నాడు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష..నేడు వైఎస్సార్‌సీపీ పాప ప్రక్షాళన పూజలు
x

నాడు పవన్ ప్రాయశ్చిత్త దీక్ష..నేడు వైఎస్సార్‌సీపీ పాప ప్రక్షాళన పూజలు

తిరుమల లడ్డూ చుట్టూ మారుతున్న రాజకీయ సమీకరణాలు.


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ తిరుగుతున్నఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. గతంలో ప్రసాదం కల్తీ జరిగిందంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే.. నేడు ఆ ఆరోపణలు అబద్ధమని తేలిపోయాయంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా పాప ప్రక్షాళన పూజలకు శ్రీకారం చుట్టింది. ఒకప్పుడు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పవిత్రమై శ్రీ వెంకటేశ్వరుని ప్రసాదంను అపవిత్రం చేశారని కూటమి నేతలు చేసిన విమర్శలే ఇప్పుడు వారి మెడకు చుట్టుకుంటున్నాయని వైఎస్సార్సీ శ్రేణులు ద్వజమెత్తుతున్నాయి.

సీబీఐ క్లీన్ చిట్‌తో సీన్ రివర్స్

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారం రేపాయి. ఆ అపచారానికి పరిహారంగా పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు దీక్ష చేసి, దేశవ్యాప్తంగా సనాతన ధర్మం గురించి మాట్లాడారు. అయితే, దీనిపై విచారణ జరిపిన సీబీఐ (CBI) అలాంటి కల్తీ ఏమీ జరగలేదని తేల్చి చెప్పడంతో.. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ఎదురుదాడి ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం చేసిన అపచారానికి'పరిహారంగా రాష్ట్రవ్యాప్తంగా వెంకన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది.

పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష

2024 సెప్టెంబర్‌లో శ్రీవారి లడ్డూలో పంది కొవ్వు, ఆవు కొవ్వు కలిశాయని ల్యాబ్ నివేదికలను ఉటంకిస్తూ కూటమి నేతలు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ, తన ప్రభుత్వ హయాంలో జరగకపోయినా సనాతన ధర్మ రక్షకుడిగా పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దుర్గాగుడి మెట్లు కడగడం, తిరుమల కొండను కాలినడకన అధిరోహించడం ద్వారా ఆయన భక్తులలో ఒక బలమైన భావోద్వేగాన్ని నింపారు.

సీబీఐ నివేదికతో సీన్ రివర్స్

దాదాపు 16 నెలల సుదీర్ఘ విచారణ తర్వాత సీబీఐ సిద్ధం చేసిన ఛార్జ్‌షీట్ ఇప్పుడు కూటమికి ఇబ్బందిగా మారింది. లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ అన్నది వాస్తవమే అయినా, అందులో జంతువుల కొవ్వు (Beef Tallow/Lard) లేదని సీబీఐ పేర్కొంది. పామాయిల్ మరియు సింథటిక్ కెమికల్స్‌తో తయారు చేసిన 'నకిలీ నెయ్యి'ని సరఫరా చేశారని విచారణలో వెల్లడైంది. దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందన్న ఆరోపణలు అవాస్తవమని తేలడంతో వైఎస్సార్‌సీపీకి ఇప్పుడు పెద్ద ఆయుధం దొరికింది.

వైఎస్సార్‌సీపీ పాప ప్రక్షాళన వ్యూహం

సీబీఐ క్లీన్ చిట్‌తో వైఎస్సార్‌సీపీ రంగంలోకి దిగింది. ఇప్పుడు అవే సెంటిమెంట్ అస్త్రాలను కూటమిపైకి వదులుతోంది. కూటమి నేతలు అసత్య ప్రచారంతో శ్రీవారి క్షేత్రానికి అపచారం చేశారని, ఆ పాపం పోవాలని రాష్ట్రవ్యాప్తంగా 'పాప ప్రక్షాళన' పూజలు నిర్వహిస్తోంది. జరగని అపచారాన్ని జరిగిందని చెప్పి భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. నాడు పవన్ మెట్లు కడిగితే, నేడు ర్యాలీలు తీస్తూ పవన్ కళ్యాణ్‌ను మరోసారి మెట్లు కడగాలని సవాల్ చేస్తున్నారు.

విజయవాడలో మెట్లు మళ్ళీ కడగాల్సిందే

వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడలో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. రాజకీయాల కోసం దేవుడిని లాగి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. జరగని ఘటనను జరిగిందని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మళ్ళీ దుర్గాగుడికి వచ్చి మెట్లు కడగాలి అని అవినాష్ డిమాండ్ చేశారు. సీబీఐ నివేదిక తర్వాత కూటమి నేతలు ప్రజలకు మొహం చూపించలేక తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.

రాయలసీమ నుంచి కోస్తా వరకు..101 టెంకాయల మొక్కులు

నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరు వెంకన్న స్వామికి పూజలు జరిగాయి. చంద్రబాబు, పవన్‌లకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ టెంకాయలు కొట్టారు. బద్వేలులో ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా ఆధ్వర్యంలో 101 టెంకాయలు కొట్టి పాప ప్రక్షాళన పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కేకే రాజు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఆలయాల వద్ద భక్తులతో కలిసి పూజలు చేశారు.

క్షమాపణకు పెరుగుతున్న డిమాండ్

కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ లబ్ధి కోసం తిరుమల క్షేత్రానికి కళంకం తెచ్చిందని వైఎస్సార్‌సీపీ ధ్వజమెత్తుతోంది. సీబీఐ నివేదిక నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. నాడు దీక్షలతో మొదలైన ఈ వివాదం.. నేడు ప్రక్షాళన పూజలతో కొత్త రాజకీయ రణక్షేత్రంగా మారింది.

Read More
Next Story