
మండలిలో ’సీమ‘ సెగ..రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదన్న బొత్స
ఏపీ శాసన మండలిలో రాయలసీమ ఎత్తిపోతలపై నిప్పులు చెరిగిన బొత్స .. ధీటుగా బదులిచ్చిన మంత్రులు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి వేదికగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్ అదే స్థాయిలో తిప్పికొట్టారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలి : బొత్స డిమాండ్:
రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేతపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవమా? కాదా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఒక ప్రకటన చేసినప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై లేదా? లిఫ్ట్ పనులు ఎప్పుడు మొదలుపెడతారు? ఎప్పటికి పూర్తి చేస్తారు? అన్న దానికి ఎస్ ఆర్ నో చెప్పాలి అని బొత్స నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వంతో లాలూచీ పడి రాయలసీమకు అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ సభ్యులు ఇషాక్ బాషా, రామసుబ్బారెడ్డి ఆరోపించారు.
ప్రాజెక్టును ఆపింది జగన్ ప్రభుత్వమే : మంత్రి నిమ్మల కౌంటర్:
వైఎస్సార్‌సీపీ ఆరోపణలను మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రంగా ఖండించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఎన్జీటీ (NGT) ఈ ప్రాజెక్టును ఆపిందని, భారీ జరిమానా కూడా విధించిందని గుర్తు చేశారు. 2023 ఆగస్టులో స్వయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే ఇది సాగునీటి కోసం కాదు, కేవలం తాగునీటి కోసమేనని అఫిడవిట్ ఇచ్చిందని సభ దృష్టికి తెచ్చారు. నాడు కేసీఆర్ అడిగారని ప్రాజెక్టును ఆపింది మీరేనని అప్పటి మంత్రి హరీశ్ రావు చెప్పిన విషయం మర్చిపోయారా? అని నిమ్మల ఎద్దేవా చేశారు. రాజకీయ లబ్ధి కోసం పొరుగు రాష్ట్ర నేతలు మాట్లాడే మాటలకు ప్రభుత్వం బాధ్యత వహించదన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు : పయ్యావుల ధ్వజం
మంత్రి పయ్యావుల కేశవ్ జోక్యం చేసుకుంటూ.. రాయలసీమకు నిజమైన ద్రోహి జగన్ మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు ప్రాజెక్టును గాలికొదిలేసి, ఇప్పుడు 11 సీట్లకు పరిమితమయ్యాక సీమ ప్రజల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను పొరుగు రాష్ట్రానికి తాకట్టు పెట్టిందని విమర్శించారు. మంత్రుల సమాధానంతో సంతృప్తి చెందని వైఎస్సార్‌సీపీ సభ్యులు సభలో నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు: వైఎస్సార్సీపీ
ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇతర సభ్యులు ఈ విషయంలో ప్రభుత్వం మౌనం వహించడాన్ని తప్పుబట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించకపోవడం అంటే ఆ వ్యాఖ్యలు నిజమేనని అంగీకరించినట్లేనని, ఇది రాయలసీమ ప్రాంత ప్రయోజనాలకు విఘాతం కలిగించడమేనని వారు ఆరోపించారు. సీఎం చంద్రబాబు ,తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల మధ్య జరిగిన ముఖాముఖి సమావేశాల్లో రాయలసీమ ప్రాజెక్టును నిలిపివేసేలా ఏవైనా రహస్య ఒప్పందాలు జరిగాయా అని వైఎస్సార్సీపీ సభ్యులు ప్రశ్నించారు. ఈ అంశంపై అధికార కూటమి (TDP-JSP-BJP), వైఎస్సార్సీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం , నినాదాల వల్ల సభలో గందరగోళం నెలకొంది. దీనితో మండలి చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేయాల్సి వచ్చింది.
Next Story

