సంప్రదాయమే ’శక్తి‘గా..
x
సీఎం చంద్రబాబుతో కూటమి మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

సంప్రదాయమే ’శక్తి‘గా..

ఒకే రంగు చీరల్లో మెరిసిన కూటమి ఎమ్మెల్యేలు


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన శుభవేళ శనివారం ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అధికార కూటమి (TDP-JSP-BJP)కి చెందిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ఒకే రకమైన రంగు, డిజైన్ ఉన్న సంప్రదాయ చీరలను ధరించి సభకు హాజరయ్యారు. ఫిబ్రవరి 15న జరగనున్న మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కాంక్షిస్తూ వీరు ఈ ప్రత్యేక ‘డ్రెస్ కోడ్’ను ఎంచుకోవడం విశేషం.


సీఎం చంద్రబాబుతో గ్రూప్ ఫొటోలు

బడ్జెట్ ప్రసంగానికి ముందు హోం మంత్రి వంగలపూడి అనిత, ఎమ్మెల్యే బండారు శ్రావణి సహా ఇతర మహిళా ప్రజాప్రతినిధులంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆయన ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒకే విధమైన వస్త్రధారణలో ఉన్న మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రితో కలిసి అసెంబ్లీ ప్రాంగణంలో గ్రూప్ ఫొటోలు దిగారు. ఈ దృశ్యం అసెంబ్లీలో ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా, కూటమిలో ఉన్న ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది.


దసరా సమయంలో కూడా..

గతంలో కూడా దసరా నవరాత్రుల సమయంలో మహిళా నేతలు రోజుకో రంగు దుస్తులు ధరించి రాష్ట్ర సంక్షేమం కోసం పూజలు నిర్వహించి అసెంబ్లీకి హాజరయ్యేవారు. అదే సంప్రదాయాన్ని నేడు బడ్జెట్ రోజున కూడా కొనసాగించి తమ ఆధ్యాత్మికతను, బాధ్యతను చాటుకున్నారు. ఒక పక్క రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ ప్రసంగం జరుగుతుండగా, మరోపక్క మహిళా ప్రతినిధుల ఈ కోలాహలం అసెంబ్లీ వాతావరణాన్ని మరింత సందడిగా మార్చింది.


మహిళా సాధికారతకు ’బడ్జెట్‘ బాసట

మహిళా ప్రజాప్రతినిధుల ఈ ఆధ్యాత్మిక సందడి మధ్యే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3,32,205 కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ:

దీపం 2.0: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి రూ. 2,601 కోట్లు.


స్త్రీ శక్తి: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కోసం రూ. 1,420 కోట్లు. మరియు 'తల్లికి వందనం' వంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించడంపై మహిళా ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా మహిళా ప్రతినిధుల ఐక్యత, ఆధ్యాత్మికత , సంక్షేమ కేటాయింపులు చూస్తుంటే.. కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమవుతోంది.

Read More
Next Story