విజయ్‌కు మరో ఎదురుదెబ్బ..
x

విజయ్‌కు మరో ఎదురుదెబ్బ..

రూ.1.5 కోట్ల ఐటీ జరిమానాను సమర్థించిన మద్రాస్ హైకోర్టు


Click the Play button to hear this message in audio format

నటుడు–రాజకీయ నాయకుడు, తమిళగా వెట్రి కజగం (TVK) అధినేత విజయ్‌(Vijay)కు మద్రాస్ హైకోర్టు(Madras High court)లో ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.1.5 కోట్ల జరిమానాను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఐటీ శాఖ నిర్ణయాన్ని సమర్థించింది.

2015–16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘పులి’ సినిమా పారితోషికంలో భాగంగా వచ్చిన రూ.15 కోట్ల అదనపు ఆదాయాన్ని ముందుగా వెల్లడించకపోవడంపై ఈ కేసు నమోదైంది. జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి ఈ తీర్పును వెలువరించారు. జనవరి 23న ఉత్తర్వులను రిజర్వ్ చేసిన న్యాయస్థానం, ఫిబ్రవరి 6న తీర్పు ప్రకటించింది. 2022 జూన్ 30న ఐటీ శాఖ జారీ చేసిన జరిమానా ఉత్తర్వు చెల్లుబాటేనని పేర్కొంది.

కేసు నేపథ్యం..

2015 సెప్టెంబర్ 30న ఆదాయపు పన్ను అధికారులు విజయ్‌కు, అలాగే ‘పులి’ చిత్ర నిర్మాతలకు చెందిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో బ్యాంకు మార్గాల్లో రూ.16 కోట్లు, నగదు రూపంలో సుమారు రూ.4.93 కోట్లు అందుకున్నట్లు పత్రాలు బయటపడ్డాయి. చెక్కుతో ఇచ్చిన డబ్బుపై ముందుగానే పన్ను కట్ చేశారు. కానీ నగదు రూపంలో ఇచ్చిన డబ్బుపై మాత్రం పన్ను కట్ చేయలేదు అని అధికారులు గుర్తించారు. అనంతరం విజయ్ 2016 జూలై 29న సవరించిన రిటర్న్ దాఖలు చేసి రూ.15 కోట్లను అదనపు ఆదాయంగా చేర్చారు.


వాదనలు – కోర్టు తీర్పు..

విజయ్ తరఫు న్యాయవాదులు జరిమానా ఉత్తర్వు కాలపరిమితి దాటిందని, అదనపు ఆదాయం ప్రకటించి పన్నులు చెల్లించినందున పెనాల్టీ అవసరం లేదని వాదించారు. దీనికి విరుద్ధంగా ఐటీ శాఖ, సోదాల కారణంగానే ఆదాయం బయటపడిందని, ఇది స్వచ్ఛంద బహిర్గతం కాదని తెలిపింది. కాలపరిమితి విషయంలో కూడా చట్టపరమైన పొడిగింపులు వర్తిస్తాయని పేర్కొంది. కోర్టు ఐటీ శాఖ వాదనలను సమర్థిస్తూ పిటిషన్‌ను ఖర్చులేమీ విధించకుండా కొట్టివేసింది.

Read More
Next Story