
పుట్టా సుధాకర్ యాదవ్
పుట్టాపై టీడీపీకి, వైసీపీకి ఇంత 'ప్రేమ' ఎందుకు?
పుట్టా రాజీనామాకు ఎందుకు డిమాండ్ చేయడం లేదు? లోక్ సభ స్పీకర్ కి వైసీపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
మాదక ద్రవ్యాలు తీసుకుంటూ పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వ్యవహారం ముదురుతోంది. నిజానికి ఆయన ఇప్పటికే నైతికంగా రాజీనామా చేయాలి. కానీ ఆయన చేయలేదు. ఆయన పార్టీ టీడీడీ.. ఆ పార్టీ ఆయన్ను బహిష్కరించలేదు. పార్టీకీ ఆయనా రాజీనామా చేయలేదు. లోక్ సభ స్పీకర్ స్వచ్ఛందంగా కేసు తీసుకోవచ్చు. కానీ తీసుకోలేదు. సీరియస్ గా తీసుకోవాల్సిన ప్రతిపక్షం తీసుకోలేదు. టీడీపీపై ఒంటికాలిపై లేచే వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్ కి ఫిర్యాదు చేయవచ్చు. వాళ్లింకా చేయలేదు. కానీ పోలీసులు ఆయనకు 24 గంటల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. ఆయన ఇప్పుడు ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. ఇలా ఓ సామాన్యుడికి సాధ్యమవుతుందా అని సీనియర్ రాజకీయ విశ్లేషకుడు రాజ్ దీప్ సర్దేశాయ్ అడగనే అడిగారు.
Drug raid shakes up Andhra politics: TDP MP Putta Mahesh tests positive for drugs, but gets station bail; BRS leader in custodyCM Chandrababu Naidu directs Mahesh to stay away from party activities, seeks detailed explanation#NewsToday | @SardesaiRajdeep @Journo_Abdul pic.twitter.com/6AE5JStA3P
— IndiaToday (@IndiaToday) March 16, 2026
ఇవన్నీ భవిష్యత్ సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నట్టని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
మార్చి 14, అర్థరాత్రి, 2026 రాత్రి హైదరాబాద్ మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో తెలంగాణ ఈగల్ టీమ్ (Elite Action Group for Drug Law Enforcement) దాడి చేసింది. ఈ రైడ్‌లో మద్యం, కొకైన్‌తో పాటు రివాల్వర్ పట్టుబడింది. 11 మందిని విచారించగా, ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా తేలింది. వారిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. మొదట యూరిన్ టెస్ట్ నెగటివ్‌గా వచ్చినా, రక్త పరీక్షలో మెథ్ (మెథాంఫెటమిన్) పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. యూరిన్ టెస్ట్ కోసం ఇచ్చిన బాటిల్ లో ఆయన బాత్‌రూంలో నీళ్లు పట్టి ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి.
అయినా పోలీసులు 24 గంటల్లో స్టేషన్ బెయిల్ మంజూరు చేసి ఎంపీని విడుదల చేశారు. ఆయన ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన వీడియో స్టేట్‌మెంట్‌లో తీవ్రంగా ఖండించారు. “నేను ఎలాంటి తప్పూ చేయలేదు. మీడియా, సోషల్ మీడియా వార్తలు నమ్మొద్దు” అని ప్రజలను కోరారు.
మరోపక్క, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు 48 గంటల (లేదా 5 రోజుల)లో రాతపూర్వక వివరణ కోరుతూ నోటీసు ఇచ్చారు. పార్టీ నుంచి బహిష్కరణ లేదు, సస్పెండ్ కూడా చేయలేదు.
వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ఏమన్నారంటే...
టీడీపీ చేసే ప్రతి చిన్న వ్యవహారాన్నీ రాజకీయ అస్త్రంగా మలుచుకునే వైసీపీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పట్టించుకోలేదన్న విమర్శలు ఆ పార్టీలోనే ఉంది. బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగు నాగార్జున “ఎంపీ తక్షణం లోక్‌సభకు రాజీనామా చేయాలి. చంద్రబాబు షోకాజ్ నోటీసులతో కాలయాపన చేస్తున్నారు. డ్రగ్స్ రహిత రాష్ట్రం అని చెప్పిన మాటలు నీటి మూటలయ్యాయి” అని మండిపడ్డారు. టీడీపీని “తెలుగు డ్రగ్స్ పార్టీ” అని విమర్శించారు. ఇతర నాయకులు (కురసాల కన్నబాబు, కాకాణి గోవర్ధన్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, దూలం నాగేశ్వర రావు తదితరులు) కూడా రాజీనామా డిమాండ్ చేశారు.
గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం గంజాయి పంటలు ధ్వంసం చేసిన చరిత్రను గుర్తు చేశారు. మరి అలాంటప్పుడు పార్లమెంటు స్పీకర్ కు ఎందుకు ఫిర్యాదు చేయలేదన్న దానికి సమాధానం లేదు.
ఇంకోపక్క, సీపీఐ, సీపీఎం నేతలు మాత్రం గట్టిగానే విమర్శించారు. పుట్టా మహేష్ తక్షణమే ఎంపీ పదవికి రాజీనామా చేయాలన్నారు. ఆయన వెనకున్న గంజాయి సామ్రాజ్యాన్ని వెలికితీయాలన్నారు.
సమాజానికి సందేశం ఏమిటి?
చట్టాలు చేసే ఎంపీలు డ్రగ్స్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొంటే యువతకు ఏ సందేశం ఇచ్చినట్టు? తెలుగురాష్ట్రాలలో విచ్చలవిడిగా సాగుతున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాల్సిన వాళ్లే మాదకద్రవ్యాలకు బానిసలుగానో, డ్రగ్ డీలర్లగానో మారితే ఈ సమాజానికి దిక్కేమిటీ? అనే ప్రశ్నలు వినబడుతున్నాయి.
“డ్రగ్స్ వద్దు బ్రో” క్యాంపెయిన్ చేస్తున్న టీడీపీ ప్రభుత్వ సొంత ఎంపీ ఇలా దొరికితే ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. ఇది కేవలం ఒక వ్యక్తి వ్యవహారం కాదు – ప్రజాప్రతినిధుల నైతిక పతనం అంటున్నారు విశ్లేషకులు.
పార్లమెంటు స్పందన ఎందుకు లేదు?
ఈనేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌కు రెండు మార్గాలు ఉన్నాయి. స్వయంగా (Suo Motu) చర్య తీసుకోవచ్చు. రూల్ 373, 374 ప్రకారం సభ గౌరవానికి భంగం కలిగితే నేరుగా సస్పెండ్ చేయవచ్చు. సభ పరువు పోతోందని భావిస్తే ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయవచ్చు (మహువా మోయిత్రా కేసు 2023లో ఇలాగే జరిగింది).
విపక్ష ఎంపీలు “అనైతిక ప్రవర్తన” అని నోటీసు ఇస్తే స్పీకర్ ఎథిక్స్ కమిటీకి పంపుతారు. డ్రగ్స్ కేసు పూర్తిగా “Conduct Unbecoming of a Member” కిందికి వస్తుంది.
ఇప్పటి వరకు స్పీకర్ ఓం బిర్లా స్వయంగా చర్య తీసుకోలేదు. ఎథిక్స్ కమిటీకి కేసు రిఫర్ కాలేదు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు ఫిర్యాదు చేయలేదు. రాబోయే రోజుల్లో చేస్తారేమో చూడాలి. ప్రధాన మీడియా కూడా ఈ వ్యవహారాన్ని పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. పార్లమెంటు స్థాయి చర్యలూ లేవు.
గతంలో సోమనాథ్ చటర్జీ ఏం చేశారంటే..
2005 క్యాష్ ఫర్ క్వెరీ స్కాం (పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకోవడం)లో సోమనాథ్ చటర్జీ స్పీకర్‌గా 11 మంది ఎంపీలను (6 BJP, 3 BSP, 1 Congress, 1 RJD) బహిష్కరించారు.
“సభ గౌరవం, నైతికత” ఆధారంగా కోర్టు తీర్పు కోసం వేచి ఉండకుండా చర్య తీసుకున్నారు.
2023 మహువా మోయిత్రా కేసులో ఎథిక్స్ కమిటీ నివేదిక ఆధారంగా బహిష్కరించారు. “అనైతిక ప్రవర్తన, జాతీయ భద్రతకు ముప్పు” అని గ్రౌండ్స్ పై తొలగించారు.
పుట్టా మహేష్ కేసులో కూడా “సభ పవిత్రత” (Sanctity of the House) ఉల్లంఘనగా చూడవచ్చు. ఎంపీగా ప్రమాణం చేసిన వ్యక్తి చట్టాన్ని ఉల్లంఘించడం అనైతికమే. కానీ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 8 ప్రకారం కోర్టు శిక్ష (2 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ) వచ్చిన తర్వాతనే అనర్హత వస్తుంది. ఎథిక్స్ కమిటీ విచారణ ద్వారా సస్పెండ్ లేదాబహిష్కరణ సాధ్యం.
ఇప్పుడు ఏమవుతుందీ
వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తే ఎథిక్స్ కమిటీకి వెళ్లే అవకాశం ఉంది. స్పీకర్ స్వయంగా చొరవ తీసుకుంటే సంచలనమే. కానీ ప్రస్తుతం రాజకీయ ఒత్తిడి, షోకాజ్ నోటీసులు, బెయిల్‌తో కేసు కొనసాగుతోంది. NDPS చట్టం కింద విచారణ కొనసాగుతుంది.
ఈ ఉదంతం ఒకటి మాత్రమే కాదు – పార్లమెంటు నైతికత, ప్రజా ప్రతినిధుల బాధ్యత, రాజకీయాల్లో చిత్తశుద్ధి పై పెద్ద చర్చకు దారి తీస్తోంది. సోమనాథ్ చటర్జీ యుగం నుంచి ఓం బిర్లా వరకు “సభ గౌరవం” కాపాడాల్సిన బాధ్యత ఇప్పుడు మరోసారి పరీక్షకు గురవుతోంది.
రాజీనామా చేయాలా? ఎథిక్స్ కమిటీకి పంపాలా? లేదా కోర్టు తీర్పు వరకు వేచి చూడాలా?.. సమాధానం పార్లమెంటు నుంచి రావాలి – లేకపోతే సమాజం తీర్పు ఇస్తుంది.
(ఈ కథనం పోలీసు నివేదికలు, పార్టీ ప్రకటనలు, గత పార్లమెంటరీ ఉదాహరణల ఆధారంగా రూపొందింది. ప్రస్తుతం ఎథిక్స్ కమిటీకి ఎలాంటి ఫిర్యాదు రాలేదు.)
Next Story

