
ఆ టీడీపీ నేత చెప్పుతో ఎందుకు కొట్టుకున్నట్లు?
దర్శి టీడీపీలో తెలుగు తమ్ముళ్లలో కమీషన్ల' సెగ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, ఒక పార్టీకి 14 ఏళ్లుగా అండగా ఉండి, మండల కన్వీనర్‌గా పనిచేసిన ఒక సీనియర్ నాయకుడు.. బహిరంగంగా సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన చెప్పుతో తనే కొట్టుకోవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లా దర్శి నియోజక వర్గం పరిధిలోని ముండ్లమూరు మాజీ మండల కన్వీనర్ సోమేపల్లి శ్రీనివాసరావు చేసిన ఈ పని, దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అద్దం పడుతోంది.
అధికారంలోకి ఎందుకొచ్చామా అని ఆవేదన
2024లో టీడీపీ ఎందుకు అధికారంలోకి వచ్చిందా? అని ప్రశ్నిస్తూ సోమేపల్లి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత అయి ఉండి కూడా, ఆయన ఈ స్థాయి నిర్ణయం తీసుకోవడం వెనుక నియోజకవర్గ ఇన్‌చార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఒంటెత్తు పోకడలే కారణమని తెలుస్తోంది. సాధారణంగా పార్టీ నచ్చకపోతే రాజీనామా చేస్తారు, కానీ ఇలా చెప్పుతో కొట్టుకుని మరీ నిరసన తెలపడం వెనుక పెద్ద కమీషన్ల భాగోతం ఉందని ప్రచారం జరుగుతోంది.
వెంచర్ డీల్.. కోటి రూపాయల కప్పం?
ముండ్లమూరులో ఒక భారీ వెంచర్‌కు సంబంధించి మట్టి తోలకాలు, ఇతర పనుల కాంట్రాక్టు విషయంలో ఇన్‌చార్జ్ ప్రతినిధులకు, శ్రీనివాసరావుకు మధ్య వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ వెంచర్ అనుమతి కోసం కోటి రూపాయల డీల్ కుదిరిందని, ఇప్పటికే రూ. 60 లక్షలు చెల్లించగా.. మిగిలిన రూ. 40 లక్షల కోసం ఇన్‌చార్జ్ వర్గీయులు తీవ్ర ఒత్తిడి తెచ్చారని వినికిడి. పాత బిల్లులు అడ్డుకోవడమే కాకుండా, కమీషన్ల కోసం వేధిస్తుండటంతో తట్టుకోలేక ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది.
ఇసుక, మట్టి.. అంతా ఇన్‌చార్జ్ ఖాతాలోకే
నియోజకవర్గంలో ఏ నాయకుడినీ ఇసుక లేదా మట్టి తోలుకోనివ్వకుండా, మొత్తం ఇన్‌చార్జే దోచుకుంటున్నారన్న విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. గతంలో ఇన్‌చార్జ్ అనుమతి లేకుండా ఇసుక సరఫరా చేస్తున్నారన్న నెపంతో, కమ్మవారి పాలేనికి చెందిన ఒక టీడీపీ నేత లారీని ఇన్‌చార్జ్ అనుచరులే ధ్వంసం చేయడం గమనార్హం. గ్రావెల్ ఎత్తాలన్నా, చేపల చెరువులు వేయాలన్నా ఇన్‌చార్జ్ కార్యాలయానికి కప్పం కట్టాల్సిందేనని హుకుం జారీ చేయడంతో సొంత పార్టీ కేడర్ బెంబేలెత్తిపోతోందనే చర్చ టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది.
సీనియర్ల విస్మరణ.. అధికారులపై ఒత్తిడి
కేవలం పైకం ముట్టజెప్పే వారికే ప్రాధాన్యత ఇస్తూ, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను విస్మరిస్తున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. ముండ్లమూరుకు చెందిన ఒక మాజీ ఎంపీపీకి పెత్తనం నీదే అని చెప్పి, వెనక నుంచి అధికారులకు ఫోన్ చేసి ఆయన మాట వినవద్దు అని చెప్పడం ఇన్‌చార్జ్ ద్వంద్వ నీతికి నిదర్శనమనే చర్చ కూడా టీడీపీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ భారీగా వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జనసేన వైపు చూపు
ఇన్‌చార్జ్ తీరుతో విసిగిపోయిన పలువురు టీడీపీ నాయకులు ఇప్పటికే జనసేన పార్టీలో చేరుతున్నారు. గొట్టిపాటి లక్ష్మికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, అందుకే అందినకాడికి దోచుకుని ఊడ్చేస్తున్నారన్న ఆరోపణలు పార్టీకి పెద్ద డ్యామేజ్ కలిగిస్తున్నాయని స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. ఏదేమైనా సోమేపల్లి శ్రీనివాసరావు ఘటనతో దర్శి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చాయి. వీటి మీద ఆ పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, ఈ డ్యామేజీని ఏ విధంగా కవర్ చేసుకుంటుందో అనేది ప్రశ్నార్థకంగా మారింది.
అధిష్టానం తలవొంచుకునేలా..

