పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ది ఒంటరిపోరే..
x

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ది ఒంటరిపోరే..

20 ఏళ్ల తర్వాత పొత్తు లేకుండా ఎన్నికల బరిలోకి..


Click the Play button to hear this message in audio format

కాంగ్రెస్(Congress) అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో జరిగే పశ్చిమ బెంగాల్(West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ నిర్ణయించింది. గత కొన్నేళ్లుగా వివిధ పార్టీలతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్..ఈసారి మాత్రం ఒంటరి పోరుకు సిద్ధమైంది.


చాలా ఏళ్ల తర్వాత ఒంటరిగా..

2006లో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినపుడు 21 సీట్లు గెలుచుకుంది. 2011లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ(TMC)తో పొత్తుపెట్టుకుని 42 సీట్లు సాధించింది. 2016లో కాంగ్రెస్, సీపీఐ(ఎం) నేతృత్వంలోని వామపక్షాలతో జత కట్టి 44 సీట్లు గెలుచుకోగా.. 2021 ఎన్నికల్లో మళ్లీ వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. చాలా ఏళ్ల తర్వాత పొత్తు లేకుండా పోటీ చేస్తుండడంతో టీఎంసీ లేదా వామపక్షాలతో కొనసాగిన 15 ఏళ్ల కూటమి బంధానికి తెరపడింది.

2006లో (ఒంటరిగా) – 21 సీట్లు

2011లో (టీఎంసీతో) – 42 సీట్లు

2016లో (వామపక్షాలతో) – 44 సీట్లు

2021లో (వామపక్షాలతో) – 0 సీట్లు


‘పార్టీ హైకమాండ్ నిర్ణయంతోనే..’

ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరిగిన సమావేశంలో పశ్చిమబెంగాల్ నాయకులు పార్టీ హైకమాండ్‌‌ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) తో సమావేశమయ్యారు. పార్టీ పునర్నిర్మాణం కోసం బెంగాల్‌లో ఒంటరిగా పోటీ చేయాలని, ఇతర పార్టీలతో జత కట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రాష్ట్రనేతలు ఆయనకు చెప్పినట్లు సమాచారం.

గతంలో ఎన్నికల ఫండ్‌ను వామపక్షాలకు ఖర్చుచేశామని, అయితే ఓట్లు మాత్రం పడలేదని, టీఎంసీ దురుసు వైఖరి కారణంగా ఆ పార్టీని దూరం పెట్టడం మంచిదని రాష్ట్ర నేతలు ఢిల్లీ పెద్దలతో చెప్పినట్లు సమాచారం.

రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విషయాన్ని కాంగ్రెస్‌ ఏకైక ఎంపీ ఇషా ఖాన్ చౌదరీ ది ఫెడరల్‌కు చెప్పారు. “బెంగాల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడానికి రాహుల్ జీ ఆశీర్వాదం మాకు లభించింది” అని ఆయన అన్నారు.

Read More
Next Story