కేరళలో ప్రభుత్వ వ్యతిరేకత… కానీ ఫలితం ఎవరికీ?
x

కేరళలో ప్రభుత్వ వ్యతిరేకత… కానీ ఫలితం ఎవరికీ?

పాలక ఎల్‌డీఎఫ్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నట్టు సర్వేలు సూచిస్తున్నా, ఆ వ్యతిరేకత యూడీఎఫ్‌కు ఎందుకు అనుకూలం కాదు?


Click the Play button to hear this message in audio format

ఎన్నికల ముందు కేరళలో రాజకీయ వాతావరణం మెల్లగా వేడెక్కుతోంది. ప్రజల్లో పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్‌ (ఎల్‌డీఎఫ్‌) ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందని అనేక ప్రీ–పోల్‌ సర్వేలు చెబుతున్నా, అదే అసంతృప్తి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (యూడీఎఫ్‌)కు విజయంగా మారుతుందా? అన్న ప్రశ్నపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న భావన బలంగా కనిపించినప్పటికీ, అది ఒకే రాజకీయ ప్రత్యామ్నాయానికి కేంద్రీకృతమవకపోవడం వల్ల ఎన్నికల సమీకరణాలు సంక్లిష్టంగా మారుతున్నాయి.


ప్రభుత్వంపై వ్యతిరేకత..

సుమారు 53 శాతం మంది ఓటర్లు ప్రస్తుత పినరయి విజయన్‌ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్‌ ప్రభుత్వాన్ని ఓడించాలని కోరుకుంటున్నారని రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల చేపట్టిన అభిప్రాయ సేకరణ ద్వారా తెలుస్తోంది.

అయితే దాదాపు 40 శాతం మంది ఇంకా ప్రభుత్వానికే మద్దతు తెలుపుతున్నట్టు అదే సర్వేలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్నప్పటికీ, వామపక్షాలకు బలమైన ఓటు బ్యాంక్‌ ఉందన్న విషయాన్ని సూచిస్తున్నాయి. అంటే జనం మార్పు కోరుకుంటున్నా..ఆ మార్పు ఎటు వైపు మళ్లుతుందన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి.

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న అంతర్గత సర్వేలు కూడా ఇదే సందిగ్ధత నెలకొంది. ఎల్‌డీఎఫ్‌పై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా, కాంగ్రెస్‌ ఆ అసంతృప్తిని ఓట్లుగా మలచుకోగలదా? అనే అనుమానం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొన్ని జిల్లాల్లో పార్టీ నిర్మాణం బలహీనంగా ఉండటం, బూత్‌ స్థాయి కార్యకర్తల కొరత, వర్గపోరు, అభ్యర్థుల ఎంపికలో అంతర్గత విభేదాలు లాంటి అంశాలు యూడీఎఫ్‌ విజయ అవకాశాలను ప్రభావితం చేసే అంశాలు. అభిప్రాయ సేకరణలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ, ఆ మద్దతును గెలుపుగా మార్చే యంత్రాంగం బలహీనంగా ఉందన్న అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.


సిట్టింగులపై సానుకూల అభిప్రాయం..

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌డీఎఫ్‌పై అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ, చాలా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం ఓటర్లు సానుకూల అభిప్రాయంతో ఉన్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. అంటే ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉన్నా, స్థానిక ప్రతినిధిని మార్చాలన్న ఉద్దేశం ప్రతిచోటా కనిపించడం లేదు. ఈ పరిస్థితి కాంగ్రెస్‌ వ్యూహానికి పెద్ద సవాల్‌గా తయారైంది.

కేరళలో బీజేపీ పెద్ద సంఖ్యలో సీట్లు గెలిచే స్థితిలో లేకపోయినా, కొన్ని పట్టణ ప్రాంతాలు, మధ్యతరగతి వర్గాల్లో రెండంకెల ఓట్ షేర్ సాధించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇది ప్రత్యక్షంగా కాంగ్రెస్‌కు నష్టంగా మారే అవకాశం ఉంది. త్రిముఖ పోటీ ఏర్పడినప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు యూడీఎఫ్‌, బీజేపీలకు పడితే వామపక్షాలు పరోక్షంగా లాభపడే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ పార్టీ కూడా ఈ అంశంపై ఆందోళన వ్యక్తమవుతున్నట్టు సమాచారం. బలహీనమైన బూత్‌ యంత్రాంగం, జిల్లా స్థాయి నాయకత్వ అసమానతలు, వర్గపోరు వంటి నిర్మాణాత్మక సమస్యలు ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా వినియోగించుకునే అవకాశాన్ని తగ్గిస్తున్నాయని పార్టీ వర్గాల అంచనాలు సూచిస్తున్నాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నా, అందుకు తగ్గట్టుగా ప్రత్యామ్నాయం లేకపోవడం కాంగ్రెస్‌కు లోటుగా భావిస్తున్నారు.


వ్యతిరేకతను తగ్గించే దిశగా..

మరోవైపు ఎల్‌డీఎఫ్‌ వ్యూహం మాత్రం స్థానికీకరణపై దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక భావన ఉన్నా, ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, స్థానిక సమస్యల పరిష్కరించి ఆ ప్రభావాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది. సర్వేల్లో అనేక ప్రాంతాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న మద్దతు ఈ వ్యూహానికి బలం ఇస్తోంది. అంటే ఎల్‌డీఎఫ్‌ రాష్ట్రస్థాయి అసంతృప్తిని స్థానిక విజయాలతో సమతుల్యం చేసే ప్రయత్నంలో ఉంది.

కాంగ్రెస్‌కు ప్రస్తుతం డబుల్ ఛాలెంజ్ ఎదురవుతోంది. ఒకవైపు ఎల్‌డీఎఫ్‌ను ఓడించాల్సిన అవసరం ఉండగా, మరోవైపు అసంతృప్త ఓటర్లు బీజేపీ వైపు చూడకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజల్లో మార్పు పట్ల ఆసక్తి ఉన్నా, అది కాంగ్రెస్‌ వైపు సమగ్రంగా మళ్లాలంటే బలమైన సంస్థాగత వ్యవస్థ, స్పష్టమైన నాయకత్వం, ఏకీకృత ప్రచారం అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

మొత్తంగా చూస్తే కేరళ రాజకీయ దృశ్యం అస్థిరంగా ఉంది. వామపక్ష నేతలు తమ ఓటు బ్యాంక్‌తో నిలకడగా ఉన్నారు. మరోవైపు బీజేపీ తన ప్రాతినిధ్యాన్ని పెంచుకుంటోంది. ప్రజాభిప్రాయంలో కాంగ్రెస్‌ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నా.. నిర్మాణాత్మక బలహీనతలు, ఓట్ల చీలిక, స్థానిక–రాష్ట్ర స్థాయి భావోద్వేగాల మధ్య వ్యత్యాసం లాంటి అంశాలు తుది ఫలితాలను అనిశ్చితిలోకి నెడుతున్నాయి. అందువల్ల సర్వేల్లో కనిపిస్తున్న కాంగ్రెస్‌కు అనుకూల వాతావరణం.. ఎన్నికల ఫలితాల్లో పూర్తిగా ప్రతిబింబిస్తుందా? లేదా అన్నది ఎన్నికల చివరి దశ వరకు స్పష్టతకు రాకపోవచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Read More
Next Story