యువతే లక్ష్యంగా TVK విజయ్ మ్యానిఫెస్టో..
x

యువతే లక్ష్యంగా TVK విజయ్ మ్యానిఫెస్టో..

‘నిరుద్యోగ భృతి, వడ్డీ లేని రుణాలు, డ్రగ్ ఫ్రీ తమిళనాడు, ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యం’ - టీవీకే ఎన్నికల హామీలు


Click the Play button to hear this message in audio format

నటనా రంగం రాజకీయవేత్తగా మారిని విజయ్ తన పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) మ్యానిఫెస్టో రిలీజ్ చేశారు. చెన్నైలో మార్చి 29న తన అభ్యర్థుల పరిచయ సభలో దీన్ని విడుదల చేశారు. ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుని హామీలు ప్రకటించారు.

టీవీకే మేనిఫెస్టో పూర్తిగా యువత, ముఖ్యంగా 20-40 ఏళ్ల మధ్య వయసు గల ఓటర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. రాష్ట్రంలో సుమారు 40% ఓటర్లు ఈ వర్గానికి చెందడం గమనార్హం.

కీలక వాగ్దానాలు..

నిరుద్యోగ భృతి: ప్రతిపాదిత యువజన సంక్షేమ నిధి ద్వారా 29 ఏళ్లు పైబడి ఉద్యోగం లేని పట్టభద్రులకు నెలకు రూ. 4 వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ. 2వేలు అందజేత..

విద్యా రుణాలు: 12వ తరగతి నుంచి పీహెచ్‌డీ స్థాయి వరకు విద్యార్థులకు ఎలాంటి హామీ లేకుండా రూ. 20 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.

ఇంటర్న్‌షిప్: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు కలిసి ఏటాద ఐదు లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించనున్నారు. వీటిలో గ్రాడ్యుయేట్లకు నెలకు రూ. 10వేలు ఐటీ గ్రాడ్యుయేట్లకు రూ. 8వేలు స్టైపెండ్ ఇవ్వనున్నారు.

ఔత్సాహితులకు ప్రోత్సాహం: యువ పారిశ్రామికవేత్తలకు ఎలాంటి హామీ లేకుండా రూ. 25 లక్షల వరకు వడ్డీ లేని రుణం

ఉద్యోగాలలో తమిళులకే ప్రాధాన్యం: ఐదు లక్షల మంది యువతకు స్థానికంగా ఉపాధి కల్పించేందుకు ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ముఖ్యమంత్రి ప్రజాసేవా మిత్ర పథకాన్ని ప్రారంభం. ప్రైవేట్ కంపెనీల్లో 75 శాతం మంది తమిళులకే అవకాశం.

మాదకద్రవ్య రహిత తమిళనాడు: యువత అభిప్రాయాలను వినడానికి తమిళనాడు యువ సలహా మండలి ఏర్పాటు.. తమిళనాడును పూర్తిగా మాదకద్రవ్య రహితంగా మార్చేందుకు, కఠినమైన కొత్త చట్టాల మద్దతుతో ప్రతి పాఠశాల, కళాశాలలో మాదకద్రవ్య వ్యతిరేక వేదికల ఏర్పాటు.


యువ ఓటర్లు 40 శాతం..

తమిళనాడులో సుమారు 5.67 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 12.51 లక్షల మంది తొలిసారి ఓటు వేస్తున్నారు. 20-40 ఏళ్ల మధ్య వయసు ఉన్న ఓటర్లు దాదాపు 2.28 కోట్లు ఉన్నారు. వీరు మొత్తం ఓటర్లలో 40 శాతం.

స్త్రీ, పురుష ఓటర్లు ఎంతమంది?

రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 75,032 పోలింగ్ కేంద్రాలున్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 30,967, గ్రామీణ ప్రాంతాల్లో 44,065 కేంద్రాలున్నాయి. పురుష ఓటర్ల సంఖ్య సుమారు 2.77 కోట్లు కాగా, మహిళా ఓటర్ల సంఖ్య 2.89 కోట్లు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. విజయ్ తన సినీ ప్రజాదరణను రాజకీయ బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా తొలి సారి ఓటు వేస్తున్న యువత ఆయనకు మద్దతుదారులుగా మారే అవకాశముంది.

ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ డీఎంకే (Dravida Munnetra Kazhagam) ప్రతిపక్ష ఏఐఏడీఎంకే (All India Anna Dravida Munnetra Kazhagam) యువతను ఆకట్టుకోవడంలో వెనుకబడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే టీవీకేకు ప్రధాన అవకాశంగా మారింది.

అయితే, పార్టీకి సంస్థాగత బలం తక్కువగా ఉండటం, అభ్యర్థుల ఎంపిక, ధనబలం వంటి అంశాలు సవాళ్లుగా ఉన్నాయి. విజయ్ వ్యక్తిగత ఆకర్షణ భారీ జనసమీకరణ తెచ్చిపెడుతున్నా.. అది ఓట్లుగా మారుతాయా? అన్నదే సందేహంగా ఉంది.

విజయ్ ఈ ఎన్నికలను “ప్రజలు Vs అధికారం”గా అభివర్ణించారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. టీవీకే 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది.

మొత్తంగా, యువత మద్దతుతో టీవీకే 15% వరకు ఓట్ల వాటా సాధించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 23 న పోలింగ్, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి.

Read More
Next Story