
జగన్ భద్రతకు ఏమైంది?
కేంద్ర హోం శాఖకు వైఎస్సార్‌సీపీ ఎందుకు ఫిర్యాదు చేశారు. ఆ 47 కిలోమీటర్ల రూట్ మార్పు వెనుక మతలబు ఏంటి?
జెడ్ ప్లస్ (Z+) కేటగిరీ భద్రత ఉన్నా.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందా? రాష్ట్ర ప్రభుత్వం కావాలనే భద్రతా ప్రొటోకాల్స్‌ను నీరుగారుస్తోందా? అంటే అవుననే అంటోంది వైఎస్సార్‌సీపీ. ఇటీవల జగన్ పర్యటనల్లో తలెత్తిన తీవ్ర భద్రతా లోపాలు, అకస్మాత్తుగా మారుతున్న రూట్ మ్యాప్‌లు, రద్దీ మార్గాల్లోకి కాన్వాయ్‌ను మళ్లించడం వెనుక ఉన్న నిర్లక్ష్యంపై తక్షణమే స్వతంత్ర విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు ఎమ్మెల్సీ తలశిల రఘురాం కీలక లేఖ రాశారు. కేవలం 22 కిలోమీటర్ల ప్రయాణాన్ని అకస్మాత్తుగా 47 కిలోమీటర్లకు పెంచి, కనీస సమాచారం లేకుండా వీవీఐపీని ప్రమాదంలోకి నెట్టడం వెనుక అధికారుల వైఫల్యం ఉందా లేక రాజకీయ కుట్ర ఉందా అన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఆ 47 కిలోమీటర్ల రూట్ మార్పు ఎందుకు?
ఇటీవల ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వెళ్లిన సందర్భంలో జరిగిన పరిణామాలను లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. సాధారణంగా 22 కిలోమీటర్ల దూరం ఉండాల్సిన మార్గాన్ని కాదని, విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా 47 కిలోమీటర్ల సుదీర్ఘ మార్గానికి రూట్ మ్యాప్ మార్చడంపై తలశిల ప్రశ్నలు సంధించారు. తిరుగు ప్రయాణంలో అత్యంత రద్దీగా ఉండే మార్గంలోకి కాన్వాయ్‌ను మళ్లించడం జెడ్ ప్లస్ ప్రొటోకాల్‌కు విరుద్ధమని, ఇది వీవీఐపీ ప్రాణాలకు ప్రమాదకరం కాదా? అని ఆయన నిలదీశారు.
మాయమైన హెలికాప్టర్ విండ్‌షీల్డ్.. పాత గాయాల ప్రస్తావన
కేవలం ఈ ఒక్క ఘటన మాత్రమే కాకుండా గత ఏడాది జరిగిన లోపాలను కూడా లేఖలో గుర్తు చేశారు. 2025 ఫిబ్రవరిలో గుంటూరు మిర్చి యార్డ్‌లో భద్రతా వైఫల్యం, ఏప్రిల్‌లో రామగిరి పర్యటనలో హెలిప్యాడ్ వద్ద జరిగిన దాడిలో హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతిన్న ఘటనలను వివరించారు. ఈ ప్రమాదకర పరిస్థితుల్లో అధికారుల వైఫల్యాన్ని ఒప్పుకోవాల్సింది పోయి, రివర్స్‌లో పార్టీ నేతలపైనే తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని తలశిల రఘురాం మండిపడ్డారు.
కేంద్రం జోక్యం చేసుకోవాలి.. స్వతంత్ర సమీక్షే పరిష్కారం
పోలీసులు రాజకీయాలకతీతంగా పనిచేయాలని, భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. కేవలం ఒక వ్యక్తి భద్రతే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న వీఐపీ భద్రతా వ్యవస్థల విశ్వసనీయత కాపాడాలని కోరారు. జగన్ భద్రతపై తక్షణమే విచారణ చేపట్టి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా స్వతంత్ర సమీక్ష జరపాలని, కేంద్ర హోం శాఖ వెంటనే జోక్యం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది.

