
టీటీడీ లడ్డూ అపవిత్రతకు బాధ్యలెవరు?
సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.
తిరుమల తిరుపతి దేవదేవుడి ప్రసాదంపై జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్యాలు ప్రచారం చేసి, భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపైన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బుధవారం మండలి మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన.. లడ్డూలో ఎలాంటి అపవిత్రత లేదని స్వయంగా సీబీఐ తేల్చిందని గుర్తుచేశారు. గతంలో లడ్డూ ప్రసాదాన్ని కళ్లకు అద్దుకుని తీసుకునేవారని, ఇప్పుడు భయం భయంగా పరిశీలించి తినే పరిస్థితికి తీసుకువచ్చిన సీఎం చంద్రబాబుదే ఈ మహాపాపమని ఆయన ఆరోపించారు.
ఇందాపూర్..హెరిటేజ్ చీకటి ఒప్పందం
హెరిటేజ్ సంస్థకు లాభం చేకూర్చడానికే ఇందాపూర్ డెయిరీని తెరపైకి తెచ్చారని బొత్స విమర్శించారు. రూ. 320కి వచ్చే నెయ్యి ధరను రూ. 700కి పెంచడం వెనుక భారీ దోపిడీ దాగి ఉందని మండిపడ్డారు. ఇందాపూర్‌తో లాలూచీ పడి దోచుకోవడమే హెరిటేజ్ లక్ష్యం. ఒకవేళ మేం చెప్పేది అబద్ధమైతే సభలో చర్చకు రావడానికి ఈ ప్రభుత్వానికి భయం ఎందుకు?"అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కుటుంబ ధనార్జన కోసం దేవస్థానాన్ని అడ్డుపెట్టుకోవడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు
డైవర్షన్ పాలిటిక్స్.. డొల్ల బడ్జెట్
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ వర్గాన్నీ ఆదుకునేలా లేదని బొత్స ఎద్దేవా చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక, ప్రజల దృష్టి మరల్చడానికే ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని విమర్శించారు. రైతులు గిట్టుబాటు ధరల కోసం, నిరుద్యోగులు ఉద్యోగాల కోసం, విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం మాత్రం తన నాయకుల సంపదను పెంచుకోవడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
చర్చకు రావాలని సవాల్
టీడీపి నాయకుల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని బొత్స ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌లకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే చర్చకు రావాలి. మేం ఆధారాలతో సహా నిరూపిస్తాం అని సవాల్ విసిరారు. హోంమంత్రి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని, లోకేష్ తెలిసీ తెలియక మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ దోపిడీని బీజేపీ నేతలు సమర్థిస్తారా? అని ప్రశ్నిస్తూ.. ఒక్క రోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు.

