కాంగ్రెస్‌లో భేదాభిప్రాయాలకు ఫుల్‌స్టాప్..
ఐక్యతపై థరూర్ ప్రకటన..
కాంగ్రెస్(Congress) అగ్రనేతలు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjuna Kharge), రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో సమావేశం అనంతరం పార్టీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) స్పష్టం చేశారు. తమ మధ్య జరిగిన 90 నిమిషాల చర్చలు “చాలా నిర్మాణాత్మకమైనవి, సానుకూలమైనవి” అని ఆయన పేర్కొన్నారు.
గురువారం ఉదయం పార్లమెంట్ భవనంలో రాహుల్, ఖర్గేను థరూర్ కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ..పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ముఖ్యంగా రాబోయే ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు వెల్లడించారు.
ఈ సమావేశం గురించి థరూర్ ఎక్స్ (X)లో కూడా పోస్ట్ చేశారు. దేశ ప్రజల సేవలో ముందుకు సాగేందుకు అందరం కలిసి పనిచేస్తున్నామంటూ చివర్లో ఖర్గే, రాహుల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
థరూర్ తీరు ఎందుకు చర్చనీయాంశమైంది?
ఇటీవల పార్టీ ఉన్నత స్థాయి సమావేశాలకు థరూర్ గైర్హాజరు కావడం, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో అసంతృప్తిని కలిగించాయని వార్తలొచ్చాయి. ప్రధాని మోదీని కొన్ని సందర్భాల్లో ప్రశంసించడం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్వహించిన విందుకు హాజరుకావడం వంటి అంశాలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
అలాగే గతంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఖర్గేతో పోటీ చేసిన థరూర్, పార్టీ వ్యవస్థ, నాయకత్వ శైలి, వంశపారంపర్య రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాలకు దారితీశాయి. కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమం తర్వాత ఆయన పార్టీ సమావేశాలకు దూరంగా ఉండటంతో, ఇతర పార్టీలలో చేరవచ్చన్న ఊహాగానాలు కూడా వచ్చాయి. అయితే థరూర్ ఈ ప్రచారాలను ఖండించారు.
వరుస ఎన్నికల పరాజయాల తర్వాత నాయకత్వ మార్పు అవసరమని కోరిన G-23 నేతలలో థరూర్ ఒకరిగా ఉండటంతో, గత కొన్నేళ్లుగా ఆయనకు పార్టీకి మధ్య విభేదాలు ఉన్నాయని భావించారు. అయితే తాజా సమావేశం అనంతరం, ఆ అపోహలకు ముగింపు పలుకుతూ, కాంగ్రెస్‌తో తన అనుబంధం బలంగా ఉందని థరూర్ స్పష్టం చేశారు.

