రఘువీర గాంధీ సందేశ యాత్ర ఎందుకు?
x
గాంధీ సందేశ యాత్ర ప్రారంభం సందర్భంగా సర్వమత ప్రార్థనలు

రఘువీర 'గాంధీ సందేశ యాత్ర' ఎందుకు?

శ్రీలంకలో పుట్టిన ఆలోచన.. మడకశిర రాజకీయాల్లో కొత్త మలుపు!


రాజకీయాల్లో నిలకడ, నిరాడంబరతకు మారుపేరుగా నిలిచిన ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి మళ్ళీ జనంలోకి వస్తున్నారు. కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి, తన స్వగ్రామమైన నీలకంఠాపురంలో అద్భుతమైన ఆలయ నిర్మాణంతో ‘టెంపుల్ మ్యాన్’గా, ఆస్పత్రి నిర్మాణంతో 'పేదల మనిషి'గా పేరు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు ‘గాంధీ సందేశ యాత్ర’తో పొలిటికల్ రీ-ఎంట్రీ ఇస్తున్నారు.

శ్రీలంక పర్యటనలో పుట్టిన ఆలోచన..

ఈ యాత్ర వెనుక ఒక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. ఇటీవల రఘువీరారెడ్డి తన కుటుంబంతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లారు. అక్కడ ట్రింకోమలి వంటి ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు, అనేక చోట్ల మహాత్మా గాంధీ విగ్రహాలను పూజించడం, స్థానికులు గాంధీ గురించి గొప్పగా మాట్లాడుకోవడం ఆయన గమనించారు.

సరిగ్గా అదే సమయంలో, భారతదేశంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్త ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. "ప్రపంచవ్యాప్తంగా గాంధీని ఆరాధిస్తుంటే.. సొంత దేశంలోనే ఆయన పేరు లేకుండా చేస్తున్నారా?" అనే ఆవేదనతోనే ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని సీనియర్ జర్నలిస్టు భోగేశ్వర్ రెడ్డి విశ్లేషించారు.

యాత్ర ప్రత్యేకతలు: 78 మందితో 'కూలీ భోజనం'

జనవరి 28 నుండి 30 వరకు మూడు రోజుల పాటు నీలకంఠాపురం నుంచి హిందూపూర్ వరకు సాగే ఈ యాత్రలో అనేక విశేషాలు ఉన్నాయి. 1930 నాటి దండి యాత్ర స్ఫూర్తితో, సరిగ్గా 78 మంది అనుచరులతో, ఏ పార్టీ జెండా లేకుండా కేవలం జాతీయ జెండాతో ఆయన నడుస్తున్నారు.
మడకశిరలో రచ్చబండ: తొలి రోజు అంటే ఇవాళ ఉదయం 9 గంటలకు నీలకంఠాపురం నుండి ప్రారంభించారు. మధ్యాహ్నానికి మడకశిర చేరుకుంటారు. అక్కడ ప్రజలతో ముఖాముఖి (రచ్చబండ) నిర్వహిస్తారు. మొదటి రోజు రాత్రికి బుళ్లసముద్రంలో బస చేస్తారు.
కూలీ భోజనం: యాత్రలో పాల్గొనే వారందరికీ సాదాసీదాగా రాగి సంకటి, అన్నం, పప్పు వంటి ‘కూలీ భోజనం’ మాత్రమే ఏర్పాటు చేశారు.
వారసురాలి కోసం 'వ్యూహాత్మక' అడుగు?
ఈ యాత్ర నిరసన కోసమే అయినా, దీని వెనుక రఘువీరా తన కుమార్తె డాక్టర్ అమృత రాజకీయ అరంగ్రేట్రానికి బాటలు వేస్తున్నారనే చర్చ బలంగా నడుస్తోంది. మడకశిర పీఠంపై తన వారసత్వాన్ని నిలుపుకునేందుకు అమృతను ప్రజల్లోకి తీసుకెళ్లే వ్యూహమిదని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. డాక్టరుగా సేవలు అందిస్తున్న అమృత, యాత్రలో మహిళా కూలీలతో నేరుగా మమేకమవుతూ ‘లీడర్’గా ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

నాలుగుసార్లు ఎమ్మెల్యే.. మచ్చలేని చరిత్ర

రఘువీరారెడ్డికి పాదయాత్రలు కొత్త కాదు. 2012లో మంత్రిగా ఉన్నప్పుడే హంద్రీనీవా నీళ్ల కోసం 200 కిలోమీటర్లు నడిచారు. మడకశిర నుండి మూడుసార్లు, కళ్యాణదుర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు రైతుల పక్షపాతిగా మచ్చలేని చరిత్ర ఉంది. ఇప్పుడు తన 68 ఏళ్ల వయస్సును లెక్కచేయకుండా రోజుకు సగటున 15 కిలోమీటర్లు నడవాలని నిర్ణయించుకోవడం ఆయన పట్టుదలకు నిదర్శనం.

రెండో రోజు అంటే బుళ్ల సముద్రం నుంచి ధనాపురం క్రాస్ మీదుగా సాయంత్రానికి సేవామందిర్ చేరుకుంటుంది.అక్కడ రాత్రి 9 గంటలకు బహిరంగ సభ నిర్వహిస్తారు.
ఇక మూడో రోజు సేవామందిర్ నుంచి హిందూపూర్ గాంధీ చౌక్ వద్దకు సాగుతుంది. అక్కడ బహిరంగ సభ జరుగుతుంది.
తన యాత్రలో ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా చూస్తున్నారు. అన్ని పార్టీల వారిని ఆహ్వానించారు. జాతీయ జెండా, గాంధీ చిత్రపటాలతో యాత్ర సాగుతోంది. బహిరంగ సభలకు కూడా ఏ పెద్ద నాయకుణ్ణీ ఆయన ఆహ్వానించలేదు.
రాజకీయ స్పందనలు
ఈ యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపగా, అధికార కూటమి (TDP-JSP-BJP) దీనిని కేంద్రంపై నిరసనగా చూస్తోంది. అటు వైసీపీ మాత్రం రఘువీరా క్లీన్ ఇమేజ్ వల్ల తమ ఓటు బ్యాంకుకు ఎక్కడ గండి పడుతుందోనని ఆందోళన చెందుతోంది.
జనవరి 30న గాంధీజీ వర్ధంతి సందర్భంగా హిందూపురంలో భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగియనుంది. ఆధ్యాత్మికత నుండి మళ్ళీ రాజకీయాల వైపు అడుగులేస్తున్న రఘువీరారెడ్డి, ఈ యాత్ర ద్వారా తన రాజకీయ భవిష్యత్తును, కుమార్తె రాజకీయ అరంగ్రేట్రాన్ని ఎంతవరకు సుగమం చేసుకుంటారో చూడాలి!
Read More
Next Story