‘‘ద్రోహులను చిత్తుచిత్తుగా ఓడించండి’’
అజిత్ పవార్ వర్గాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ఎన్సీపీ (ఎస్పీ) అగ్రనేత శరద్ పవార్ ఓటర్లను కోరారు. నవంబర్ 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.
అజిత్ పవార్ వర్గాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని ఎన్సీపీ (ఎస్పీ) అగ్రనేత శరద్ పవార్ ఓటర్లను కోరారు. నవంబర్ 20వ తేదీన మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం షోలాపూర్ జిల్లా మాధాలో జరిగిన ర్యాలీలో శరద్ పవార్ ప్రసంగించారు. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి పదవిని కోల్పోవడానికి దారితీసిన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ.. తనను వెన్నుపోటు పొడిచిన వారందరిని ఈ ఎన్నికలలో ఓడించాలని శరత్ పవార్ విజ్ఞప్తి చేశారు.
‘‘1980 ఎన్నికల్లో మా పార్టీ నుంచి 58 మంది గెలుపొందడంతో నేనే ప్రతిపక్ష నాయకుడయ్యాను. విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చేటప్పటికి 58 మంది ఎమ్మెల్యేల్లో 52 మంది పార్టీ మారడంతో నేను ప్రతిపక్ష నాయకుడి హోదా కోల్పోయాను," అని గుర్తుచేశారు. నేను (అప్పట్లో) ఏమీ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువ కావడం ప్రారంభించాను. మూడేళ్లపాటు కష్టపడి పనిచేశాను. తర్వాతి ఎన్నికల్లో నన్ను విడిచిపెట్టిన మొత్తం 52 మంది ఎమ్మెల్యేలపై యువ అభ్యర్థులను నిలబెట్టాను. ఆ 52 మందిని మహారాష్ట్ర ప్రజలు ఓడించారు. అందుకు నేను ఎంతో గర్వపడ్డా’’. అని గత సృతులను నెమరేసుకున్నారు శరత్ పవార్. 83 ఏళ్ల కేంద్ర మాజీ మంత్రి.. 1967లో 27 ఏళ్ల వయసులో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఓటమి ఎరుగని రాజకీయ నాయకుడిగా ఎదిగారు.
గతేడాది ఎన్సీపీలో చీలికలు..
శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. గత ఏడాది జూలైలో ఆయన మేనల్లుడు అజిత్ పవార్, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఏకనాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరడంతో ఎన్సీపీ రెండుగా చీలిపోయింది. దాంతో ఎన్నికల సంఘం అజిత్ పవార్‌కు పార్టీ పేరు, గడియారం' గుర్తు కేటాయించింది. అదే శరత్ పవార్ NCP (శరద్చంద్ర పవార్)కు ఎన్నికల సంఘం 'మ్యాన్ బ్లోయింగ్ టుటారీ'గుర్తు కేటాయించింది.
బారామతి నుంచి అజిత్ పవార్...
బారామతి అసెంబ్లీ స్థానంలో ఎన్సీపీ నాయకుడు, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ను ఎదుర్కోవడానికి శరద్ పవార్ మనవడు యుగేంద్ర పవార్‌ను ఎన్సీపీ (ఎస్పీ) రంగంలోకి దించింది. ఈ నియోజకవర్గంలో అజిత్ పవార్ 1991 నుంచి బారామతి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి అజిత్ పవార్ తన భార్య సునేత్ర పవార్ ను పోటీకి దింపగా.. శరద్ పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలేను బరిలోకి దింపారు. అయితే సునేత్రను సుప్రియా సునాయాసంగా ఓడించారు. అప్పటి నుంచి అజిత్ పవార్ తన భార్యను తన కజిన్‌పై పోటీకి దింపడం పొరపాటు అని తరచూ చెబుతూనే ఉన్నాడు.