మండలిలో ’వీడియో‘ చిచ్చు
x
మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద ధర్నా చేస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు

మండలిలో ’వీడియో‘ చిచ్చు

మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద వైసీపీ ధర్నా. ఫుటేజ్ మాయంపై ఉత్కంఠ.


ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో రాజకీయం మరోసారి వేడెక్కింది. గత శుక్రవారం నాటి సమావేశాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్ వ్యవహారం ఇప్పుడు సభలో చిచ్చు రేపింది. టీడీపీ నేతలు ఎడిటింగ్ వీడియోలను విడుదల చేశారని ఆరోపిస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఛైర్మన్ ఛాంబర్ ముందు ధర్నాకు దిగారు.

అసలు ఏం జరిగింది?

శుక్రవారం నాటి మండలి సమావేశంలో శ్రీవారి చిత్రపటాలను పట్టుకున్న వైఎస్సార్‌సీపీ సభ్యుల తీరుపై కూటమి ప్రభుత్వం ఒక వీడియోను విడుదల చేసింది. అయితే, అది ఎడిటింగ్ వీడియో అని, కేవలం తమను బద్నాం చేయడానికే దానిని బయటపెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. సభలో జరిగిన అసలు విషయాన్ని ప్రపంచానికి చూపించడానికి మొత్తం ఫుటేజ్ విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ సభ్యులు పట్టుబట్టారు.

ఫుటేజ్ లేదంటూ అధికారుల సమాధానం.. ఉత్కంఠ

వైఎస్సార్‌సీపీ సభ్యుల ఫిర్యాదుపై స్పందించిన మండలి ఛైర్మన్, ఆ రోజు నాటి పూర్తి వీడియో ఫుటేజ్‌ను సమర్పించాలని అసెంబ్లీ అధికారులను ఆదేశించారు. అయితే, అధికారుల నుంచి వచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఫుటేజ్ లేదు అంటూ అధికారులు సమాధానం ఇవ్వడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు ఒక్కసారిగా భగ్గుమన్నారు.

భయమెందుకు? వైఎస్సార్‌సీపీ ప్రశ్న

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు పాదరక్షలు విడిచి, అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీవారి చిత్రపటాల్ని పట్టుకున్న వీడియో ఎక్కడ బయటికి వస్తుందోనని ప్రభుత్వం భయపడుతోందా? అని వైసీపీ ఎమ్మెల్సీలు నిలదీస్తున్నారు. వాస్తవాలు దాచి, ఎడిటింగ్ వీడియోలతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి ఫుటేజ్ మాయం చేశారని ఆరోపిస్తూ ఛైర్మన్ ఛాంబర్ ముందు బైఠాయించారు.

Read More
Next Story