
వైఎస్సార్‌సీపీ.. ఓ భావోద్వేగ ధిక్కార స్వరమా
నేడు 16వ వసంతంలోకి అడుగుపెడుతోన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
తెలుగు రాజకీయ యవనికపై మాట తప్పని.. మడమ తిప్పని నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచినట్టు చెప్పుకుంటున్న వైఎస్సార్‌సీపీ, నేడు గురువారంతో విజయవంతంగా 16వ వసంతంలోకి అడుగుపెడుతోంది. 2011 మార్చి 12న ఇడుపులపాయలో ఒక భావోద్వేగపూరితమైన ధిక్కార స్వరంగా పురుడుపోసుకున్న ఈ ప్రయాణం.. అలుపెరుగని పోరాటాలు, 16 నెలల జైలు గోడల ధైర్యం, చారిత్రాత్మక పాదయాత్రల సాక్షిగా సాగింది. రాజశేఖర రెడ్డి ఆశయాల వారసుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాగించిన ఈ 16 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో సంఘర్షణలు, మరెన్నో ఆటుపోట్లు ఎదురైనా.. ప్రజల గుండె చప్పుడే బలమై నిలిచింది. నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత జగన్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణతో మొదలవుతున్న ఈ వేడుకలు, అట్టహాసంగా సాగుతున్న 16 ఏళ్ల విజయ గమనాన్ని చాటిచెబుతున్నాయి.
తొలి అడుగు.. ఒక ధిక్కారం
వైఎస్సార్‌సీపీ ప్రయాణం పూలబాట కాదు.. ముళ్లబాట. అధికార గర్వంతో విర్రవీగిన శక్తులు ఆయనను రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూశాయి. 16 నెలల జైలు జీవితం, అడుగడుగునా ఎదురైన కుట్రలు జగన్ సంకల్పాన్ని మరింత ఉక్కులా మార్చాయి. జైలు గోడల మధ్య మొదలైన ఆ సంఘర్షణ.. 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రగా మారి జన సముద్రాన్ని తాకింది. ఎండనక, వాననక సాగిన ఆ గమనం, ప్రజల కష్టాలను కళ్లారా చూసి, వారి కన్నీళ్లు తుడుస్తానన్న హామీతో జన హృదయాలను గెలుచుకుంది. లక్షలాది మంది కార్యకర్తలు సైనికుల్లా మారి ఫ్యాన్ గుర్తును ప్రతి గడపకూ తీసుకెళ్లడంతో పార్టీ ఒక తిరుగులేని శక్తిగా ఎదిగింది.
విశ్వసనీయతకు నిలువుటద్దం.. సంక్షేమ విప్లవం
ఈ 16 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. 2014లో తృటిలో చేజారిన అధికారం జగన్‌ను కుంగదీయలేదు. బదులుగా మరింత పట్టుదలను పెంచింది. 2019లో 151 సీట్ల చారిత్రాత్మక విజయం సాధించి, దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం సృష్టించారు. ముఖ్యమంత్రిగా ఆయన అమలు చేసిన నవరత్నాలు, గ్రామా స్వరాజ్యం, విద్యా-వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు కేవలం పథకాలు మాత్రమే కాదు.. అవి తన తండ్రి వైఎస్సార్‌కు ఆయన ఇచ్చిన నిజమైన నివాళిగా ఆ పార్టీ నాయకులు చెప్పుకున్నారు. ఇచ్చిన మాట కోసం నిలబడటం, విశ్వసనీయతను రాజకీయాల్లోకి తిరిగి తీసుకురావడమే వైఎస్సార్‌సీపీని సామాన్యులకు గుండెకాయలా మార్చిందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది.
వైఎస్సార్ అకాల మరణం – రాష్ట్రం గుండె ఆగిన వేళ:
సెప్టెంబరు 2, 2009.. తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఒక బ్లాక్ డే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందారు. ఆ వార్త రాష్ట్రవ్యాప్తంగా అశనిపాతంలా తగిలింది. తమ ప్రియతమ నేత లేరన్న నిజాన్ని జీర్ణించుకోలేక వందలాది మంది అభిమానులు గుండె ఆగి కన్నుమూశారు. ఆ విషాద సమయంలోనే, ఆ కుటుంబాలను పరామర్శిస్తానని, వారి కన్నీళ్లు తుడుస్తానని రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక బలమైన సంకల్పాన్ని చాటారు.
ఓదార్పు యాత్ర – ఢిల్లీ పీఠాన్ని ఎదిరించి
తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి ఇళ్లకు వెళ్లి ఓదార్చాలన్న జగన్ నిర్ణయం.. అప్పటి కాంగ్రెస్ అధిష్టానానికి కంటగింపుగా మారింది. సోనియా గాంధీ నేతృత్వంలోని ఢిల్లీ పెద్దలు ఆ యాత్రకు ససేమిరా అన్నారు. కానీ, చనిపోయిన వారు నా తండ్రి కోసం ప్రాణాలిచ్చారు.. వారిని ఓదార్చడం నా బాధ్యత అంటూ జగన్ ఇచ్చిన మాటకే కట్టుబడ్డారు. అధిష్టానం హెచ్చరికలను బేఖాతరు చేస్తూ, అపారమైన జనవాహిని మధ్య ఓదార్పు యాత్రను కొనసాగించి, ఢిల్లీ పీఠానికి తన ధిక్కార స్వరాన్ని వినిపించారు.
రాజీనామా అస్త్రం – ఆత్మగౌరవ పోరాటం:
యాత్ర విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి పెంచుతూ, జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించింది. ఆ క్రమంలోనే బానిసత్వం కంటే ఆత్మగౌరవమే మిన్న అని ఆయన నిరూపించారు. నవంబరు 29, 2010న తన ఎంపీ పదవికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సంచలన రాజీనామా చేశారు. తనతో పాటు తల్లి వైఎస్ విజయమ్మ కూడా ఎమ్మెల్యే పదవిని తృణప్రాయంగా వదులుకున్నారు. ఆ నిష్క్రమణలో రాజీ లేదు.. కేవలం రాజకీయంగా ఒంటరినైనా సరే, ప్రజల వెంటే ఉంటానన్న గట్టి నమ్మకం మాత్రమే ఉంది.
ఇడుపులపాయలో శంఖారావం – సరికొత్త ప్రస్థానం
కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జగన్, తన తండ్రి ఆశయాలకు రాజకీయ రూపం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. 2011, మార్చి 12న కడప జిల్లాలోని ఇడుపులపాయ వేదికగా, వైఎస్సార్ ఘాట్ సాక్షిగా లక్షలాది మంది సమక్షంలో సరికొత్త రాజకీయ శంఖారావం పూరించారు. శివకుమార్ అనే నేత స్థాపించిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని తన ప్రస్థానానికి సారథిగా మార్చుకుని, ప్రజల పార్టీగా వైఎస్సార్‌సీపీకి నామకరణం చేశారు.
జెండాపై రాజన్న.. ఇంటింటికి చేరిన ఫ్యాన్
పార్టీ ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే ఉప ఎన్నికల రూపంలో అగ్నిపరీక్ష ఎదురైంది. అప్పుడే కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ పార్టీకి ఫ్యాన్ గుర్తును కేటాయించింది. జెండా మధ్యలో రాజశేఖర్ రెడ్డి చిరునవ్వు చిందించే ఫోటో, చుట్టూ సంక్షేమ పథకాల రంగులు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఆ ఫ్యాన్ గాలి రాష్ట్రవ్యాప్తంగా పెనుతుఫానులా మారి, విపక్షాలకు చెమటలు పట్టిస్తూ వైఎస్సార్‌సీపీని విజయపథం వైపు నడిపించింది.
ముళ్లబాటలో నిలిచిన మేరునగం
వైఎస్సార్‌సీపీ గడిచిన ఈ 16 ఏళ్ల ప్రయాణం కేవలం రాజకీయం కాదు.. అదొక మహా సంగ్రామం. ఈ దారి పూలబాట కాదు, అడుగడుగునా అడ్డంకులు ఎదురైన ముళ్లబాట. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వ్యక్తిగా ఒంటరిగా మొదలై, నేడు ఒక బలమైన వ్యవస్థగా ఎదిగిన తీరు అసాధారణం. జైలు గోడల మధ్య నిశ్శబ్దాన్ని భరిస్తూనే, జన సముద్రం మధ్య గర్జించే స్థాయికి ఆయన చేరుకున్నారు. ఓదార్పు యాత్రతో మొదలైన ఆత్మీయ స్పర్శ, 3,468 కిలోమీటర్ల రికార్డు స్థాయి పాదయాత్రతో ప్రజల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఆ పట్టుదలే 2019లో 151 సీట్ల చారిత్రాత్మక విజయంతో దేశ రాజకీయ పటాన్ని ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగి చూసేలా చేసింది.
సంబరాలకు సిద్ధమైన వేళ
గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక చారిత్రక ఘట్టానికి వేదిక కానుంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ స్వయంగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి ఆవిర్భావ వేడుకలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతుండగా, నీలి రంగు తోరణాలు, వైఎస్సార్, జగన్ భారీ కటౌట్లతో ఆ ప్రాంతమంతా ఒక పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. జగన్ రాక కోసం వేలాది మంది అభిమానులు, నేతలు ఇప్పటికే తాడేపల్లికి తరలివచ్చారు.
కార్యకర్తలే వెన్నెముక.. గడప గడపనా జెండా పండుగ
వైఎస్సార్‌సీపీకి అధికారం ఆభరణమైతే.. కార్యకర్తలే ఆ పార్టీకి ప్రాణం అంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ఉద్వేగభరిత ప్రకటన విడుదల చేసింది. ఎన్ని సంక్షోభాలు ఎదురైనా, ఎన్ని కుట్రలు పన్నినా గుండె నిబ్బరంతో నిలబడిన సైనికులే మా బలమని కొనియాడింది. 16వ ఏట అడుగుపెడుతున్న ఈ శుభవేళ, ప్రతి పల్లెలో, ప్రతి పేదవాడి గడపపైనా పార్టీ జెండా రెపరెపలాడాలని పిలుపునిచ్చింది. ఈ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నేతలు, అభిమానులు భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు, అన్నదానాలు, సేవా కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు.

