నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ ఏమన్నారంటే
x

నియోజకవర్గాల పునర్విభజనపై జగన్ ఏమన్నారంటే

రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.


వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతూ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాబోయే రాజకీయ పరిణామాలు, నియోజకవర్గాల పునర్విభజన, ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై జగన్ సుదీర్ఘంగా ధ్వజమెత్తారు.

నియోజకవర్గాల పునర్విభజన: కొత్త నాయకత్వానికి వేదిక
దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నియోజకవర్గాల పునర్విభజన అంశంపై జగన్ స్పందిస్తూ.. ఇది పార్టీ కార్యకర్తలకు ఒక గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు రాబోతున్నాయని, తమ పాలనలో ఇప్పటికే పదవుల్లో, కాంట్రాక్టుల్లో మహిళలకు పెద్దపీట వేశామని గుర్తుచేశారు. సీట్లు పెరగడం వల్ల కష్టపడే కార్యకర్తలు నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుందని, జగన్ 2.0లో పార్టీ కోసం పటిమ చూపించే వారికే ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు.
చంద్రబాబుపై క్రెడిట్ దోపిడీ విమర్శలు
ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మరియు గూగుల్ పెట్టుబడుల వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 'క్రెడిట్ దోపిడీ' చేస్తున్నారని జగన్ ఆరోపించారు. 2022లోనే దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ నాతో భేటీ అయ్యారు. మా హయాంలోనే రూ.4,800 కోట్లు గ్రీన్‌కోలో పెట్టుబడులు పెట్టారు. కాకినాడ, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపించింది మేమే. ఇప్పుడు తనను చూసి స్టీల్ ప్లాంట్ వచ్చినట్లు బాబు బిల్డప్ ఇస్తున్నారు అని విమర్శించారు. తమ హయాంలో ప్రారంభించిన 3 ప్రభుత్వ రంగ పోర్టుల పనులు రెండేళ్లు గడిచినా ముందుకు సాగడం లేదని, బల్క్ డ్రగ్ పార్క్‌ను కూడా సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు.
ధరల మోతపై ఆగ్రహం: మళ్లీ కిరోసిన్ స్టౌవ్‌లు కొనాలా?
రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధం పేరు చెప్పి వంటనూనె ధర లీటరుకు రూ.40, పప్పుల ధర కిలోకు రూ.15 వరకు పెంచేశారని మండిపడ్డారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో రూ.2 వేల నుంచి రూ.3 వేలకు అమ్ముతున్నారని, ఇప్పుడు కొత్తగా కిరోసిన్ ఇస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, ఇప్పుడు మళ్లీ ప్రజలు కిరోసిన్ స్టౌవ్‌లు కొనుక్కోవాలా? అని ప్రశ్నించారు.
Read More
Next Story