TTD Laddu Controversy
x
సిట్ నివేదికపై రాజుకుంటున్న వివాదం

నెయ్యే నిప్పు: తొడగొడుతున్న వైసీపీ, జబ్బలు చరుస్తున్న టీడీపీ

కాగుతున్న టీటీడీ నెయ్యి.. వైసీపీకి స్ట్రెయిట్ వార్నింగ్: "దమ్ముంటే అసెంబ్లీకి రండి.. తేల్చుకుందాం!"


శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం మళ్లీ రాజుకుంటోంది. ఈ విషయమై సీబీఐ సిట్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో మంటలు రేపుతోంది. నిప్పు లేకుండానే నెయ్యి సలసలాకాగుతోంది. నెయ్యిలో గొడ్డు కొవ్వు కలవలేదని సిట్ నివేదిక తేల్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ కూటమి పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. నువ్వు దొంగంటే నువ్వు దొంగ అనుకుంటున్నాయి. వైసీపీ నాయకులు నిన్న చేసిన విమర్శల తీరుపై కూటమి నాయకులు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తిరుపతి లడ్డూ వ్యవహారంలో జరిగిన తప్పుల మీద చర్చకు రావాలని సవాల్ విసిరారు. నాయకులు మాట్లాడిన ముఖ్యాంశాలు ఇవే:

"నిజం నిప్పులాంటిది" - లోకేష్ (మంత్రి)

"జగన్.., మీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి ఎంత మొత్తుకున్నా నిజం దాగదు. రిపోర్టులు స్పష్టంగా ఉన్నాయి. నెయ్యి సరఫరాలో జరిగిన అవినీతికి మీరే బాధ్యులు. ప్రజా క్షేత్రంలో తప్పు ఒప్పుకోలేక, కనీసం అసెంబ్లీకి కూడా వచ్చే ధైర్యం లేదా? 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభకు రండి, పారిపోవడం మీ నైజమా?"

"సిగ్గులేకుండా సమర్థించుకుంటారా?" - అనిత (హోం మంత్రి)
"కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్‌తో ఆడుకున్న జగన్ గారు, కనీసం పశ్చాత్తాపం చూపించాల్సింది పోయి ఎదురుదాడి చేస్తున్నారు. దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ల్యాబ్ రిపోర్టులే మొత్తుకుంటున్నా, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ సోషల్ మీడియా విన్యాసాలు చేస్తోంది. పోలీసు యంత్రాంగం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి."

"టీటీడీని దోపిడీ అడ్డాగా మార్చారు" - పయ్యావుల కేశవ్ (మంత్రి)

"గత ఐదేళ్లలో తిరుమల కొండ మీద ఆధ్యాత్మికత కంటే వ్యాపారమే ఎక్కువ జరిగింది. నెయ్యి టెండర్ల దగ్గర నుండి ప్రసాదం తయారీ వరకు ప్రతి చోటా కమీషన్లే. జగన్ అండ్ కో కలిసి సామాన్య భక్తుడి నమ్మకాన్ని అమ్మేసుకున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో లెక్కలు అడిగితే మొహం చాటేస్తున్నారు."
దేవుడితోనే ఆటలా? (మంత్రి సంధ్యారాణి)
"కలియుగ దైవం వేంకటేశ్వరస్వామిని కూడా మోసం చేసిన ఘనత జగన్ కే దక్కుతుంది. పాలతో పని లేకుండా కెమికల్స్ కలిపి నెయ్యి తయారు చేసి స్వామివారికి పెట్టారు. అడ్డంగా దొరికిపోయినా ఇంకా దబాయిస్తున్నారు. వచ్చే నెల 11న అసెంబ్లీ ఉంది కదా.. దమ్ముంటే ఆ 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అక్కడికి రావాలి. కూర్చుని మాట్లాడుకుందాం, ఎవరు తప్పు చేశారో తేల్చుకుందాం."
రోజుకో మాట.. పూటకో వేషం (మంత్రి బాలవీరాంజనేయ స్వామి)
"నెయ్యి పేరుతో జంతువుల కొవ్వును వాడి కోట్లు కొల్లగొట్టారు. ఈ పాపం బయటపడగానే వైసీపీ నేతలు రోజుకో అబద్ధం చెబుతున్నారు. తప్పు నుంచి తప్పించుకోవడానికి రకరకాల కథలు అల్లుతున్నారు."
భక్తుల మనోభావాలు ముఖ్యం కాదా? (ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజు)
"హిందువుల నమ్మకంతో ఆడుకున్న జగన్‌ను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలి. జగన్ ఏమైనా అమాయకుడా? ఆయనకు క్లీన్ చిట్ ఎవరు ఇచ్చారు? ఏ తప్పూ చేయకపోతే వైవీ సుబ్బారెడ్డి భార్య తన బ్యాంకు వివరాలు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? కోర్టులకు ఎందుకు వెళ్తున్నారు?"
తప్పుడు ప్రచారం వద్దు (శాప్ చైర్మన్ రవినాయుడు)
"డబ్బుల కోసం కక్కుర్తి పడి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. '10 శాతం కంటే తక్కువ కొవ్వు ఉంటే కనిపెట్టడం కష్టం' అని రిపోర్ట్ చెబితే.. అసలు కొవ్వే లేదని రిపోర్ట్ వచ్చిందని వైసీపీ నేతలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి."
"కరుణాకర్‌ రెడ్డి వ్యాఖ్యలు దారుణం" - కూటమి ఎమ్మెల్యేలు
"దేవుడి విగ్రహాన్ని ఒక నల్లరాయిగా అభివర్ణించిన భూమన కరుణాకర్‌ రెడ్డి లాంటి నాస్తికులను టీటీడీ చైర్మన్‌గా పెట్టడమే జగన్ చేసిన అతిపెద్ద తప్పు. అసలు భక్తి లేని వారు బోర్డులో ఉంటే ఇలాంటి అపచారాలే జరుగుతాయి."

రచ్చబండ చర్చ: కూటమి వర్సెస్ వైసీపీ

ఒకవైపు మంత్రులు "తప్పు చేశారు, శిక్ష తప్పదు" అంటుంటే.. మరోవైపు వైసీపీ నేతలు "అంతా అబద్ధం, మీరే దేవుడితో రాజకీయం చేస్తున్నారు" అని తిప్పికొడుతున్నారు.
వైసీపీ వాదన: "ఆధారాలు ఎక్కడ?" సజ్జల రామకృష్ణారెడ్డి (వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్):
పాయింట్: "ల్యాబ్ రిపోర్టుల్లో కానీ, సిట్ (SIT) రిపోర్టులో కానీ ఎక్కడా జంతువుల కొవ్వు ఉన్నట్లు నిర్ధారణ కాలేదు. చంద్రబాబు గారు కేవలం రాజకీయ లబ్ధి కోసం కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు."
ప్రశ్న: "రిపోర్టులో లేని అంశాలను ఉన్నట్టుగా ప్రచారం చేయడం భక్తులను మోసం చేయడం కాదా? ఇప్పుడు అసలైన నిజం బయటపడింది కాబట్టి చంద్రబాబు గారు భక్తులకు క్షమాపణ చెప్పాలి."
అంబటి రాంబాబు (మాజీ మంత్రి):
పాయింట్: "ఇదంతా చంద్రబాబు ఆడుతున్న ఒక పెద్ద నాటకం. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలని చూస్తున్నారు. తిరుమల పవిత్రతను మేం దెబ్బతీశామని అనడం పచ్చి అబద్ధం."
సవాల్: "నిజంగా తప్పు జరిగిందని నమ్మితే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించడానికి ఎందుకు భయపడుతున్నారు? విచారణ సంస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, ఆధారాలు ఉంటే చూపించండి."
సింపుల్‌గా .. "మీరు దేవుడి ప్రసాదాన్ని అపవిత్రం చేశారు" అని కూటమి అంటుంటే, "దేవుడి పేరు చెప్పి మీరు రాజకీయాలు చేస్తున్నారు" అని వైసీపీ అంటోంది. ఈ ఇద్దరి మధ్య అసలు నిజం ఎక్కడ ఉందో అని సామాన్య భక్తుడు అయోమయంలో పడిపోతున్నాడు.
Read More
Next Story