
మేము బానిసలం కాదు..మమ్మల్ని వేధిస్తే చూస్తూ ఊరుకోం: ముద్రగడ
తమకు జరిగినట్టే మీ కుటుంబంపై జరిగితే ఎలా ఉంటుంది అని చంద్రబాబును ముద్రగడ ప్రశ్నించారు.
మేము బానిసలం కాదు.. మమ్మల్ని వేధిస్తే చూస్తూ ఊరుకోం అంటూ సీనియర్ నాయకులు ముద్రగడ పద్మనాభం కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ నేపథ్యంలో వైఎస్సార్సీపీ మాజీ మంత్రులు, నాయకులతో కలిసి ఆయన అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ముద్రగడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీ ఇంట్లో వాళ్లకు జరిగితే ఎలా ఉంటుంది?
గతంలో తనపై, తన కుటుంబంపై జరిగిన వేధింపులను గుర్తు చేసుకుంటూ ముద్రగడ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. నన్ను, నా కుటుంబాన్ని మీరు ఎంతగా వేధించారో అందరికీ తెలుసు. మాకు జరిగిన అవమానాలు రేపు మీ భార్యకు, మీ కొడుకు, కోడలికి జరిగితే మీరు ఎలా భరిస్తారు? అని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదని ఆయన హితవు పలికారు.
అబద్ధాలు ఆపి..క్షమాపణ చెప్పండి
తిరుమల లడ్డూ వ్యవహారంపై ముద్రగడ తీవ్రంగా స్పందించారు. ప్రతిరోజూ లడ్డూపై అబద్ధాలు ఆడుతున్నారు. మీ అబద్ధాలను ఇప్పటికైనా ఆపి భక్తులకు క్షమాపణ చెప్పండి. మాట్లాడడం మానేసినా ఫరవాలేదు కానీ, విష ప్రచారం వద్దు అని డిమాండ్ చేశారు. కాపుల సహకారంతో రెండుసార్లు ముఖ్యమంత్రి అయిన విషయాన్ని చంద్రబాబు గుర్తుంచుకోవాలని, ఇళ్లపై దాడులు చేసే సంస్కృతికి స్వస్తి పలకాలని హెచ్చరించారు.
మౌనిక.. భవిష్యత్తు మమతా బెనర్జీ కావాలి
అంబటి రాంబాబు కుమార్తె, వైఎస్సార్‌సీపీ ఫైర్ బ్రాండ్ మౌనికను ముద్రగడ ప్రత్యేకంగా పలకరించారు. ఆమె ధైర్యాన్ని అభినందిస్తూ.. భవిష్యత్తులో మౌనిక పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్థాయికి ఎదగాలి అని ఆకాంక్షించారు. ఈ పరామర్శలో ముద్రగడతో పాటు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మేరుగు నాగార్జున కూడా పాల్గొన్నారు.
అరెస్టుల పర్వంపై ధ్వజం
అరెస్టులకు తాము భయపడబోమని, అంబటి రాంబాబు, జోగి రమేష్, పిన్నెల్లి వంటి నేతలను జైలుకు పంపడం ద్వారా వైఎస్సార్‌సీపీని అణచలేరని నేతలు స్పష్టం చేశారు. భవిష్యత్తుకు మీరు గట్టి పునాది వేస్తున్నారు.. రేపు మేము అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు సరిచేస్తాం అని మేరుగు నాగార్జున హెచ్చరించారు.
అరెస్టులకు భయపడం: తమ్మినేని సీతారాం
అంబటి రాంబాబుతో పాటు జోగి రమేష్, చెవిరెడ్డి, పిన్నెల్లి వంటి నేతలను అరెస్ట్ చేయడంపై మాజీ స్పీకర్ తమ్మినేని మండిపడ్డారు. అరెస్టులు చేస్తే భయపడి ఇంట్లో కూర్చునే రకం కాదు మేము. మీరు ఏం చేసినా ప్రజల్లోకి వస్తాం అని స్పష్టం చేశారు. నాలుగు సార్లు సీఎం అయిన వ్యక్తికి పాలన ఇలాగేనా చేసేది అని నిలదీశారు. తిరుమల లడ్డూలో కల్తీ లేదని ఇప్పటికే తేలిపోయిందని ఆయన పేర్కొన్నారు.

