
అంబటి జైలు ప్రయాణం వెనుక అసలేం జరుగుతోంది?
వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ రాజకీయ చక్రబంధం రోజురోజుకూ బిగుస్తోంది. ఒక కేసులో ఊరట లభించే సమయానికే మరో పాత కేసు తెరపైకి రావడం, బెయిల్ వచ్చిన కొద్ది గంటల్లోనే పీటీ వారెంట్లు (PT Warrants) సిద్ధంగా ఉండటం ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అంబటి జైలు నుండి బయటకు రాకుండా కూటమి ప్రభుత్వం అడుగుడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తుండగా, ఆయన జైలు ప్రయాణం ఇప్పుడు రిమాండ్లు, బెయిళ్ల మధ్య దోబూచులాడుతోంది.
బెయిల్ వస్తే.. వారెంట్ రెడీ
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన ధర్నాలో అధికారులను బెదిరించారంటూ అంబటిపై గతంలో నమోదైన కేసులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు ఎక్సైజ్ కోర్టు ఆయనకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేసింది. షూరిటీలు సమర్పించి, గురువారం ఆయన రాజమండ్రి జైలు నుంచి విడుదలవుతారని అంతా భావించారు. కానీ, సరిగ్గా విడుదల సమయానికి సత్తెనపల్లి సంక్రాంతి సంబరాల పాత కేసులో పీటీ వారెంట్ జారీ కావడంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయింది. ఫలితంగా ఆయన విడుదల ఆగిపోవడమే కాకుండా, కోర్టు మరో 14 రోజుల రిమాండ్ విధించింది.
సంక్రాంతి లక్కీ డ్రా.. అంబటికి తిప్పలు
2023లో మంత్రి హోదాలో అంబటి రాంబాబు సత్తెనపల్లిలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలే ఇప్పుడు ఆయనకు ప్రధాన సంకటంగా మారాయి. వాలంటీర్ల ద్వారా పింఛనుదారుల సొమ్ము నుండి రూ. 200 మినహాయించి లాటరీ టికెట్లు పంచారనే ఆరోపణలపై జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు పెట్టిన ఫిర్యాదుతో అప్పట్లో ఈ కేసు నమోదైంది. ఈ కేసులో తాజాగా విచారణ జరిపిన గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు న్యాయమూర్తి, అంబటికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పోలీసులు పీటీ వారెంట్‌పై ఆయనను గుంటూరు కోర్టులో హాజరుపరిచి, అనంతరం తిరిగి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు.
కుట్రలు - కక్ష సాధింపు ఆరోపణలు
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే అంబటిని లక్ష్యంగా చేసుకుని బాబు సర్కార్ కుట్రలు పన్నుతోందని వైసీపీ మండిపడుతోంది. అంబటి ఇల్లు, కార్యాలయంపై పెట్రోలు బాంబులతో దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, బాధితుడైన అంబటినే జైల్లో బంధించడం దారుణమని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఒక కేసులో బెయిల్ రాగానే పాత పెట్టీ కేసులను తిరగతోడటం పూర్తిగా రాజకీయ కక్ష సాధింపేనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయపోరాటం సిద్ధం
వరుస రిమాండ్ల నేపథ్యంలో అంబటి రాంబాబు తరపు న్యాయవాదులు న్యాయపోరాటాన్ని ముమ్మరం చేశారు. సత్తెనపల్లి కేసులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయడంతో పాటు, మాజీ మంత్రి హోదాలో జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టును కోరారు. అంబటిపై ఉన్నవి పెట్టీ కేసులని, వీటిని కావాలనే రాజకీయ కారణాలతో పెద్దవిగా చూపిస్తూ ఆయన గళం విప్పకుండా చేస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

