‘అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు, లక్షల మందికి స్వయం ఉపాధి’
x

‘అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు, లక్షల మందికి స్వయం ఉపాధి’

‘‘మీలో చాలా మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. జార్ఖండ్‌లో బీజేపీకి ఓటు వేయడం ద్వారా ప్రధాని మోదీ చేతులకు మరింత బలం చేకూరుస్తారు.’’ - జార్ఖండ్‌ మాజీ సీఎం చంపాయ్‌


రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 2.87 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల మందికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్‌ సోరెన్‌ యువతకు బహిరంగ లేఖ రాశారు.

‘‘మీలో చాలా మంది తొలిసారిగా ఓటు వేయనున్నారు. జార్ఖండ్‌లో బీజేపీకి ఓటు వేయడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ చేతులకు మరింత బలం చేకూరుస్తారు. ఇది యువతకు నా ప్రత్యేక అభ్యర్థన’’ అని లేఖలో పేర్కొన్నారు.

తనను అవమానించిన కారణంగా చంపాయ్‌ సోరెన్‌ జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) నుంచి బయటకు వచ్చి ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. గత నాలుగున్నర దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో సమాజ సర్వతోముఖాభివృద్ధికి నిరంతరం కృషి చేశానని సోరెన్ చెప్పుకొచ్చారు. తాను సీఎంగా ఉన్నపుడు డజన్ల కొద్దీ డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్, ఇతర విద్యాసంస్థల నిర్మాణం జరిగిందన్నారు. ఐదు నెలల సీఎంగా ఉన్న సమయంలో మొదలుపెట్టిన ఉద్యోగ నియామక ప్రక్రియను ఆపేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.

మొత్తం వ్యవస్థలోనే మార్పు తేవడమే లక్ష్యం.

‘‘భారతీయ జనతా పార్టీలో మార్పు గురించి మాట్లాడేటప్పుడు కేవలం ప్రభుత్వాన్ని మార్చడమే కాదు. మొత్తం వ్యవస్థలోనే మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. గుమాస్తా నుంచి సీఎం వరకు అందరూ ఆలకించే వ్యవస్థను రూపొందిస్తాం. మీలో చాలా మంది మీ కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం కోసం చాలా చేయాలనుకుంటున్నారు. కానీ ముందుకు అడుగు వేయలేకపోతున్నారు. వాటిని మేం అర్థం చేసుకున్నాం." అని పేర్కొన్నారు.

జాబ్ క్యాలెండర్..

బీజేపీ అధికారంలోకి వస్తే క్యాలెండర్‌ను సిద్ధం చేసి పారదర్శకతతో రిక్రూట్‌మెంట్ ప్రక్రియను చేపడతామని సోరెన్ హామీ ఇచ్చారు. ''పేపర్ లీకేజీలకు, అవినీతికి తావు లేకుండా అర్హులైన, ప్రతిభావంతులైన విద్యార్థులను మాత్రమే ఎంపిక చేసే వ్యవస్థను రూపొందిద్దాం. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చి 'న్యూ జార్ఖండ్'ను నిర్మించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కృషి చేద్దాం. ఈ కొత్త రాష్ట్రంతో మంచి భవిష్యత్తు గురించి కలలు కందాం’’ అని లేఖలో పేర్కొన్నారు.

హేమంత్ సోరెన్ అరెస్టుతో..

మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన కంటే ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో ఫిబ్రవరి 2న జార్ఖండ్ 12వ ముఖ్యమంత్రిగా చంపై సోరెన్ బాధ్యతలు చేపట్టారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో హేమంత్ సోరెన్ జూన్ 28న జైలు నుంచి విడుదలయ్యారు. జూలై 3న తిరిగి JMM లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా ఎన్నిక కావడంతో చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు.

81 సీట్ల జార్ఖండ్ అసెంబ్లీకి రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 13, 20 తేదీల్లో పోలింగ్ జరగనుంది.

Read More
Next Story