
తమిళనాడు: ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరిన విజయ్
తన ప్రధాన్య ప్రత్యర్థి డీఎంకేనని చెప్పిన టీవీకే చీఫ్..
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సాధారణ రాజకీయ పోటీ కంటే చాలా ఎక్కువ అని పేర్కొన్నారు టీవీకే (తమిళగ వెట్రి ఖజగం) చీఫ్ విజయ్. తంజావూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. "ఇది ఇతరులకు సాధారణ ఎన్నికలులాగా అనిపించవచ్చు. కానీ నాకు, నన్ను ప్రేమించే ప్రజలకు ఇది భావోద్వేగంతో కూడిన ఎన్నికలు," అని అన్నారు. ఎన్నికలు ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉన్నందున, తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. ప్రతి ఇంట్లో, పోలింగ్ బూత్‌లో టీవీకే ఎన్నికల గుర్తు ‘విజిల్’ ప్రతిధ్వనించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ప్రధాన పోటీ డీఎంకేతోనే..
"తమిళనాడు అంటే విజయ్, విజయ్ అంటే తమిళనాడు" అని గతంలో తాను చేసిన వాదనను పునరుద్ఘాటిస్తూ, ఈ ఎన్నికలు తనకు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు మధ్య ప్రత్యక్ష పోటీగా విజయ్ అభివర్ణించారు.
తన వ్యాఖ్యలను బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చిత్రీకరించే డీఎంకే ప్రయత్నాలను తిప్పికొట్టారు. ఓటర్ల విశ్వసాన్ని అధికార పార్టీ కోల్పోయిందని అందుకే బురదజల్లే వ్యూహాలపై దృష్టిపెట్టిందన్నారు.
తమిళనాడులో రైతులను విజయ్ హీరోలుగా అభివర్ణించారు. తనకు వ్యవసాయం గురించి పెద్దగా తెలియదని ఒప్పుకున్నాడు. కానీ రాజకీయాల కోసం రైతులతో అబద్దాలు చెప్పనని చెప్పారు. "నేను మరో జన్మను నమ్మను. కానీ అది నిజమైతే, నేను రైతు కుటుంబంలో పుట్టాలని కోరుకుంటా" అని అన్నారు.
భూగర్భజలాల సంక్షోభం గురించి మాట్లాడుతూ.. తమిళనాడు భూగర్భ జల నిల్వలు కనుమరుగయ్యే దశలో ఉన్నాయన్నారు. ఇటీవలి ప్రచురితమైన కథనాన్ని ఉదహరిస్తూ, నీటి ఎద్దని నివారణలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని విజయ్ ఆరోపించారు.

