
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు బీజేపీ భారీ వ్యూహం..
సంస్థాగత బలోపేతానికి రంగంలోకి ఇతర రాష్ట్రాల నుంచి పార్టీ కార్యకర్తలు
రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సంస్థాగత బలాన్ని పెంచేందుకు ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలో బలమైన కేడర్ ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను ఎదుర్కొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కార్యకర్తలను తీసుకువచ్చి, అవసరమైన చోట ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది.
మాల్డా ఘటనతో వెలుగులోకి..
ఇటీవల మాల్డా జిల్లాలో రాత్రివేళ బీజేపీ పోస్టర్లు అంటిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. వారు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్యకర్తలని తెలిసింది. ఈ ఘటనతో బీజేపీ, రాష్ట్రం వెలుపల నుంచి “ఎన్నికల సహాయకులు”ను (చునావో సహయోగి) తెప్పిస్తుందన్న విషయం బయటపడింది. ఇప్పటివరకు సుమారు 3,500 మందిని బయటి రాష్ట్రాల నుంచి పశ్చిమ బెంగాల్‌కు రప్పించి పోస్టర్లు అంటించడం మొదలు బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం చేసే పనులను అప్పగించారని తెలుస్తోంది. అవసరాన్ని బట్టి ఈ సంఖ్యను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం.
బయటి నుంచి వచ్చిన కార్యకర్తలు స్థానిక యూనిట్లతో కలిసి పనిచేస్తూ ప్రచార నిర్వహణ, ఓటర్ల అభిప్రాయ సేకరణ, బూత్ కమిటీల బలోపేతం వంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీ ఉనికి బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఉత్తర బెంగాల్ నుంచి దక్షిణ జిల్లాల వరకు వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. పార్టీ వర్గాలు వీరిని స్థానిక కార్యకర్తలకు ప్రత్యామ్నాయంగా కాకుండా “సంస్థాగత సహాయకులు”గా అభివర్ణిస్తున్నాయి.
సంస్థాగత లోటుపై అంతర్గత సమీక్ష..
2021 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ తన బలహీనతలపై సమగ్ర అంతర్గత సమీక్ష నిర్వహించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓటు వాటా పెరిగినా.. అర్బన్–సెమీ అర్బన్ ప్రాంతాల్లో వెనుకబడినట్టు తేలిందని అంటున్నారు. సభ్యత్వ నమోదు లక్ష్యాలను చేరుకోలేకపోవడం, బూత్ స్థాయి కార్యకర్తల కొరత పార్టీని ఆందోళనకు గురి చేశాయి. దీంతో డిజిటల్ ఆడిట్‌లు నిర్వహించి నిజమైన కార్యకర్తలను గుర్తించే చర్యలు చేపట్టింది.
“బాటమ్–అప్” విధానం..
సంస్థాగత లోటును తగ్గించేందుకు బీజేపీ ఇతర రాష్ట్రాల నుంచి అనుభవజ్ఞులైన నిర్వాహకులను కీలక జిల్లాలకు ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. హౌరా, హుగ్లీ, మాల్డా వంటి రాజకీయంగా సున్నితమైన ప్రాంతాల్లో వీరికి బాధ్యతలు అప్పగించారు. బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణ, బలహీన వర్గాల గుర్తింపు, డేటా ఆధారిత వ్యూహాల రూపకల్పన వీరు చేయాల్సిన పనులు. అభ్యర్థుల ఎంపికలో కూడా స్థానిక మండల, జిల్లా స్థాయి కార్యకర్తల అభిప్రాయాలను సేకరించే “బాటమ్–అప్” విధానాన్ని పార్టీ అమలు చేస్తోంది.
ప్రజల సూచనలతో మేనిఫెస్టో..
ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల భాగస్వామ్యంతో రూపొందించేందుకు బీజేపీ “సంకల్ప్ పాత్ర” పేరుతో రాష్ట్రవ్యాప్త డ్రైవ్ ప్రారంభించింది. జిల్లాల వారీగా వందలాది డ్రాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసి, QR కోడ్‌లు, ఇమెయిల్‌లు, టోల్–ఫ్రీ నంబర్ల ద్వారా ప్రజల సూచనలు సేకరిస్తోంది. ఈ ప్రక్రియ ద్వారా స్థానిక అవసరాలు, సమస్యలు మేనిఫెస్టోలో ప్రతిఫలించాలని పార్టీ భావిస్తోంది.
విస్తృత ప్రచార ప్రణాళిక..
సంస్థాగత బలపరిచే చర్యలతో పాటు బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,300 చిన్న–మధ్య తరహా ర్యాలీలు, సమావేశాలు, ప్రజా సంభాషణలను నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించింది. అట్టడుగు స్థాయి సమీకరణ, ఇంటింటి ప్రచారంపై దృష్టి సారించడం వంటి అంశాలపై సమన్వయం చేస్తూ టీఎంసీ బలమైన కేడర్ వ్యవస్థను ఎదుర్కొనేందుకు పార్టీ సిద్ధమవుతోంది.
మొత్తంగా, పశ్చిమ బెంగాల్‌లో అట్టడుగు స్థాయి బలాన్ని పెంచుకుని టీఎంసీకి సవాల్ విసరాలన్న లక్ష్యంతో బీజేపీ బయట వ్యక్తులను రప్పిస్తోంది. 2026 ఎన్నికలకు ముందే సంస్థాగతంగా బలమైన నెట్‌వర్క్‌ను నిర్మించడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోంది.

