
ఏపీ మండలిలో ’నెయ్యి‘ సెగ..చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టు
ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ అంశాలపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు పట్టుబట్టారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా 'నెయ్యి' రాజకీయం ముదిరింది. ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ అంశాలపై వైఎస్సార్‌సీపీ సభ్యులు పోరాటానికి దిగడంతో సభలో ఉద్రిక్తత నెలకొంది. ఒకవైపు మాజీ సభ్యులకు సంతాపం తెలుపుతూనే, మరోవైపు ప్రభుత్వ వైఖరిపై నిరసన గళం విప్పిన ప్రతిపక్షం.. మండలిని స్తంభింపజేసింది. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఘాటుగా స్పందిస్తూ విసిరిన సవాల్‌తో చర్చా వేదిక కాస్తా రాజకీయ రణక్షేత్రంగా మారింది.
సంతాప తీర్మానం.. నినాదాల ర్యాలీ
బుధవారం శాసనమండలి సమావేశాలు ప్రారంభం కాగానే.. మాజీ ఎంపీ రత్నాబాయి, మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్యల మృతికి సభ సంతాపం ప్రకటించింది. సభ్యులందరూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులర్పించారు. మరో వైపు అటు మండలిలోను, సభ వెలుపల రాజకీయ వాతావరణం అప్పుడే వేడెక్కింది. భోలేబాబా, హెరిటేజ్ సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్సార్‌సీపీ సభ్యులు మండలికి ర్యాలీగా తరలివచ్చారు.
వాయిదా తీర్మానం తిరస్కరణ.. సభ స్తంభన
ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ అంశాలపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ సభ్యులు రెండో రోజు కూడా వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. టీటీడీకి నెయ్యి సరఫరాలో జరుగుతున్న పరిణామాలపై పట్టుబట్టారు. అయితే, మండలి చైర్మన్ ఈ తీర్మానాన్ని తిరస్కరించడంతో ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో నినాదాలు మిన్నంటడంతో గందరగోళం నెలకొంది, దీనివల్ల సభను కొద్ది సేపు వాయిదా వేయాల్సి వచ్చింది.
మంత్రి లోకేష్‌కు ’లేళ్ల‘ ఘాటు కౌంటర్
సభలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్సీలు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌ల గురించి ప్రస్తావిస్తూ.. వారు ఎప్పుడో చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. ఇప్పుడు వారిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలని మంత్రి లోకేష్ పిలవడం హాస్యస్పదం. వారితో వాయిదా తీర్మానం ఇప్పించి, మా పార్టీ వారే ఇచ్చారని చెప్పడం చర్చను తప్పుదోవ పట్టించడమే అని మండిపడ్డారు.
చిత్తశుద్ధి ఉంటే చర్చకు రండి
తిరుమల తిరుపతి లడ్డూ తయారీకి నెయ్యి సరఫరా అంశంపై ప్రభుత్వం చర్చ నుంచి పారిపోతోందని అప్పిరెడ్డి విమర్శించారు. మీకు దేవుడి పట్ల, టీటీడీ పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఇందాపూర్ డెయిరీ సహా ఇతర ఆరోపణలపై తక్షణమే చర్చకు సిద్ధం కావాలి అంటూ ఆయన ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఇందాపూర్ డెయిరీ పేరుతో హెరిటేజ్ నెయ్యి సరఫరా చేస్తోందని, దీనిపై స్పష్టత ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ పట్టుబడుతోంది.

