హెరిటేజ్‌కు ఏం సంబంధం? అసెంబ్లీలో బాబు నిలదీత
x

హెరిటేజ్‌కు ఏం సంబంధం? అసెంబ్లీలో బాబు నిలదీత

బ్రాండ్‌ను దెబ్బతీసేందుకే వైసీపీ కుట్ర పన్నుతోందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు.


తిరుమల లడ్డూ కల్తీకి.. హెరిటేజ్ సంస్థకు అసలు సంబంధం ఏంటి? ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక్క పైసా కూడా అడగలేదు, తీసుకోలేదు. కేవలం బ్రాండ్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనే కుట్రతోనే వైసీపీ నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్‌లైన్లు పెట్టి దుష్ప్రచారం చేయడం ద్వారా హెరిటేజ్‌కు నష్టం కలిగించాలనేది వారి వ్యూహమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వేదికగా హెరిటేజ్ అంశంపై ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దేవుడి విషయంలో పొరపాటు జరగనివ్వను

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం అత్యంత సున్నితమైన సమస్య అని, దీనిపై రాజకీయం చేయడం సరికాదని చంద్రబాబు స్పష్టం చేశారు. వేంకటేశ్వరస్వామి విషయంలో తెలిసి కానీ, తెలియక కానీ నేను తప్పు చేయను. నిద్ర రానప్పుడు కూడా ఆ స్వామిని తలచుకుంటే ప్రశాంతత లభిస్తుంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించడం తగదు. అందుకే రాష్ట్రంలోని అన్ని ఆలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించాం అని ఆయన పేర్కొన్నారు.

రాజకీయాల ముసుగులో నేరాలా

రాజకీయాల ముసుగులో నేతలే నేరాలు చేస్తే ఎలా అని సీఎం నిలదీశారు. వైసీపీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ నేత రోడ్డుపైకి వస్తున్నాడంటే ఏం జరుగుతుందోననే భయం ప్రజల్లో నెలకొంటోంది. ఎక్కడికి వెళ్లినా దౌర్జన్యాలు చేయడం, రోడ్లను బ్లాక్ చేయడం వంటివి చేస్తున్నారు. ప్రజల భద్రత కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? అని ప్రశ్నించారు.

జాతీయ రహదారులపై నరకం చూపించాలా?

వైసీపీ తీరు వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. గుంటూరు నుంచి విజయవాడ వెళ్లడానికి ఆరు గంటల సమయం పడితే, ఆ ప్రయాణికులు ఎంత నరకం అనుభవించాలి? జాతీయ రహదారులపై సమావేశాలు పెట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదు. చట్టాలను అతిక్రమించి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏ రకమైన రాజకీయం? అని ఆయన నిలదీశారు.

Read More
Next Story