
లిక్కర్ స్కాంలో ఏ1, ఏ2లు ఎవరు? వేల కోట్ల స్కామ్‌లో వీరి పాత్రేంటి?
ఈ కేసులో తాజా పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వేల కోట్ల రూపాయల ప్రజాధనం.. తెరవెనుక నడిచిన రహస్య లావాదేవీలు.. మద్యం మత్తులో మునిగిన అధికార యంత్రాంగం.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని ఒక్కసారిగా కుదిపేసిన రూ. 3,500 కోట్ల ’లిక్కర్ స్కామ్‘ మూలాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ బ్రహ్మాండమైన కుంభకోణానికి అడ్డగోలుగా అడుగులు వేసిన ఆ బిగ్ బాస్ లు ఎవరు? ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తూ, మద్యం సిండికేట్లను శాసించిన ఆ నిందితుడు నంబర్-1 (A1) , నంబర్-2 (A2)ల అసలు కథేంటి? ఒకప్పుడు వ్యవస్థను తన గుప్పిట్లో ఉంచుకున్న శక్తివంతమైన వ్యక్తులు ఇప్పుడు కటకటాల వెనుక ఎందుకు చిక్కుకోవాల్సి వచ్చింది? తాజా అరెస్టుల పరంపరతో రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కేసులో 'ఏ1, ఏ2'ల చేసిన నేరమేంటి, వారి పాత్ర ఏంటి అనేది తాజాగా మరో సారి హాట్ టాపిక్ గా మారింది.
స్క్రిప్ట్ తిరగరాసిన ఏ1 రాజ్ కశిరెడ్డి
ఈ వేల కోట్ల కుంభకోణానికి డైరెక్టర్, మాస్టర్ మైండ్ గా సిట్ (SIT) నిర్ధారించిన వ్యక్తి రాజ్ కాశీరెడ్డి (A1). గత ప్రభుత్వంలో ఐటీ సలహాదారు అనే ముసుగులో, మొత్తం మద్యం వ్యవస్థనే తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారనేది ప్రధాన ఆరోపణ. ప్రపంచమంతా డిజిటల్ విప్లవం వైపు వెళ్తుంటే, ఈయన మాత్రం అత్యంత వ్యూహాత్మకంగా మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులను నిలిపివేయించి.. నగదు (Cash) సామ్రాజ్యాన్ని సృష్టించారు. ఆన్‌లైన్ లెక్కలు లేకుండా చేసి, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని రహస్య మార్గాల్లో మళ్లించడంలో ఈయన ఓ షాడో నెట్‌వర్క్ ను నడిపినట్లు దర్యాప్తులో తేలినట్లు సిట్ వెల్లడించింది. అందుకే ఈ వ్యూహకర్త కు న్యాయస్థానాల్లో బెయిల్ దొరకడం గగనమైందనే చర్చ అటు కూటమి వర్గాలు, ఇటు పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది.
అమలు చేసిన ఏ2 వాసుదేవరెడ్డి
రాజ్ కాశీరెడ్డి గీసిన చీకటి స్కెచ్‌ను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వాసుదేవరెడ్డి (A2). ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంటూ, నిబంధనలను కాలరాసి తనకు నచ్చిన కంపెనీల బ్రాండ్లకు రెడ్ కార్పెట్ పరిచారనే ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. సామాన్య ప్రజలకు నాణ్యమైన బ్రాండ్లు దొరక్కుండా చేసి, కమిషన్లు ఇచ్చే కంపెనీలకే కొమ్ముకాశారన్నది సిట్ అభియోగం. ఇక విదేశీ పర్యటనల పేరుతో నిధులు మళ్లించారనే ఆరోపణల వైనం ఈయన చిక్కులను మరింత పెంచింది. ఫిబ్రవరి 21న జరిగిన ఈయన అరెస్టుతో.. తెర వెనుక ఉన్న అసలు రాజకీయ నాయకుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి.
నిందితుల జాబితాలో హేమాహేమీలు
ఈ కుంభకోణం కేవలం ఏ1, ఏ2లతోనే ముగిసిపోలేదు. నిందితుల జాబితా ఒక పవర్‌ఫుల్ సిండికేట్‌ను తలపిస్తోంది. ఇందులో 1993 బ్యాచ్‌కు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ధనంజయ్ రెడ్డి, గత ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి వంటి బ్యూరోక్రాట్‌ల పేర్లు ఉండటం షాకింగ్ కలిగిస్తోంది. వీరితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ చక్రబంధంలో చిక్కుకున్నారు. మొత్తం 51 మంది నిందితులు ఉన్న ఈ కేసులో.. కొందరు బెయిల్ ద్వారా తాత్కాలికంగా బయటపడినా, సిట్ సేకరించిన కీలక ఆధారాలతో మున్ముందు ఈ ఉచ్చు మరింతగా బిగుస్తుందని స్పష్టమవుతోందనే చర్చ వినిపిస్తోంది.
ఏ2 వాసుదేవరెడ్డి అరెస్ట్‌తో మారిన సమీకరణాలు
మరో వైపు ఈ కేసులో తాజా పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ (APSBCL) మాజీ ఎండీ, కేసులో రెండో నిందితుడు (A2) అయిన వాసుదేవరెడ్డిని ఫిబ్రవరి 21న పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడలోని ఏసీబీ కోర్టు ఆయనకు ఈ నెల 27 వరకు రిమాండ్ విధించడంతో, ఈ స్కామ్‌లోని మరిన్ని లోతైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గతంలోనే కాశీరెడ్డి రాజశేఖర్ రెడ్డి (A1), మాజీ ఐఏఎస్ ధనంజయ్ రెడ్డి వంటి కీలక వ్యక్తుల అరెస్టులతో ఈ కేసు ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.
బెయిల్ పొందిన వారు వీరే..
మరోవైపు, ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురు ప్రముఖులకు న్యాయస్థానాల్లో ఊరట లభించింది. వైఎస్సార్‌సీపీ హయాంలో చక్రం తిప్పిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డిలకు జనవరి 30న హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వీరితో పాటు ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి వంటి వారు ఇప్పటికే బెయిల్ పై బయట ఉన్నారు. అయితే, ప్రధాన నిందితుడు రాజ్ కాశీరెడ్డికి మాత్రం కోర్టులో చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
సవాలుగా మారిన ముందస్తు బెయిల్
రూ. 3,500 కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అయిందన్న ఆరోపణలు ఉండటంతో, దర్యాప్తు సంస్థలు ముందస్తు బెయిల్ పిటిషన్లపై తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్లనే మరో నిందితుడు ముప్పిడి అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ దరఖాస్తును హైకోర్టు తిరస్కరించింది. నిందితుల జాబితాలో మాజీ ఎంపీలు, మాజీ ప్రభుత్వ సలహాదారులు ఉండటంతో, ఈ కేసు దర్యాప్తు ఎటువైపు దారి తీస్తుందోనన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకుంది.
Next Story

