అల్లుడు లోకేష్ చెవిలో మామ బాలకృష్ణ చెప్పిన మాటేమిటీ?
x
బాలకృష్ణ, లోకేష్

అల్లుడు లోకేష్ చెవిలో మామ బాలకృష్ణ చెప్పిన మాటేమిటీ?

అసెంబ్లీలో చర్చ సందర్భంగా మామా అల్లుళ్ల ముచ్చట


రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే.. తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. చర్చ మొదలైంది. స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. మంత్రి నారాయణ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. ఈ దశలో సభలో జరిగిన సంఘటన గ్యాలరీలోని మీడియా ప్రతినిధులను ఆకర్షించింది.

మంత్రి నారా లోకేష్ కూర్చున్న సీటు వద్దకు హడావిడిగా వచ్చిన హిందూపురం టీడీపీ శాసనసభ్యుడు, లోకేష్ కు పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ హడావిడిగా వచ్చి పక్కన కూర్చున్నారు. సభలో చర్చ జరుగుతున్న వ్యవహారమై ఆయనతో సుమారు 3 నిమిషాల సేపు చాలా సీరియస్ గా మాట్లాడినట్టు కనిపించింది.
బహుశా ఆయన అమరావతి, శాతవాహన రాజుల చరిత్ర గురించి వివరించినట్టు తెలిసింది. లోకేష్ చేసే ప్రసంగంలో ప్రస్తావించాల్సిన అంశాలను వివరించినట్టు సమాచారం. అంతకుముందు నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బహుశా రాజధాని విషయమే వాళ్లిద్దరూ చర్చించి ఉంటారనే లాబీలలోకి వచ్చిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం గమనార్హం.
అంతకుముందు మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అమరావతి రాజధాని బిల్లు నేడు ఢిల్లీకి చేరుకుంటుంది. ఏప్రిల్ 1వ తేదీన కేంద్ర మంత్రివర్గం ఈ బిల్లుపై చర్చించి, ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 2వ తేదీన ఈ కీలక బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, వారు ప్రజల గొంతుకను వినిపించడంలో విఫలమవుతున్నారు. అసెంబ్లీలోనే బిల్లును ఎదుర్కోవాల్సిన బాధ్యత వైపీసీపై ఉంది. కానీ వారు సభకు రాకపోవడం చూస్తుంటే అమరావతిపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతోంది. పార్లమెంట్‌లో ఈ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు వైసీపీ ఎంపీలు ఏం చేస్తారో చూడాలి. ‘బ్లూ బుక్’ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికీ ప్రోటోకాల్ ఇవ్వాల్సిందే. గత ప్రభుత్వంలో చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు మర్చిపోలేదు. సినిమా చూపిస్తా.. అన్న జగన్ సినిమా ఎలా ఆడిందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. వైసీపీ‌కి ఉన్న 11 సంఖ్యను దృష్టిలో ఉంచుకొని సరిగ్గా ఉదయం 11 గంటలకు ముహూర్తం చూసి మరీ అసెంబ్లీలో రాజధానిపై తీర్మానాన్ని ప్రవేశపెట్టాం’ అని లోకేశ్ అన్నారు.
ఇది చారిత్రక తీర్మాణం.. మంత్రి నారాయణ భావోద్వేగం..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ తర్వాత రాష్ట్రానికి ఎదురైన అతిపెద్ద సవాలు రాజధాని నిర్మాణం. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి పాలకులు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారంటూ మంత్రి నారాయణ మండిపడ్డారు. రాజధాని అంశంపై అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. విభజన నాటి ఛేదు జ్ఞాపకాలను, అమరావతి ఎంపిక వెనుక ఉన్న శాస్ట్రీయ కారణాలను విశ్లేషించారు.

‘రాష్ట్రాన్ని విడగొట్టినప్పుడు ఏపీకి కనీసం ఒక రాజధాని నగరం లేకుండా చేశారు. విభజన చట్టం ప్రకారం పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కేటాయించినప్పటికీ, సొంత గడ్డపై పరిపాలన సాగించాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నాం. అప్పట్లో రాజధాని ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి ప్రజలు అభిప్రాయాలు సేకరించింది. కమిటీ సేకరించిన అభిప్రాయాలలో మెజారిటీ ప్రజలు విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని ఉండాలని కోరుకున్నారు. రాష్ట్రానికి మధ్యలో ఉండటం, పోర్టులకు, జాతీయ రహదారికి దగ్గరగా ఉండేలా చూశాం. రాజధానికి సరిపడా భూమి లేకపోవటంతో భూ సమీకరణకు వెళ్లాం. కానీ, ప్రతిపక్ష నేతలు ఇక్కడ రాజధాని వద్దని ప్రజల్ని రెచ్చగొట్టారు. భూకంపాలు, ముంపు, భూమి పనికిరాని తప్పుడు ప్రచారాలు చేశారు. కొంతమంది రైతుల పొలాలు తగులబెట్టి భయపెట్టారు. అన్ని వర్గాల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ ప్రాంతాన్ని ఖరారు చేశాం’ అని అన్నారు.
‘‘గత పాలకులు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. విడిపోయాక రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది. 2015 జనవరి 1న ల్యాండ్‌ పూలింగ్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చాం. ఫిబ్రవరి నాటికి 34,400 ఎకరాలను 29 వేల మంది రైతులు ఇచ్చారు. వైకాపా నాయకులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా రైతులు ఎక్కడా తలొగ్గలేదు’’ అని మంత్రి నారాయణ అన్నారు.
Read More
Next Story