మమత నుంచి రాహుల్‌ సహా ప్రతిపక్ష నేతలు ఏం నేర్చుకోవచ్చు?
x

మమత నుంచి రాహుల్‌ సహా ప్రతిపక్ష నేతలు ఏం నేర్చుకోవచ్చు?

పశ్చిమ బెంగాల్‌లో S.I.Rపై సుప్రీంను ఆశ్రయించి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..


Click the Play button to hear this message in audio format

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి తన ప్రత్యేక వ్యూహాలతో చర్చనీయాంశంగా మారారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సవాలు చేస్తూ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఇతర ప్రతిపక్ష నేతలకు విభిన్నంగా భిన్నమైన రాజకీయ శైలిని కనపర్చారు. ఇది కేవలం చట్టపర పోరాటం మాత్రమే కాకుండా, రాజకీయంగా కూడా ఒక స్పష్టమైన సంకేతంగా నిలిచింది. తాను సమస్యలను గుర్తించడంతో పాటు వాటిపై తక్షణం స్పందించే నాయకురాలిగా జనం దృష్టిలో పడ్డారు.


రాజకీయ అజెండాగా మార్చడమే మమత ప్రత్యేకత..

మమతా బెనర్జీ రాజకీయ శైలి సాధారణ విమర్శలకే పరిమితం కాదు. ఒక సమస్యను గుర్తించిన వెంటనే దాన్ని రాజకీయ అజెండాగా మలచడం ఆమె ప్రత్యేకత. ఎస్‌ఐఆర్ విషయంలో కూడా అదే జరిగింది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ.. ఈ ప్రక్రియను రాష్ట్రం–కేంద్రం మధ్య పోరాటంగా చిత్రీకరించారు. ఇది సాధారణ ఎన్నికల వ్యూహం కంటే ఒక భావోద్వేగాత్మక అంశంగా మారింది. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యపు మూల హక్కు కావడంతో.. ఆమె ఈ అంశాన్ని ప్రజల మనసుల్లో బలంగా నాటగలిగారు.


ప్రజల దృష్టిలో మమత..

సుప్రీంకోర్టులో స్వయంగా హాజరై వాదనలు వినిపించడం ద్వారా మమతా బెనర్జీ ఒక శక్తివంతమైన సందేశాన్ని పంపించారు- తాను కేవలం రాజకీయ నాయకురాలు మాత్రమే కాకుండా, ప్రజా హక్కుల కోసం న్యాయపర పోరాటానికి సిద్ధమని. చట్టపరంగా ఈ చర్య పెద్ద విజయాన్ని తీసుకురాకపోయినా, ప్రజల దృష్టిలో ఆమె పోరాట స్ఫూర్తి బలపడింది. సాధారణ ఓటరికి “నా ఓటు హక్కు కోసం మమతా పోరాడుతున్నారు” అనే భావన కలిగించడం ద్వారా జనం నుంచి సైకాలజికల్ అడ్వాంటేజ్ పొందారు.


మమత-ప్రజా నాయకురాలు..

సింగూర్, నందిగ్రామ్ ఉద్యమాల నుంచి ప్రారంభమైన ఆమె రాజకీయ ప్రయాణం కేవలం ఎన్నికల విజయాలకే పరిమితం కాలేదు. భూసేకరణకు వ్యతిరేకంగా సాగిన పోరాటం ఆమెను ప్రజా నాయకురాలిగా నిలబెట్టింది. 2011లో వామపక్షాల 34 ఏళ్ల పాలనను ముగించడమే కాకుండా, 2016, 2021లో కూడా ఘన విజయాలను సాధించడం నాయకత్వ స్థిరత్వాన్ని ప్రతిబింబించారు. ఇది ఒక నాయకురాలిగా ఆమెకు విశ్వసనీయతను తెచ్చిపెట్టింది. దీంతో ప్రజలు ఆమెను కేవలం ప్రత్యామ్నాయంగా కాకుండా, స్థిరమైన శక్తిగా చూడటం ప్రారంభించారు.


ప్రజా జీవితాలతో అనుసంధానించడంలో రాహుల్ విఫలం..

రాహుల్ గాంధీ కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నప్పటికీ, సమస్యలను ప్రజా ఉద్యమాలుగా మార్చడంలో స్పష్టమైన లోపం కనిపిస్తుంది. బీహార్‌లో ఎస్‌ఐఆర్ ప్రారంభమైనప్పుడు ఆయన యాత్రలు చేపట్టినప్పటికీ, అవి ఎన్నికల ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. విమర్శలు చేయడం ఒక స్థాయి వరకు ఉపయోగకరమే కానీ, సమస్యను ప్రజల జీవితాలతో అనుసంధానం చేసి దాన్ని ఓటింగ్ ప్రవర్తనగా మార్చడంలో ఆయనకు సవాళ్లు ఎదురవుతున్నాయి.


అదే మమత స్పెషల్..

2026లో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వస్తామనే నమ్మకం ఉన్నా.. మమతా బెనర్జీ ఆత్మసంతృప్తికి లోనుకాకుండా బూత్ స్థాయి పర్యవేక్షణను కొనసాగిస్తున్నారు. బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశాలు నిర్వహించడం, ఓటర్ల జాబితా వ్యత్యాసాలపై నిఘా ఉంచడం లాంటి చర్యలు..ఆమె ఎన్నికల నిర్వహణలో సూక్ష్మ స్థాయిలో దృష్టి పెట్టుతున్నారని సూచిస్తున్నాయి. ఇది ఇతర ప్రతిపక్ష నాయకులకు ఒక ముఖ్యమైన పాఠం. ఎన్నికలు కేవలం భారీ సభలతో గెలవలేము. సూక్ష్మ స్థాయి యంత్రాంగం కూడా అంతే ముఖ్యమని సూచిస్తుంది.


ఆ విషయంలో ప్రతిపక్షాలు విఫలం..

బీహార్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రజా అసంతృప్తి ఉన్నా ప్రతిపక్షాలు దాన్ని ఓట్లుగా మార్చడంలో విఫలమయ్యాయి. ఓటర్ల జాబితా అంశాలు, చట్టపరమైన పోరాటాలు జరిగినప్పటికీ రాజకీయ లాభం దక్కలేదు. దీనికి ప్రధాన కారణం—స్పష్టమైన కథనం లేకపోవడం. ప్రజలకు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడంలో ప్రతిపక్షాలు వెనుకబడ్డాయి.


ప్రాంతీయత vs జాతీయత..

మమతా బెనర్జీ బలమైన ప్రాంతీయ నాయకురాలిగా నిలిచారు. ఆమె బెంగాల్ ఉపజాతీయ భావజాలాన్ని ప్రతిబింబిస్తూ ప్రజలతో భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. రాహుల్ గాంధీ లేదా అరవింద్ కేజ్రీవాల్ వంటి నాయకులు జాతీయ ఇమేజ్‌పై దృష్టి పెట్టినప్పటికీ, ప్రాంతీయ స్థాయిలో ఆ బలం అంతగా కనిపించదు. ప్రాంతీయ నాయకత్వం ఎంత బలంగా ఉంటే ఎన్నికల ఫలితాలపై అంత ప్రభావం ఉంటుందని అనడానికి మమత ఒక ఉదాహరణ.


రాజకీయ పాఠాలు

  • మమతా బెనర్జీ నుంచి ఇతర ప్రతిపక్ష నాయకులు నేర్చుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు..
  • సమస్యలను తక్షణమే గుర్తించి ప్రజా అజెండాగా మలచడం
  • చట్టపర వేదికలను రాజకీయ ఆయుధాలుగా వినియోగించడం
  • బూత్ స్థాయి యంత్రాంగాన్ని బలోపేతం చేయడం
  • ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకొని వాటితో అనుసంధానించడం
  • ఆత్మసంతృప్తికి లోనుకాకుండా నిరంతర పర్యవేక్షణ కొనసాగించడం
  • ప్రాంతీయ భావజాలాన్ని సానుకూలంగా వినియోగించడం

మొత్తంగా చూస్తే, మమతా బెనర్జీ రాజకీయ శైలి ఒక మిశ్రమ మోడల్—చట్టపరమైన పోరాటం, భావోద్వేగ రాజకీయాలు, సూక్ష్మ స్థాయి ఎన్నికల నిర్వహణ, ప్రాంతీయ బలం. ఇదే కారణంగా ఆమె ఇతర ప్రతిపక్ష నాయకుల కంటే భిన్నంగా నిలుస్తున్నారు.

Read More
Next Story