Maharashtra Politics | షిండేకు హోం శాఖ కేటాయించాలి
హోం శాఖ మా పార్టీ (శివసేన)కి కేటాయించాలి. ముఖ్యమంత్రి హోం శాఖకు నాయకత్వం వహించడం సరికాదు." - సంజయ్ శిర్సత్, శివసేన ఎమ్మెల్యే
మహారాష్ట్రలో సీఎం పీఠంపై చిక్కుముడి వీడటం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మహాయుతి కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. మొత్తం 288 స్థానాల్లో కూటమి భాగస్వాములు 230 స్థానాలను కైవసం చేసుకున్నారు. పార్టీల పరంగా చూస్తే బీజేపీ 132 స్థానాలు, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్ పవార్) 41 స్థానాల్లో విజయం సాధించింది. అత్యధిక స్థానాలు గెలుపొందిన బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. రెండో స్థానంలో నిలిచిన ఏక్‌నాథ్ షిండే హోం శాఖపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆ శాఖ కూడా ముఖ్యమంత్రి వద్దే ఉంటుందని వార్తలు రావడంతో షిండే వర్గీయులు నిరాశకు లోనయ్యారు.
‘హోం శాఖ కేటాయించాలి’
"హోం శాఖ మా పార్టీ (శివసేన)కి కేటాయించాలి. ఆ పోర్ట్‌పోలియో సాధారణంగా ఉప ముఖ్యమంత్రి వద్ద ఉంటుంది. ముఖ్యమంత్రి హోం శాఖకు నాయకత్వం వహించడం సరికాదు." అని ఔరంగాబాద్ పశ్చిమ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే సంజయ్ శిర్సత్ పేర్కొన్నారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘‘కొత్త ప్రభుత్వంలో మా నాయకుడు (షిండే)కి కీలక పదవి దక్కుతుందని ఆశించాం. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఆయనను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అజిత్ పవార్ (ఎన్‌సీపీ) వ్యతిరేకించినా.. మహిళల కోసం షిండే ‘మాఝీ లడ్కీ బహిన్’ పథకాన్ని తెచ్చారు. దాని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గత సంక్షేమ పథకాలకూ జీవం పోశారు. మరాఠాలకు రిజర్వేషన్‌ను కూడా ఇచ్చారు. దాంతో ఆయనకు మద్దతు ఎన్నో రెట్లు పెరిగింది. ఎన్నికల సమయంలో అత్యధిక ర్యాలీల్లో పాల్గొన్నది కూడా షిండేనే. ప్రజల్లో ఆయనకు మంచి ఇమేజ్ ఉంది. దేవేంద్ర ఫడ్నవిస్ సీఎంగా రెండున్నరేళ్ల పదవీ కాలం ముగిశాక హోం శాఖకు షిప్ట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే షిండే ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే బీజేపీకి ఎక్కువ లాభం చేకూరింది." అని పేర్కొన్నారు.
షిండే అలకబూనారా?
ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సీఎంను ఎంపిక చేసే బాధ్యతను బీజేపీ అగ్రనాయకత్వం తీసుకుంది. దాంతో ఫడ్నవీస్, షిండే, అజిత్ పవార్ ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఆయనతో సమావేశం ముగిశాక.. సీఎం ఎంపిక పూర్తిగా బీజేపీ అధిష్టానానికి వదిలేశానని మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు షిండే సమాధానం ఇచ్చారు. ఆ పదవికి ఎంపికలో తాను అడ్డంకి కాబోనని కూడా అన్నారు. ఇటు దేశ రాజధాని నుంచి తిరిగొచ్చిన షిండే సతారా జిల్లాలోని తన స్వస్థలం డేర్ గ్రామానికి వెళ్తున్నారని తెలిసింది. హోం శాఖ అప్పగించలేదనే అసంతృప్తితో తమ నాయకుడు గ్రామానికి బయల్దేరారని ఆయన వర్గీయుల చెబుతున్న మాట.