వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టులో సునీతకు భారీ షాక్
x

వివేకా హత్య కేసు: సుప్రీంకోర్టులో సునీతకు భారీ షాక్

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు డిస్మిస్.


ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బుధవారం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు దర్యాప్తు ప్రక్రియ ముగిసిందని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం, వివేకా కుమార్తె సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చింది. దీంతో ఈ సుదీర్ఘ న్యాయపోరాటంలో మరో కీలక అంకం ముగిసినట్లయింది.

  • సీబీఐ దర్యాప్తు పూర్తి..మూడో ఛార్జిషీట్ దాఖలు

    ఈ కేసు విచారణ సందర్భంగా సీబీఐ (CBI) తరఫు న్యాయవాది ధర్మాసనానికి కీలక సమాచారం అందించారు. వివేకా హత్య కేసులో తాము మూడో సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను కూడా దాఖలు చేశామని, దీనితో దర్యాప్తు ప్రక్రియ పూర్తిగా పూర్తయిందని కోర్టుకు వెల్లడించారు. ఇకపై ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని సీబీఐ స్పష్టం చేయడం గమనార్హం. ఈ పరిణామంతో కేసు ఇప్పుడు పూర్తిగా ట్రయల్ (విచారణ) దశకు చేరుకుంది.

    సునీత వాదనలు తిరస్కరణ..బెయిల్ రద్దు లేదు

    కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఇతర నిందితుల బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సునీతా రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ ఎంఎం సుందరేశ్ ధర్మాసనం డిస్మిస్ చేసింది. సునీత తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదిస్తూ.. తాము లేవనెత్తిన కొన్ని కీలక అంశాలపై దర్యాప్తు జరగలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఇప్పటికే దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్ దాఖలు చేసినందున, ఇకపై బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ జరపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

    ట్రయల్ కోర్టుకు కీలక ఆదేశాలు.. నాలుగు వారాల్లో విచారణ

    ఈ కేసులో ఏవైనా అభ్యంతరాలు లేదా అదనపు ఆధారాలు ఉంటే ట్రయల్ కోర్టును ఆశ్రయించవచ్చని సునీతారెడ్డికి సుప్రీంకోర్టు సూచించింది. ముఖ్యంగా ట్రయల్ కోర్టులో సెక్షన్ 207 కింద దాఖలైన అన్ని పిటిషన్లను నాలుగు వారాల్లోగా ముగించి, తీర్పు వెలువరించాలని ఆదేశించింది. నిందితులకు అందించాల్సిన డాక్యుమెంట్ల ప్రక్రియను త్వరగా పూర్తి చేసి, ట్రయల్‌ను వేగవంతం చేయాలని స్పష్టం చేసింది.

    ముగిసిన పిటిషన్ల పర్వం

    దాదాపు ఐదేళ్లుగా సాగుతున్న ఈ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో ఒక స్పష్టత వచ్చింది. దర్యాప్తు సంస్థ తన పని పూర్తి చేశామని చెప్పడంతో, ఇక అంతా ట్రయల్ కోర్టు పరిధిలోకి వెళ్లిపోయింది. అవినాష్ రెడ్డికి బెయిల్ రద్దు కాకపోవడం ఆయనకు పెద్ద ఊరటనిచ్చే అంశం కాగా, సునీతా రెడ్డికి ఈ విచారణలో నిరాశే ఎదురైంది.

  • Read More
    Next Story