మండలిని కుదిపేస్తున్న టీటీడీ లడ్డూ నెయ్యి కల్తీ
x
ఏపీ శాసనమండలిలో వైసీపీ సభ్యుల ఆందోళన

మండలిని కుదిపేస్తున్న టీటీడీ లడ్డూ నెయ్యి కల్తీ

తిరుమల లడ్డూ నాణ్యత వెనుక పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి దాగి ఉందంటూ వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన ఆరోపణలు సభలో పెను దుమారాన్ని రేపాయి.


కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం వేంకటేశ్వరుడి పవిత్ర నైవేద్యం తిరుమల లడ్డూ చుట్టూ అలుముకున్న రాజకీయ వివాదం ఆంధ్రప్రదేశ్ శాసన మండలిని కుదిపేస్తోంది. గత రెండు రోజులుగా మండలి వేదికగా పాలక, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ నెయ్యి యుద్ధం మాటల సరిహద్దులు దాటి నినాదాల హోరుగా మారింది. నెయ్యి ధరల పెంపు, హెరిటేజ్ సరఫరాపై వైసీపీ సంధిస్తున్న ఆరోపణలు ఒకవైపు..గత ప్రభుత్వ హయాంలో సరఫరా అయింది నెయ్యి కాదు రసాయనాల మిశ్రమమని అధికార కూటమి ఇస్తున్న కౌంటర్లు మరోవైపు.. వెరసి సభలో గోవింద నామస్మరణ భక్తి కోసం కాక నిరసన కోసం వినిపిస్తోంది. భక్తుల మనోభావాలు, ల్యాబ్ నివేదికలు, రాజకీయ ప్రయోజనాల మధ్య నలుగుతున్న ఈ లడ్డూ కల్తీ అంశం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. దీనిపై చర్చ పెట్టాలని వైసీపీ సభ్యులు గత రెండు రోజులుగా వాయిదా తీర్మానం ఇస్తూనే ఉన్నారు.


హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ టీటీడీకి నెయ్యి సరఫరా చేయడంపై చర్చించాలని మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం

నెయ్యి ధరల ఘాటు.. హెరిటేజ్ సరఫరాపై వైసీపీ ధ్వజం

తిరుమల లడ్డూ నాణ్యత వెనుక పెద్ద ఎత్తున రాజకీయ లబ్ధి దాగి ఉందంటూ వైసీపీ ఎమ్మెల్సీలు చేసిన ఆరోపణలు సభలో పెను దుమారాన్ని రేపాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, ఆర్.జె. భరత్, సిపాయి సుబ్రమణ్యంలు హెరిటేజ్ సంస్థ చుట్టూ కేంద్రీకృతమైన విమర్శలతో వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించడం చర్చనీయాంశమైంది. మహారాష్ట్రకు చెందిన ఇందాపూర్ డెయిరీ ముసుగులో హెరిటేజ్ సంస్థే నేరుగా తిరుమలకు నెయ్యి సరఫరా చేస్తోందని, ఇది అధికార దుర్వినియోగమేనని వారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ అంశంపై మరింత ఘాటుగా స్పందిస్తూ, నెయ్యి ధరల పెంపు వెనుక ఉన్న మర్మాన్ని ప్రశ్నించారు. గతంలో కిలోకు రూ.320 ఉన్న నెయ్యి ధరను, ఇప్పుడు ఏకంగా రూ. 700కు పెంచడం వెనుక ప్రైవేటు సంస్థలకు కోట్లాది రూపాయల లబ్ధి చేకూర్చే కుట్ర దాగి ఉందని ఆయన మండిపడ్డారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందన్న ప్రచారం కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని, ఇప్పటివరకు వచ్చిన సీబీఐ లేదా సిట్ నివేదికల్లో అది ఎక్కడా శాస్త్రీయంగా నిరూపితం కాలేదని ఆయన ధీమాగా వాదించారు. భక్తుల మనోభావాలను ఆయుధంగా చేసుకుని ప్రభుత్వం నెయ్యి వ్యాపారం చేస్తోందంటూ బొత్స చేసిన విమర్శలు సభలో వేడిని పెంచాయి.


ప్రభుత్వ ఎదురుదాడి: అది నెయ్యి కాదు..రసాయనాల మిశ్రమం

వైసీపీ ఆరోపణలను ప్రభుత్వం అంతే దీటుగా తిప్పికొడుతూ సభలో ఎదురుదాడికి దిగింది. ముఖ్యంగా హోం మంత్రి వంగలపూడి అనిత చేసిన వ్యాఖ్యలు సభను ఒక్కసారిగా స్తంభింపజేశాయి. గత ప్రభుత్వ హయాంలో తిరుమలకు సరఫరా అయింది అసలు నెయ్యే కాదని, అది కేవలం రసాయనాల మిశ్రమం (Chemical Mixture) అని ల్యాబ్ నివేదికలు సాక్ష్యాధారాలతో సహా చెబుతున్నాయని ఆమె కుండబద్దలు కొట్టారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేసిన పాపం గత ప్రభుత్వానిదేనని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేవలం తక్కువ ధరకే టెండర్లు దక్కించుకోవాలనే దురాశతో, నాణ్యతా ప్రమాణాలను తుంగలో తొక్కారని ప్రభుత్వం ఆరోపించింది. అర్హత లేని సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టి తిరుమల పవిత్రతను బజారున పడేశారని మంత్రి అనిత విమర్శించారు. ఇదే తరుణంలో మంత్రి అచ్చెన్నాయుడు రంగంలోకి దిగి వైసీపీ సభ్యులకు గట్టి హెచ్చరిక జారీ చేశారు. హెరిటేజ్ సంస్థపై బురద చల్లడం ఆపాలని, చేతిలో ఆధారాలు ఉంటే సభ ముందు ఉంచాలి తప్ప.. గాలి మాటలతో భక్తుల మనోభావాలతో ఆడుకోవద్దని మండిపడ్డారు. తిరుమల ప్రక్షాళన కోసం తాము ధర పైనా రాజీ పడకుండా స్వచ్ఛమైన నెయ్యిని సేకరిస్తుంటే, తప్పుడు ప్రచారాలు చేయడం శోచనీయమని ఆయన వ్యాఖ్యానించారు.

నినాదాలతో హోరెత్తిన సభ.. వాయిదాల పర్వం

చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి గోవిందా.. గోవిందా అంటూ నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినప్పటికీ, ప్రతిపక్ష సభ్యులు వెనక్కి తగ్గలేదు. భక్తుల మనోభావాలను తాము కాపాడుతున్నామని ప్రభుత్వం, తాము వాస్తవాలను బయటపెడుతున్నామని వైసీపీ వాదించుకోవడంతో బుధవారం సభ పదేపదే వాయిదా పడింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు ధర పెరిగినా స్వచ్ఛమైన నెయ్యినే వాడుతున్నామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. వరుసగా రెండో రోజూ ఎటువంటి నిర్మాణాత్మక చర్చ లేకుండానే సభ గందరగోళం మధ్య వాయిదా పడటం గమనార్హం.

Read More
Next Story