రిపబ్లిక్ డే పరేడ్: ఏపీ శకటం ఎందుకు లేదు?
x
ఢిల్లీలో జరిగిన శకటాల ప్రదర్శన

రిపబ్లిక్ డే పరేడ్: ఏపీ శకటం ఎందుకు లేదు?

రొటేషన్ విధానం వెనుక అసలు నిజాలు ఏమిటీ


దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు భారతీయులందరికీ కన్నుల పండుగ. కర్తవ్య పథ్‌పై ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే, ఈ ఏడాది (2026) పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ శకటం కనిపించకపోవడంపై రాష్ట్ర ప్రజల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనికి గల ప్రధాన కారణాలివే..

కేంద్రం 'రొటేషన్ విధానం'

గతంలో కొన్ని రాష్ట్రాలకే పదేపదే అవకాశం దక్కడం, కొన్ని రాష్ట్రాలకు అసలు ప్రాతినిధ్యం ఉండకపోవడం వంటి అసమానతలు ఉండేవి. వీటిని సరిదిద్దేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ "3 ఏళ్ల రొటేషన్ ప్లాన్" అమల్లోకి తెచ్చింది.
దీని ప్రకారం, ప్రతి రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి మూడేళ్ల కాలంలో కనీసం ఒక్కసారైనా అవకాశం కల్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్ గడిచిన మూడేళ్లుగా (2023, 2024, 2025) వరుసగా ఢిల్లీ పరేడ్‌లో తన శకటాలను ప్రదర్శించింది. నిబంధనల ప్రకారం వరుసగా అవకాశాలు పొందిన రాష్ట్రాలకు, తర్వాతి రౌండ్‌లో విరామం ఇవ్వడం సహజం.

వరుస విజయాలు సాధించినా..

గత మూడేళ్లలో ఏపీ శకటాలు జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించాయి. 2023 మొదలు వరుసగా మూడేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ శకటాలు వరుస విజయాలు సాధించాయి. అవార్డులు పొందాయి.
2024: 'ఆధునిక విద్యా వ్యవస్థ' ఇతివృత్తంతో రూపొందించిన శకటం 'పీపుల్స్ ఛాయిస్' విభాగంలో అవార్డు గెలుచుకుంది.
2025: కోనసీమ వైభవం, 'ఏటికొప్పాక బొమ్మల' విశిష్టతను చాటిన శకటం జాతీయ స్థాయిలో మూడవ బహుమతి సాధించింది. అవార్డులు గెలుచుకున్నప్పటికీ, రక్షణ శాఖ ఒప్పందం ప్రకారం ఇతర రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ఏపీకి మినహాయింపు లభించింది.

భారత్ పర్వ్‌లో ప్రదర్శన

ఢిల్లీ ప్రధాన పరేడ్‌లో అవకాశం లేని రాష్ట్రాలు తమ శకటాలను ఎర్రకోట వద్ద నిర్వహించే 'భారత్ పర్వ్' కార్యక్రమంలో ప్రదర్శించే వెసులుబాటు ఉంటుంది. పర్యాటకులు రాష్ట్ర సంస్కృతిని, హస్తకళలను అక్కడ వీక్షించేలా ఏర్పాట్లు చేస్తారు.
అమరావతిలో వైభవంగా వేడుకలు
ఢిల్లీలో అవకాశం లేకపోయినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. నేలపాడు సమీపంలోని వేదిక వద్ద జరుగుతున్న ఈ పరేడ్‌లో 22 ప్రభుత్వ శాఖల శకటాలను ప్రదర్శిస్తున్నారు. 'స్వర్ణాంధ్ర-2047' విజన్, అమరావతి పునర్నిర్మాణం వంటి అంశాలతో వీటిని తీర్చిదిద్దారు.
ఆంధ్రప్రదేశ్ శకటం ఈ ఏడాది ఢిల్లీలో లేకపోవడం రాజకీయ కారణం కాదు. ఇది కేవలం కేంద్రం అమలు చేస్తున్న సాంకేతికపరమైన రొటేషన్ విధానం మాత్రమే. 2027 లేదా 2028లో ఏపీ తన నూతన థీమ్‌తో మళ్ళీ కర్తవ్య పథ్‌పై మెరిసే అవకాశం ఉంది.
Read More
Next Story