
TTD Chairman BR Naidu
వీడియోలో కనిపిస్తున్న మహిళ మా కుటుంబ స్నేహితురాలే: బీఆర్ నాయుడు
డీప్ ఫేక్ వీడియోలతో మా ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు- టీటీడీ ఛైర్మన్
టీటీడీ ఛైర్మన్, ఓ ప్రముఖ మీడియా సంస్థ యజమాని బీఆర్ నాయుడు (BR నాయుడు) పై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఓ మహిళతో చనువుగా మెలుగుతున్నట్లు చూపిస్తూ ప్రచారంలోకి వచ్చిన వీడియోలు పూర్తిగా నకిలీవని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో తన రూపాన్ని మార్ఫింగ్ చేసి తప్పుడు దృశ్యాలు సృష్టించారని ఆరోపించారు.
వైరల్ అయిన పోటో ఇదే...
తాను టీటీడీ ఛైర్మన్‌గా నిస్వార్థంగా పనిచేస్తుంటే, ఉద్దేశపూర్వకంగా బురదచల్లే ప్రయత్నం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోలు తన వ్యక్తిగత ప్రతిష్టకే కాకుండా టీటీడీ వంటి పవిత్ర సంస్థ ప్రతిష్టను దెబ్బతీయడానికే సృష్టించారని అన్నారు. కొందరు రాజకీయ దురుద్దేశంతో ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ముఖ్యంగా వైఎస్సార్సీపీకి చెందిన కొందరు ఈ వ్యవహారంలో పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత వర్గాల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది.
వైరల్ వీడియోల నేపథ్యంలో కొందరు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఆయన స్పందించారు. “ఈ పదవి నాకు బతుకుదెరువు కాదు. ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతోనే వచ్చా. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం నన్ను నియమించారు. దానికి అనుగుణంగా పనిచేస్తున్నా. అసత్య ప్రచారాలకు భయపడను,” అని చెప్పారు.
వీడియోలో కనిపిస్తున్న వారు తన కుటుంబ స్నేహితులేనని, 30 ఏళ్లుగా పరిచయం ఉందని వివరించారు. వీడియోలో కొంత భాగాన్ని మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఈ కుట్ర వెనుక ఉన్న వారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డీప్‌ఫేక్ సాంకేతికత ద్వారా తప్పుడు వీడియోలు సృష్టించి వ్యక్తుల ప్రతిష్టను దెబ్బతీయడం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Next Story

