మండలిలో ’గీతం‘ సెగ
x

మండలిలో ’గీతం‘ సెగ

రూ. 5 వేల కోట్ల విలువైన భూములను గీతం యూనివర్శిటీకి కట్టబెట్టడంపై చర్చించాలని మండలిలో వైఎస్సార్‌సీపీ పట్టుబట్టింది.


నవ్యాంధ్ర శాసనమండలి వేదికగా శుక్రవారం రాజకీయ యుద్ధం పతాకస్థాయికి చేరింది. అటు విశాఖలో గీతం సాక్షిగా సాగుతున్న రూ. 5 వేల కోట్ల భారీ భూదోపిడీ, ఇటు తల్లికి వందనం పేరుతో జరుగుతున్న వంచనపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ గళమెత్తింది. పేదల గుడిసెలు కూల్చే ప్రోక్లైన్లు.. చంద్రబాబు బినామీలైన గీతం యాజమాన్యానికి వేల కోట్ల విలువైన భూములను ఎందుకు అప్పనంగా కట్టబెడుతున్నాయి? అంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మండలిని నిలదీశారు. వాయిదా తీర్మానం తిరస్కరణతో సభలో నినాదాల హోరు మిన్నంటగా, విశాఖను ఫైనాన్షియల్ క్యాపిటల్ నుంచి దోపిడీ క్యాపిటల్ గా మార్చేశారంటూ ప్రతిపక్ష సభ్యులు చేసిన విమర్శలు సభను షేక్ చేశాయి. అధికార కూటమి అడ్డగోలు నిర్ణయాలను ఎండగడుతూ, మండలిలో వైఎస్సార్‌సీపీ ఆందోళనలు వ్యక్తం చేసింది.

వాయిదా తీర్మానం తిరస్కరణ.. సభలో నినాదాల హోరు
గీతం యూనివర్సిటీ భూముల వ్యవహారంపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, పండుల రవీంద్రబాబు, పాలవలస విక్రాంత్‌లు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే, మండలి చైర్మన్ మోషేన్ రాజు దీనిని తిరస్కరించడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గీతం భూదోపిడీపై చర్చించాల్సిందే అంటూ సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. పరిస్థితి అదుపు తప్పడంతో చైర్మన్ సభకు ఐదు నిమిషాల పాటు విరామం ప్రకటించారు.
తల్లికి వందనం.. తల్లికి వంచనగా మారింది
విరామం అనంతరం ప్రారంభమైన ప్రశ్నోత్తరాల సమయంలో ‘తల్లికి వందనం’ పథకంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు ప్రతి ఇంటికి వెళ్లి నీకు రూ. 15 వేలు, నీకు రూ. 15 వేలు అని ఆశ చూపి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం పథకాన్ని తల్లికి వంచనగా మార్చారు అని మండిపడ్డారు. హామీల అమలులో ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని దుయ్యబట్టారు.
బినామీలకు భూముల పంపిణీ.. మీడియా పాయింట్‌లో నిప్పులు
మండలి మీడియా పాయింట్‌లో ఎమ్మెల్సీలు కుంభా రవిబాబు, వరుదు కళ్యాణి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. విద్యా వ్యాపారం చేస్తున్న గీతం సంస్థకు రూ. 5 వేల కోట్ల విలువైన భూములు ఇవ్వడం దారుణం. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా గీతంకి అప్పనంగా భూములు కట్టబెట్టడం పరిపాటిగా మారింది. 51 ఎకరాల 71 సెంట్లు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది పక్కా భూ కుంభకోణం అని మండిపడ్డారు. విశాఖను ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్న వారు.. ఇప్పుడు దోపిడీ క్యాపిటల్‌గా మార్చారు. గీతం భూములను రెగ్యులరైజ్ చేయడం కోసమే బీసీ మహిళా మేయర్‌ను పదవి నుంచి తొలగించారు. పేదలు గుడిసెలు వేసుకుంటే ప్రోక్లైన్లతో తొలగించే ప్రభుత్వం.. కుటుంబ సభ్యుల సంస్థలకు మాత్రం వేల కోట్లు కట్టబెడుతోంది. కబ్జా చేసిన భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. అని ధ్వజమెత్తారు.
వేడి పుట్టిస్తున్న విశాఖ భూములు
రుషికొండ భవనాలపై గతంలో రభస చేసిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు గీతం భూముల వ్యవహారంలో ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తోంది. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా స్థానిక సంస్థల భూములను ప్రైవేట్ సంస్థలకు ఎలా ఇస్తారని వైఎస్సార్‌సీపీ వేస్తున్న ప్రశ్నలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గీతం భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే వరకు తమ పోరాటం ఆగదని ప్రతిపక్షం తేల్చి చెప్పడంతో ఈ వివాదం మున్ముందు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది.
Read More
Next Story