
మహారాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా సునేత్రా పవార్?
ఎన్‌సీపీ ఏకాభిప్రాయానికి మద్దతిస్తాం: సీఎం ఫడ్నవీస్..
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నేత అజిత్ పవార్(Ajit Pawar) విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత, మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయన బాధ్యతలు తన భార్యకు అప్పగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నిర్ణయంపై కుటుంబం, పార్టీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అయితే వారి నిర్ణయానికి పూర్తి మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(CM Fadnavis)నాగ్‌పూర్‌లో మీడియాతో అన్నారు.
ముంబై చేరుకున్న సునేత్రా..
ఇదిలా ఉండగా, రాజ్యసభ సభ్యురాలైన సునేత్రా పవార్(Sunetra Pawar) శనివారం తెల్లవారుజామున కొడుకు పార్థ్‌తో కలిసి ముంబై చేరుకున్నారు. ప్రస్తుతం వారు దక్షిణ ముంబైలోని తన భర్త అజిత్ పవార్ అధికారిక నివాసంలో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్‌సీపీ చీఫ్‌గా..
మహారాష్ట్ర శాసనసభలోని రెండు సభలలోనూ సభ్యురాలు కాని 62 ఏళ్ల సునేత్రా పవార్‌ను, శనివారం మధ్యాహ్నం ముంబైలో జరగనున్న సమావేశంలో ఎన్‌సీపీ శాసనసభా విభాగం నాయకురాలిగా ఎన్నుకోనున్నారు. ఆ తరువాత ఆమె మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.
అజిత్ పవార్ మరణంతో ఎన్‌సీపీ పార్టీ, శరద్ పవార్ నేతృత్వంలోని వర్గం త్వరలో విలీనం అయ్యే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. అయితే సునేత్రా మహాయుతి ప్రభుత్వంలో చేరాలనే నిర్ణయం గురించి తమకు సమాచారం లేదని ఎన్‌సీపీ (ఎస్పీ) వర్గాలు, శరద్ పవార్ కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా..
2024 లోక్‌సభ ఎన్నికల్లో సునేత్రా పవార్ తన భర్త పార్టీ అభ్యర్థిగా బారామతి నియోజకవర్గం నుంచి పోటీచేశారు. ఆ ఎన్నికల్లో ఆమె వదిన, ప్రస్తుత ఎన్‌సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సులే చేతిలో ఓటమి ఎదురైంది. తరువాత సునేత్రాకు రాజ్యసభకు ఎంపికయ్యారు.
శనివారం మధ్యాహ్నం ముంబైలో ఎన్‌సీపీ శాసనసభా విభాగం సమావేశం జరుగుతుందని, ఇందులో సునేత్రా పవార్‌ను నాయకురాలిగా ఎన్నుకుంటామని రాష్ట్ర మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు ఛగన్ భుజ్‌బల్ తెలిపారు.

