రజలను దోచుకోవడానికి రాజకీయాల్లో ఉన్నారు. నేను ఏదైనా కోరినప్పుడల్లా మహారాష్ట్ర ప్రజల మనస్పూర్తిగా అందించారు. గత రెండున్నరేళ్లలో మహారాష్ట్ర అభివృద్ధి వేగం పుంజుకుంది. ఆ స్పీడ్ తగ్గనివ్వం. ఇది నేను మీకు ఇస్తున్న హామీ.” అని మోదీ అన్నారు. కేంద్రంలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు మరాఠీకి సాంప్రదాయక భాష హోదా ఇవ్వడాన్ని పట్టించుకోలేదన్నారు. దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులు అభివృద్ధి చెందడాన్ని కాంగ్రెస్ పార్టీ ఓర్వలేదని చెప్పారు.

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యులు 288. నవంబర్ 20 వ తేదీ ఎన్నికలు జరగనున్నాయి. 23వ తేదీ కౌంటింగ్ ఉంటుంది.

Read More
Next Story