రెబల్స్‌తో బుజ్జగింపులే బీజేపీ విజయ రహస్యమా?
x

హర్యానా ముఖ్యమంత్రి సైనీకి మిఠాయి తినిపిస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

రెబల్స్‌తో బుజ్జగింపులే బీజేపీ విజయ రహస్యమా?

“ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకులను ఏకం చేయడానికి ముఖ్యమంత్రి సైనీ చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆయన సహనం, చొరవ అందుకు దోహదపడ్డాయి.” - హర్జిత్ సింగ్ గ్రేవాల్


లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ప్రాంతీయ పార్టీల మద్దతతో అధికారంలోకి వచ్చింది. ‘ఐక్యత’ అనే అస్త్రంతోనే కాంగ్రెస్ నేతృత్వంలోని భారత కూటమిని గట్టిగా ఎదుర్కోగలమని బీజేపీ, దాని సైద్ధాంతిక మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భావిస్తున్నాయి. ఇటీవల ముగిసిన హర్యానా ఎన్నికల్లో BJP విజయం వెనక ఇదే అస్త్రం పనిచేసిందనే చెప్పాలి.

చారిత్రాత్మక విజయం..

హర్యానాలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మొదటి రాజకీయ పార్టీగా బీజేపీ అవతరించింది. దాంతో రాష్ట్రంలో కాషాయ పార్టీ నేతలు, శ్రేణుల సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఎన్నికలకు ముందు టిక్కెట్ ఆశించి భంగపడ్డ నాయకులను బుజ్జగించడంలో RSS కీలకంగా వ్యవహరించింది. దశాబ్ద కాలం పాటు అధికారంలో వున్న హర్యానా ప్రభుత్వం అధికార వ్యతిరేకత, రైతులు, మల్లయోధుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో పార్టీ టికెట్ దక్కని వారు రెబల్స్‌గా బరిలోకి దిగకుండా, పార్టీ కోసం ప్రచారం చేయాలని లేదంటే క్రమశిక్షణ చర్యలు తప్పవంటూ బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ నాయకత్వం హెచ్చరిస్తూనే.. రెబల్స్‌ను బుజ్జగించే బాధ్యతను ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీకి అప్పగించారు.

“ ఎన్నికలకు ముందు హర్యానాలోని బీజేపీ నాయకులను ఏకం చేయడానికి ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ చాలా శ్రమించాల్సి వచ్చింది. ఆయన సహనం, చొరవ అందుకు దోహదపడ్డాయి.” అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు హర్జిత్ సింగ్ గ్రేవాల్ ది ఫెడరల్‌తో అన్నారు.

రెబల్స్‌ను ఒప్పించడంలో సక్సెస్ అయిన సైనీ..

సోనిపట్ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు రాజీవ్ జైన్ పోటీ చేయాలని భావించారు. అయితే ఆయనను సైనీ వ్యక్తిగతంగా కలిసి నామినేషన్‌ను ఉపసంహరించుకునేలా ఒప్పించారు. అలాగే మహేంద్రగఢ్ జిల్లాలోని అటెలి స్థానం నుంచి మాజీ డిప్యూటీ స్పీకర్ సంతోష్ యాదవ్‌ను, మహేంద్రగఢ్ స్థానానికి పోటీ చేయాలని భావించిన సీనియర్ బీజేపీ లీడర్ రామ్ బిలాస్ శర్మను పోటీచేయకుండా ఒప్పించారు. కాని కొంతమంది రెబర్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ ఉపసంహరణకు నిరాకరించిన ఏడుగురు అభ్యర్థులు ఎన్నికల్లో ఓడిపోయారు. వారిలో రనియా నియోజకవర్గం నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి రంజిత్ సింగ్ చౌతాలా, నయాబ్ సింగ్ సైనీకి వ్యతిరేకంగా ప్రచారం చేసిన సందీప్ గార్గ్ ఉన్నారు.

బీజేపీలోకి ఇండిపెండెంట్లు..

హర్యానాలో ఘనవిజయం తరువాత స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన రెబల్స్‌ను తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ యత్నిస్తుంది. అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు గన్నౌర్ స్థానం నుంచి గెలుపొందిన సీనియర్ లీడర్ దేవేంద్ర కడియాన్, బహదూర్‌ఘర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిని ఓడించిన రాజేష్ జున్‌ను తిరిగి కాషాయ పార్టీలోకి రావాలని కోరింది. పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సావిత్రి జిందాల్‌తోనూ చర్చలు కొనసాగుతున్నాయి.

హర్యానాలో బీజేపీ విజయం, జమ్మూ కాశ్మీర్‌లో చెప్పుకోదగ్గ పనితీరు కనపర్చడంతో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికలలో ఇదే ఫార్ములాను ప్రయోగించే అవకాశం ఉంది. ఎన్నికలలో నడుచుకోవాల్సిన వ్యూహాంపై సంఘ్ పరివార్‌ సీనియర్ నాయకులు దేవేంద్ర ఫడ్నవీస్, యోగి ఆదిత్యనాథ్‌లతో సమావేశమైనట్లు సమాచారం.

Read More
Next Story