అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ సేన
x

అసెంబ్లీకి హాజరైన వైఎస్ జగన్ సేన

ఇంకొంచెం సేపట్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ సహా 11 మంది వైసీపీఎమ్మెల్యేలు హాజరవుతున్నారు.


రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు (AP Assembly Budget Sessions) ఇంకొంచెం సేపట్లో (బుధవారం) ప్రారంభం కానున్నాయి. ఈసారి ప్రారంభ సమావేశాలకు వైసీపీ సభ్యులు 11 మంది హాజరవుతున్నారు. వీళ్లు ఎంత సేపు సభలో ఉంటారన్నది ఇంకా స్పష్టం కాలేదు. ఉదయం పది గంటల తర్వాత ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఆ తర్వాత సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం అవుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలో అక్కడ ఖరారు చేస్తారు. ఈ సమావేశానికి వైసీపీ నుంచి శాసనమండలిలోని బొత్సా సత్యనారాయణ హాజరవుతారని సమాచారం. వైఎస్ జగన్ సహా 11 మంది శాసనసభ్యులు సభకు హాజరై గవర్నర్ ప్రసంగం తర్వాత వెళ్లిపోతారని కొందరు చెబుతున్నారు.

అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని స్పీకర్‌ ఆదేశించారు. ముఖ్యంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల నుంచి కచ్చితమైన సమాధానాలు ఇవ్వాలని కోరారు.
గత సమావేశాల్లో శాసనసభకు సంబంధించి 283 ప్రశ్నలకు, శాసనమండలికి సంబంధించి 562 ప్రశ్నలకు ఇంకా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సమాధానాలు రావలసి ఉంది. సభలో సభ్యులు అడిగే ప్రశ్నలను మానిటర్‌ చేసేందుకు వీలుగా జీఏడీలో ప్రత్యేకంగా పోర్టల్‌ను కూడా సిద్ధం చేశారు నిబంధనల ప్రకారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వారం రోజుల్లో శాఖల నుంచి సమాధానాలు రావలసి ఉంది.
వచ్చే వర్షాకాల సమావేశాల్లో ‘నేషనల్‌ ఈ-విధాన్‌’ కింద డిజిటల్‌ విధానంలో సభ నిర్వహణ చేయాలని భావిస్తున్నామని స్పీకర్‌ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బడ్జెట్‌ సమావేశాల అనంతరం మొదలుపెట్టాలని సూచించారు.
బడ్జెట్ ను ఎప్పుడు ప్రవేశపెట్టేది కూడా ఈవేళ జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. ఇప్పటికే బడ్జెట్ కసరత్తు పూర్తి అయింది. ఈసారి వినూత్నంగా వాటర్ బడ్జెట్ కూడా ఉండనుంది. ఇప్పటికే రెవెన్యూ, వ్యవసాయ బడ్జెట్ ఉండగా ఇప్పుడు ఇది మూడోది అవుతుంది. ఇదే జరిగితే దేశంలోనే మొదటి సారి వాటర్ బడ్జెట్ పెట్టిన రాష్ట్రంగా ఏపీ నమోదవుతుంది.

14న అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మార్చి 12 వరకూ సమావేశాలు జరుగుతా­యని ఇప్పటికే స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. మొత్తం 19 పని దినాల్లో సమావేశాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.

Read More
Next Story