
టీడీపీలో టీటీడీ కలకలం!
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా అనివార్యమా?
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానాలు) బోర్డు చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు వ్యక్తిగత వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, ఫొటోలు నాయుడు ఒక మహిళతో సన్నిహితంగా ఉండటం చర్చకు దారితీశాయి. దీనిపై విపక్ష వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తూ, నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా కూటమి పక్షాల్లోనూ అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ వివాదం టీటీడీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తుందని, నాయుడు తప్పకుండా పదవి వదులుకోవాల్సి రావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హిందువుల మనోభావాలకు గాయం...
ఈ సంఘటన వెనుక డీప్‌ఫేక్ టెక్నాలజీ ఉందని బీఆర్ నాయుడు వాదిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి, విచారణ డిమాండ్ చేశారు. అయితే మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ వాదనలను తోసిపుచ్చుతూ ‘ఇలాంటి వ్యక్తి పవిత్ర స్థానంలో ఉండటం హిందువుల మనోభావాలకు గాయం’ అని వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో ఎస్వీబీసీ చైర్మన్ పృద్విరాజ్ మహిళపై అసభ్య వ్యాఖ్యలు చేసిన సంఘటనను గుర్తు చేస్తూ, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆయన్ను తప్పించారని భూమన ఉదాహరించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే దారి పట్టాలని సూచిస్తున్నారు.
వివాదాల కుంపటిగా టీటీడీ
టీటీడీలో ఇటీవల వివాదాలు ఒక్క బీఆర్ నాయుడు వ్యవహారంతోనే ఆగిపోలేదు. కల్తీ నెయ్యి కుంభకోణం ఇంకా చల్లారలేదు. 2021-2024 మధ్య 5971 టన్నుల కల్తీ నెయ్యి సరఫరా చేసి, టీటీడీకి రూ.234 కోట్ల నష్టం కలిగించినట్లు సీబీఐ-నేతృత్వంలోని సిట్ తన చార్జిషీట్‌లో పేర్కొంది. దీంతో 20 కోట్లకు పైగా లడ్డూలు తయారై భక్తులకు అందించారు. ఇందులో పామాయిల్, కెమికల్ ఎస్టర్లు వంటి సింథటిక్ పదార్థాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే జంతు కొవ్వు లేదని స్పష్టమైంది. ఈ కుంభకోణంలో 36 మంది నిందితులు, సరఫరాదారులు, అధికారుల మధ్య సంబంధాలు బయట పడ్డాయి. ప్రభుత్వం వన్ మ్యాన్ కమిటీ నియమించి విచారణ చేపట్టినా ఇంకా పూర్తి న్యాయం జరగలేదు.
భక్తుల భద్రతపై ఆందోళనలు
మరో వైపు భక్తుల భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. తిరుమలలో వన్యప్రాణుల దాడులు (చిరుతలు, ఎలుగుబంట్లు) పెరిగాయని ఆరోపణలు ఉన్నాయి. భక్తులకు ట్రెక్కింగ్ మార్గాల్లో రక్షణ లేకుండా పోయిందని ఫిర్యాదులు వస్తున్నాయి. అలాగే సాధారణ భక్తులు దర్శనం కోసం రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. టీటీడీ ఈవో స్వయంగా ఈ సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని ప్రకటించారు. కానీ పరిష్కారం లేదు. ఇటీవల నియమితులైన బోర్డు సభ్యులు రాజకీయ ప్రసంగాలు నిషేధించారు. హిందువులు కాని వారిని టీటీడీ నుంచి తొలగించాలని ప్రకటించారు. ఇది మరిన్ని వివాదాలకు దారి తీస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
గత ప్రభుత్వంపై ఆరోపణలు
గత ఐదేళ్లలో టీటీడీలో భూకబ్జాలు, అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. మాజీ చైర్మన్ భూమనపై భూముల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని బీఆర్ నాయుడు ఆరోపించారు. ఇప్పుడు నాయుడు స్వయంగా వివాదంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య అసంతృప్తి పెరుగుతుందనే చర్చ జోరుగా సాగుతోంది. పవన్ కల్యాణ్ ఇప్పటికే చంద్రబాబును కలిసి నాయుడు వ్యవహారంపై ఆక్షేపణలు వ్యక్తం చేసినట్లు సమాచారం. టీడీపీపై అంతర్గతంగా కూడా ఈ వివాదం ప్రభావం చూపుతుంది.
తనను మానశికంగా, ఆర్థికంగా వేదనకు గురిచేస్తున్నారని వేధింపులకు గురవుతున్న మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ లకు బహిరంగ లేఖ రాశారు. ఆడవారిని లోబరుచుకోవడం కోసం ఎంతకైనా నాయుడు తెగిస్తాడని, లొంగకపోతే వారికి ఎటువంటి పనులు చేయరని పేర్కొన్నారు. తన కుమార్తె ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుందని, అయినా ఆర్థికంగా ఆదులోలేదని పేర్కొన్నారు. తనకు నాయుడుతో 25 ఏళ్లుగా శారీరక సంబంధం ఉందని, ఆయనతోనే జీవితం అనుకుని ముందుకు సాగుతున్నానని, వేధింపులకు గురవుతూనే ఉన్నానని చెప్పటం విశేషం.
రాజీనామా అనివార్యం?
బీఆర్ నాయుడు రాజీనామా అనివార్యం కావచ్చు. చంద్రబాబు ఆయన్ను ఒప్పించి పదవి వదులుకునేలా చేస్తారనే అభిప్రాయం బలపడుతోంది. లేకపోతే విపక్షాలు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుని కూటమిని ఇరుకున పెట్టవచ్చు. టీటీడీ పరువు కాపాడుకోవాలంటే, పారదర్శక వ్యవస్థలు, కఠిన విచారణలు అవసరం. లేకుంటే భక్తుల విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ వివాదాలు టీటీడీని మరింత రాజకీయాలకు గురి చేస్తాయా? లేక సంస్కరణలకు దారి తీస్తాయా అనేది వేచి చూడాల్సిందే.

